సాక్షి, గుంటుపల్లి (కృష్ణా) : వ్యాగన్ వర్క్‌షాపు రైల్వే వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ నిర్లక్ష్యంపై గురువారం ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ ఆధ్వర్యంలో యూనియన్ నాయకులు, కార్మికులు మధ్యాహ్నం భోజన సమయంలో వైద్యశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బ్రాంచి కార్యదర్శి గద్దా సురేష్ మాట్లాడుతూ ఆస్పత్రి వైద్యురాలు సుమలత రైల్వే కాలనీలో నివశిస్తున్న ఉద్యోగులు, కార్మికుల కుటుంబ సభ్యులు వైద్యశాలకు వెళితే దుర్భాషలాడుతున్నారని, మహిళా రోగులపై విరుచుకుపడుతోందని ఆరోపించారు.
రోగులనే కనికరం లేకుండా అసభ్య పదజాలంతో దూషించటం వలన వారి మనోభావాలు దెబ్బతింటున్నాయన్నారు. సరైన వైద్యం చేయకుండా మానసిక వత్తిడికి గురి చేస్తున్నారని ఉద్యోగులు విమర్శించారు. విషయాన్ని సామరస్యంగా పరిష్కరించుకునే ఉద్దేశ్యంతో యూనియన్ నాయకులు వైద్యశాలకు వెళితే కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా ‘ఏం చేసుకుంటారో చేసుకోమని’ తెగేసి చెప్పటం దారుణమైన విషయమన్నారు. గతంలో వైద్యుల నిర్లక్ష్యంతో అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, పలువురు అంగవైకల్యంతో మిగిలారని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈమేరకు డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజినీర్ జె.ప్రదీప్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment