అభివృద్ధి పట్టాలెక్కేనా !
సాక్షి, నెల్లూరు: ఎన్నివేలకోట్లు ఆదాయం వచ్చినా జిల్లాలో రైల్వేకి చెందిన అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగడంలేదు. గతంలో జిల్లాకు చెందిన పలువురు పార్లమెంటు సభ్యులుగా వ్యవహరించినా ఈ ప్రాజెక్టుల ప్రగతిని పట్టించుకున్న వారు లేరు. 2011లో రూ.2078 కోట్ల అంచనాతో మంజూరైన గూడూరు-దుగ్గరాజపట్నం రైల్వేలైనుకు ఇప్పటి వరకు కేవలం ఒకటిన్నర కోటి మాత్రమే కేటాయించారు.
2008లో రూ.1314 కోట్ల అంచనాలతో మంజూరైన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే మార్గానికి మంజూరైంది రూ.1.8 కోట్లు మాత్రమే. నిధులు లేకపోవడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా మారాయి. 2005లో రూ.930 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఓబుళాపురం- కృష్ణపట్నం రైల్వేలైనుకు కూడా కేవలం రూ.6 కోట్లు మాత్రమే మంజూరయ్యాయి. గత ఏడాది బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు పనులకు నయాపైసా కేటాయింపులులేవు. రూ.87 కోట్ల అంచనాతో ప్రారంభమైన కృష్ణపట్నం -వెంకటాచలం రైల్వేలైన్ పనులు అంతంత మాత్రంగా జరిగాయి. ఇక రైల్వేకు దేశవ్యాప్త గుర్తింపు నిచ్చిన బిట్రగుంటకు కొత్త ప్రాజెక్టుల ఊసేలేదు.
ఇక్కడ రైల్వేశాఖకు 1200 ఎకరాల స్థలం, 960కి పైగా క్వార్టర్స్, వివిధ విభాగాలకు చెందిన కార్యాలయాలు ఉ న్నాయి. ఈ ప్రాంతంలో కొత్త ప్రాజెక్టును నెలకొల్పితే రైల్వేపై 30 శాతానికి పైగా ఆర్థిక భారం తగ్గుతుందని నిపుణుల అంచనా. వసతులు,వనరులను ఉపయోగించుకోవడంలో రైల్వే అధికారులు కావాలనే బిట్రగుంటను విస్మరిస్తున్నారన్న విమర్శలున్నాయి. రాజకీయ నేతల ఒత్తిడి లేకపోవడం, బిట్రగుంట రైల్వే చరిత్రగానే మిగిలి పోవాల్సి వచ్చింది. 2004లో కాంక్రీట్ స్లీపర్‌ల తయారీ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. అనంతరం దానిని సైతం ఉత్తర భారతదేశానికి తరలించి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారు. అయినా ప్రజాప్రతి నిధులెవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదు.
భారీగా ఆదాయం
జిల్లాలో దాదాపు 220 కిలోమీటర్ల మేర రైలుమార్గం ఉంది. దక్షిణ మధ్యరైల్వేలో అత్యధిక ఆదాయం ఈ జిల్లానుంచే సమకూరుతోంది. ఆదాయ ఆర్జనతో పాటు అభివృద్ధికి ఆస్కారం ఉన్నా జిల్లాలో రైల్వేపనులను,ప్రాజెక్టులను పట్టించుకునేవారు కరువయ్యారు. ప్రజల అవసరాలకు తగ్గట్టు కొత్త రైళ్లను ఏర్పాటు చేయడంలో రైల్వేశాఖ, ప్రజాప్రతినిధులు నిర్లిప్తతతో వ్యవహరిస్తున్నారు. జిల్లాలో ఎనిమిది ప్రధాన రైల్వే స్టేషన్లు ఉన్నాయి. చెన్నె, తిరుపతి రైలు మార్గాలకు గూడూరు ప్రధాన జంక్షన్. గూడూరు నుంచి సికింద్రాబాద్ వెళ్లే సింహపురి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. మరో ఎక్స్‌ప్రెస్ రైలు వేస్తేగాని రద్దీ తట్టుకునే పరిస్థితి ఉండదు. కానీ దాని ఊసేలేదు. ప్రస్తుత రాష్ట్ర విభజన నేపధ్యంలో విశాఖపట్టణానికి సైతం ఎక్స్‌ప్రెస్ రైళ్లను పెంచాల్సిన అవసరముంది. ఎన్నో ఏళ్లుగా జిల్లా వాసులు విశాఖకు రైళ్లు నడపాలని చేస్తున్న విజ్ఞప్తులను సైతం రైల్వే శాఖ పట్టించుకోవడంలేదు. తాజాగా అభివృద్ధి మంత్రంతో మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉండడమే కాక కీలక భూమిక పోషిస్తున్నాడు. జిల్లాకు చెందిన రైల్వే ప్రాజెక్టులపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. చార్జీల భారంతో సరిపెట్టకుండా కనీసం ఇప్పుడైనా రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.