జిల్లా రహదారులకు మహర్దశ
- రూ. 330 కోట్లు మంజూరు
- మొదలైన 50 పనులు
- టెండర్ల దశలో మరో 50
- రెండేళ్ల కాలవ్యవధిలో పూర్తి
సాక్షి, విజయవాడ : జిల్లాలో రోడ్లు, రహదారులు భవనాల శాఖ అధికారులు అభివృద్ధి పనులను వేగవంతం చేశారు. ఏకకాలంలో భారీగా పనుల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేసి కొన్నింటిని ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులన్నింటినీ రానున్న రెండేళ్ల కాలవ్యవధిలోపు పనుల స్థాయిని బట్టి పూర్తి చేయాలని నిర్ణయించారు.
దీంతో జిల్లాలో సుదీర్ఘకాలంగా మరమ్మతుల కోసం ఎదురుచూస్తున్న రోడ్లకు మోక్షం కలిగింది. దీంతోపాటు పెండింగ్‌లో ఉన్న పలు పనులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు మంజూరు అయ్యాయి. మొత్తం రూ.300 కోట్ల విలువైన 100 పనులు జిలాల్లో జరుగుతున్నాయి. వీటిలో సుమారు 50 పనులు వరకు ఇప్పటివరకు మొదలు కాగా మరో 50 పనులు టెండర్ల దశలో ఉన్నాయి.
జిల్లాలో ఆర్‌అండ్‌బి రహదారులు మూడు జిల్లాలను కలుపుతూ ఉన్నాయి. జిల్లా నుంచి తెలంగాణా రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతున్నాయి. జిల్లాలో 2883 కిలోమీటర్లు ఆర్‌అండ్‌బి రహదారులున్నాయి. సాధారణంగా ప్రతి సంవత్సరం 200 నుంచి 300 కిలోమీటర్ల మేర రహదారులు మరమ్మతులు జరుగుతుంటాయి. ప్రధానంగా ఆర్‌అండ్‌బి నిధులతోపాటు కేంద్రప్రభుత్వ వివిధ పథకాల ద్వారా జిల్లాలో రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవుతుంటాయి.
ముఖ్యంగా నాబార్డు, నేషనల్ సైక్లోన్ రీకన్‌స్ట్రక్షన్ లిగిటేషన్ ప్రాజెక్టు (ఎన్‌సిఆర్‌ఎల్‌ఎఫ్), రూరల్ డెవలప్‌మెంట్ ఫండ్( ఆర్‌డీఎఫ్), స్పెషల్ రిపేర్స్ గ్రాంట్, 13వ ఫైనాన్స్ కమిషన్ తదితర పథకాల ద్వారా నూతన రోడ్లు, వంతెనల నిర్మాణాలు జరుగుతుంటాయి. దీంతోపాటు రాష్ట్ర ఆర్‌అండ్‌బి పరిధిలోని స్టేట్‌రోడ్స్, ప్లాన్ వర్క్స్, మెయింటెన్స్ వర్క్ తదితరాల ద్వారా సాధారణ మరమ్మతులు జరుగుతుంటాయి. అలాగే కోర్ రోడ్ నెట్‌వర్క్ పథకం ద్వారా రోడ్ల విస్తరణ, మరమ్మతులకు నిధులు మంజూరవుతుంటాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన పనులన్నీ ఆర్‌అండ్‌బి పర్యవేక్షణలోనే జరుగుతుంటాయి.
ప్రధాన పనులు...
ప్రధానంగా నగర శివారులోని నున్న వద్ద 4.6 కిలోమీటర్ల మేర రూ .10.5 కోట్ల వ్యయంతో నున్న బైపాస్‌రోడ్డు పనులు కొద్దినెలల కిత్రమే ప్రారంభించారు.
మచిలీపట్నం బైపాస్‌రోడ్డు నిర్మాణం పనులు 4 కిలోమీటర్ల మేర రూ 6 కోట్లతో సాగుతున్నాయి.
జిల్లా సరిహద్దులోని చిన్న గొల్లపాలెం పశ్చిమగోదావరి జిల్లా సరిహద్దులోని కాళీపట్నంల మధ్య రూ.26 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరో ఏడాదిలో ఇవి పూర్తయ్యే అవకాశం ఉంది.
ఎన్‌సీఆర్‌ఎల్‌ఎఫ్ పథకం ద్వారా మంజూరైన నిధులు రూ.64 కోట్లతో భవానీపురం-ఉల్లిపాలెం మధ్య వంతెన నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడానికి తేదీలు ఖరారు చేశారు.
తాళ్ళపాలెం-నారాయణపురం మధ్య రూ.9.5 కోట్ల నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి.
రూ.7.75 కోట్ల నాబార్డు నిధులతో మూడు లోలెవల్ బ్రిడ్జిలు మంజూరయ్యాయి. శ్రీరాంపురం, పేర్వంచ రోడ్డు మార్గంలో ఈ మూడు బ్రిడ్జిల నిర్మాణానికి టెండర్లు ఖరారయ్యాయి.
కంకిపాడు మండలంలోని కుందేరులో రూ.7.6 కోట్ల నాబార్డు నిధులతో హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు మొదలయ్యాయి.
కాగా ఆరు నెలల నుంచి రెండేళ్ల కాలవ్యవధిలో ఈ పనులన్నింటినీ పూర్తి చేస్తామని జిల్లా ఆర్‌అండ్‌బి ఎస్‌ఈ కె.వి. రాఘవేంద్రరావు సాక్షికి తెలిపారు.