ఒంగోలు, న్యూస్‌లైన్ : భారీ వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. ప్రాథమికంగా నష్టం అంచనా రూ.770 కోట్లకుపైమాటేనని అధికారులు తేల్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా జనం మాత్రం ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. వేలాది నివాస గృహాలు, పదుల సంఖ్యలో కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. ముంపు గ్రామాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నించడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. జిల్లా ఇన్‌చార్జి మంత్రి సాకే శైలజానాథ్, రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి, పురపాలకశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డిలు శనివారం జిల్లాకు వస్తుండటంతో అధికారులు తాత్కాలికంగా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు.
కూలీలు సురక్షితం
గురువారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఎట్టకేలకు శుక్రవారం క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. యర్రగొండపాలెంలో పశువులమేత కోసం వెళ్లి దాదాపు 70 మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. తీగలేరు, దొంగలవాగు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. వాగులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సును బయటకు తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండపి సమీపంలోని ముసి వాగు అవతల చిక్కుకున్న 300 మంది రాజమండ్రికి చెందిన కూలీలు, మరో 100 మంది కొండపికి చెందిన కూలీలను అధికారులు మరబోట్ల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చే పనిలో ఉన్నారు. దీని కోసం పాకల సముద్ర తీరం నుంచి బోట్లు తెప్పించారు. జరుగుమల్లి మండలం సాదువారిపాలెం శుక్రవారం రాత్రికి కూడా జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. చీరాలలో 5 వేల చేనేత గృహాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి.
అద్దంకి నియోజకవర్గంలో 150 ఇళ్లు కూలిపోయాయి, 14 గేదెలు, 15 గొర్రెలు చనిపోయాయి. చీరాల ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్‌కు గండిపడటంతో సమీపంలోని సవరపాలెం బ్రిడ్జికి ముప్పు పొంచి ఉంది. కొత్తపట్నం మార్గంలో ఉప్పువాగు పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. కందుకూరు ప్రాంతంలో కాలనీల్లో చేరిన నీటిని బయటకు పంపలేదు. ఒంగోలులో కూడా ఇంకా పెద్ద ఎత్తున నీరు నిలిచే ఉంది. పర్చూరు ప్రాంతంలో కాలనీల్లో చిక్కుకున్న నీటిని బయటకు పంపే పరిస్థితి లేకుండా పోయింది. దేవరపాలెం క్రాస్‌రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గిద్దలూరులో 14 వేల ఎకరాలు నీటమునిగాయి. కాకర్ల డ్యామ్ వద్ద భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. దీంతో 14 గ్రామాలకు రాకపోకలు లేకుండా పోయాయి. ఆర్టీసీ అధికారులు శుక్రవారం దాదాపు 30 సర్వీసులను తిప్పలేదు. ప్రధానంగా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వరదనీరు విపరీతంగా వస్తుండటంతో 9 గేట్లు తెరిచారు.
ప్రాథమిక నష్టం అంచనా వివరాలు..
జిల్లాకు మంత్రులు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ప్రాథమిక అంచనాలను తయారు చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు రూ. 770 కోట్లకుగాపైగా జిల్లాలో నష్టం వాటిల్లిందని అధికారులు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆర్‌అండ్‌బీకి చెందిన 30.106 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, దానికోసం రూ. 97.15 కోట్లు అవసరమవుతాయని నివేదించనున్నారు. పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలో మరమ్మతులకు రూ. 229.21 కోట్లు అవసరమవుతాయని తేల్చారు.
భారీ వర్షం: ప్రాథమిక నష్టం అంచనా.. 770 కోట్ల పైనే
Published Sat, Oct 26 2013 5:42 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM
Advertisement
Advertisement