sailaja nath
-
ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు
తిరుచానూరు(చిత్తూరు): ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, ప్రత్యేక హోదా సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి సాకె శైలజానాధ్ విమర్శించారు. చిత్తూరు జిల్లా తిరుచానూరు సమీపంలోని దామినేడు ఇందిరమ్మ గృహ సముదాయం వద్ద గురువారం సాయంత్రం సామూహిక దీక్ష వాల్‌పోస్టర్లను మాజీ మంత్రితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు బీజేపీ నాయకులు విభజన నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత మాట మారుస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యిందని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వెంటనే అమలుచేయాలని, పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని, రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీని వెంటనే అమలుచేయాలని, ఏపీ పునర్విభన చట్టాల్లోని అన్ని అంశాలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2వ తేదీ శనివారం గుంటూరులో సామూహిక దీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ దీక్షకు రాష్ట్ర ప్రజలందరూ తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
మాజీ మంత్రి శైలజానాథ్ పై ఫిర్యాదు
హైదరాబాద్: మాజీ మంత్రి శైలజానాథ్ తమను ఉద్యోగాలతో పేరుతో మోసం చేశారంటూ కొంతమంది బాధితులు నగర కమీషనర్ మహీందర్ రెడ్డిని ఆశ్రయించారు. హ్యపీ ఇండియా టెక్నో కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చైర్మన్ గా ఉన్న శైలజానాథ్ తమను మోసం చేసారంటూ వారు మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. హ్యాపీ ఇండియా టెక్నో కార్పోరేషన్ పేరుతో తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి మోసం చేశారని బాధితులు పేర్కొన్నారు. -
సీమాంధ్ర అభివృద్ధికి రూ. 60 వేల కోట్లు కావాలి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వేలాది కోట్ల రూపాయిల నిధులు అవసరమని మాజీ మంత్రి శైలజా నాథ్ అభిప్రాయపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రం నుంచి అదనంగా 60 వేల కోట్ల రూపాయిల నిధులు తీసుకురావాలని కోరారు. ఉమ్మడి రాజధాని అయిన జంట నగరాలకు స్వయం ప్రతిపత్తి కల్పించేలా చూడాల్సిన అవసరముందని శైలజా నాథ్ అన్నారు. గతంలో మాదిరిగా భద్రాచలం డివిజన్‌ను ఆంధ్రలో కలపాలని చెప్పారు. -
టీడీపీయే బీ ఫాం ఇచ్చింది: శైలజానాథ్
శింగనమల కాంగ్రెస్ అభ్యర్థి శైలజానాథ్ అనంతపురం, న్యూస్‌లైన్: తాను కోరకపోయినా టీడీపీయే బీఫాం ఇచ్చిం దని మాజీ మంత్రి, శింగనమల అసెంబ్లీ కాంగ్రెస్ అభ్యర్థి సాకే శైలజానాథ్ స్పష్టం చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ నుంచి మారుతున్నట్లు వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. శింగనమల అసెంబ్లీ స్థానానికి టీడీపీ నుంచి బీ ఫాం వచ్చిన మాట వాస్తవమేనని, అది తరిమెల కోనారెడ్డి వద్దే ఇప్పటికీ ఉందన్నారు. తాను టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఇష్టపడటంలేదన్నారు. ఆ పార్టీ తరఫునే నామినేషన్ వేయాలనుకుంటే బహిరంగంగా ప్రకటించేవాడినని చెప్పారు. -
సిగ్గు లేకుండా ఎందుకొచ్చావ్..?
శైలజానాథ్‌పై శివాలెత్తిన ఎమ్మెల్సీ శమంతకమణి టీడీపీ, కాంగ్రెస్ తరపున నామినేషన్లు వేసిన శైలజానాథ్ చివరకు కాంగ్రెస్ తరపున పోటీలో ఉన్నానని ప్రకటన శింగనమల, సభ్యత్వం లేకున్నా సిగ్గు లేకుండా టీడీపీ తరఫున పోటీ చేయడానికి వచ్చావా అని మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్‌పై టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా తహశీల్దారు కార్యాలయంలో శైలజానాథ్ నామినేషన్ దాఖలు చేస్తుండగా.. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్రస్థాయిలో దూషించారు. ‘కాంగ్రెస్‌లో ఎమ్మెల్యేగా ఉండి, టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి.. ఇప్పుడు మా పార్టీ తరఫున దొంగ బీ-ఫాంతో నామినేషన్ వేయాలని వచ్చావా..? చంద్రబాబు, సీఎంరమేష్ మాకు నామినేషన్ వేసుకోవాలని సూచించారు. మా అమ్మాయి యామిని బాల నామినేషన్ వేస్తున్నారు. అయితే, బీ-ఫాం నాకిచ్చారని డ్రామా ఆడుతున్నావా’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామ్మోహన్ దగ్గరకు వెళ్లి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున శైలజానాథ్ నామినేషన్ వేశారని, మళ్లీ టీడీపీ తరఫున ఎలా నామినేషన్ వేయిస్తారని శమంతకమణి ప్రశ్నించారు. ఈ విషయాలు మీరు బయటే మాట్లాడుకోవాలని సదరు అధికారి సూచించడంతో పోలీసులు ఎమ్మెల్సీని బయటకు తీసుకెళ్లారు. చివరకు శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరోసారి నామినేషన్ వేసి బయటకు వచ్చారు. శైలజానాథ్ టీడీపీ అభ్యర్థిగా నామినేషన్ ఇచ్చి వెంటనే వెనక్కు తీసుకున్నట్టు తెలిసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశా: శైలజానాథ్ తనకు ఇతర పార్టీల నుంచి ఒత్తిళ్లు, బీ-ఫాంలు వచ్చినా చివరకు కాంగ్రెస్ పార్టీ తరఫునే శింగనమల అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశానని మాజీ మంత్రి శైలజానాథ్ పేర్కొన్నారు. నామినేషన్ వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ పార్టీ ద్వారానే రాజకీయంగా ఎదిగానన్నారు. ఉదయం నుంచి అందరూ రకరకాలుగా ఊహించుకున్నారని, అవేవీ నిజం కాదన్నారు. -
ఎత్తు.. చిత్తు..
అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గ ప్రజలను కనికట్టు చేసి, లబ్ధి పొందేందుకు మాజీ మంత్రి శైలజానాథ్ వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని రూ.40 కోట్లతో విస్తరిస్తే.. శింగనమల నియోజకవర్గంలోని 73 గ్రామాలకు తాగునీళ్లు అందించవచ్చునని గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టి.. రూ.150 కోట్లతో శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక పథకాన్ని 2013 నవంబర్ 25న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి చేసి శైలజానాథ్ మంజూరు చేయించుకున్నారు. అయితే జేసీ నాగిరెడ్డి పథకాన్ని ఇటీవల తనిఖీ చేసిన ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ చక్రపాణి.. శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక నీటి పథకాన్ని చేపట్టడమంటే రూ.110 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడమేనని ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రతిపాదనతో శింగనమల తాగునీటి పథకం రద్దు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇది మాజీ మంత్రి శైలజానాథ్‌ను ఇరకాటంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే.. తాడిపత్రి, గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల్లోని 561 గ్రామాలు, రెండు మున్సిపాల్టీల్లోని ప్రజలకు రోజుకు తలసరి 70 లీటర్ల నీటిని అందించేందుకు రూ.508 కోట్ల వ్యయంతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. ఈ పథకానికి వైఎస్సార్ జిల్లాలోని గండికోట జలాశయం నుంచి మూడు టీఎంసీల నీటిని కేటాయించారు. ఇప్పటిదాకా ఈ పథకంలో రూ.396.16 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మూడేళ్లుగా బిల్లులను చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. రూ.396.16 కోట్లను ఖర్చు చేసినా ఒక్క గ్రామానికి కూడా నీళ్లందించలేని దుస్థితి నెలకొంది. -
శైలజానాథ్ మాటలు బాధాకరం: ఈటెల
పంజగుట్ట, న్యూస్‌లైన్: దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించనున్న తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల సహకారంతో అభివృద్ధిలో దూసుకువెళ్లాలని.. అప్పుడే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి సరైన సమాధానం లభిస్తుందని టీఆర్ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, తెలంగాణ ఎక్స్టెన్షన్ అధికారుల సంఘం క్యాలెండర్‌ను అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.భాస్కర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు జి.యాదగిరి గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అసెంబ్లీలో శైలజానాథ్ మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని వేదనకు గురిచేశాయన్నారు. శాసనసభలో, పార్లమెంట్లో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చేరవేసే భాధ్యత గ్రామ కార్యదర్శులదేనని, ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శుల వేతనాలు మరీ తక్కువగా ఉండటం బాధాకరమన్నారు. ఈ డిపార్ట్మెంట్లో నియామకాలు లేకపోవడం దారుణమన్నారు. గ్రామీణ వ్యవస్థ సరిగా ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసుల రక్షణ లేకుండా ప్రజల్లోకి వెళ్లవచ్చునని, కాని ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అభివృద్ధి ఫలాలను రాజ్యాంగం సాక్షిగా అర్హులకు అందించే సత్తా కేవలం గ్రామ కార్యదర్శులకు మాత్రమే ఉంటుందని, రాబోయే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ కార్యదర్శులు కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ గ్రామకార్యదర్శి ఉద్యోగానికి డిగ్రీ అర్హత పెట్టి, డిగ్రీ అర్హత ఉన్న వారికి ఎంత వేతనం చెల్లించాలో కూడా ఈ పాడు ప్రభుత్వానికి తెలియదన్నారు. ప్రస్తుతం సీమాంధ్ర శాసన సభ్యుల మాటలు వింటుంటే పదేళ్లు ఉమ్మడి రాజధాని కాదు, పదినిమిషాలు కూడా కలిసి ఉండేలేని పరిస్థితి ఉందన్నారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నూతన శకాన్ని నిర్మించుకునేందుకు రాజకీయ వ్యవస్థను, నాయకులను మార్చాల్సిన అసరం ఉందన్నారు. కార్యక్రమంలో పంజాయతీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్‌రెడ్డి, ఉద్యోగ సంఘం నాయకులు శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, వెంకటపతి రాజు, రంగాచారి, సురేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, రాజేందర్ రెడ్డిలతో పాటు పది జిల్లాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. -
శైలజానాథ్ శాఖ మార్పుపై సమాచారం ఇవ్వలేదే?
హైదరాబాద్: మంత్రి శైలజానాథ్ శాఖ మార్పుపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ఆయన శాఖను శాసనసభ వ్యవహారాలకు మారుస్తున్నట్లు తమకు సమాచారం ఇవ్వలేదని విమర్శించారు. శాసన సభ్యులకు ఎలాంటి బులెటిన్ ఇవ్వకుండా శాఖ మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. అసెంబ్లీ నడిచే సమయంలో మంత్రులు శాఖలు మారిస్తే ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలికదా?అని ప్రశ్నించారు. -
వాణిజ్య పన్నుల శాఖ వద్దేవద్దు
వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పదవికి అర్హులైన వారు ఎంతో మంది మంత్రివర్గంలో ఉన్నారని రాష్ట్ర మంత్రి డి.శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అలాంటి వారి ఆ శాఖ అప్పగిస్తే బాగుండేదని ఆయన పేర్కొన్నారు. బుధవారం శ్రీధర్ బాబు హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. సీఎం కిరణ్‌కు మంత్రిత్వ శాఖలను మర్చే అధికారం ఉందని అభిప్రాయపడ్డారు. తనకు వాణిజ్య పన్నుల శాఖ వద్దే వద్దని శ్రీధర్ బాబు తెగేసి చెప్పారు. శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబును వాణిజ్య పన్నుల శాఖ బాధ్యలు అప్పగిస్తు సీఎం కిరణ్ నిర్ణయం తీసుకున్నారు. అయితే శాసనసభ వ్యవహరాల శాఖ బాధ్యతలను మంత్రి ఎస్. శైలజానాథ్‌కు అప్పగించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన సమయంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన శ్రీధర్ బాబు శాసన సభ వ్యవహరాల బాధ్యతల నుంచి తప్పించడం పట్ల ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు ఆగ్రహంగా ఉన్నారు. అధికాక సమైక్య ఉద్యమంలో శైలజానాథ్ కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు సీఎం కిరణ్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే సహచర మంత్రులతో చర్చించి తర్వాత తన భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటానని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా వెల్లడించారు. -
శ్రీధర్‌బాబు శాఖ మారింది
శైలజానాథ్‌కు శాసనసభ వ్యవహారాల శాఖ కేబినెట్లో ఆకస్మిక మార్పులు చేసిన కిరణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గంలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఫోరం కన్వీనర్ డాక్టర్ శైలజానాథ్‌కు శాసనసభ వ్యవహారాలను అదనంగా అప్పగించారు. ఇప్పటివరకు ఈ శాఖను చూస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు వాణిజ్య పన్నుల శాఖను అదనంగా కట్టబెట్టారు. కొత్తగా ఏర్పాటు చేసిన భాషా, సాంస్కృతిక శాఖను పర్యాటక శాఖ మంత్రి వట్టి వసంతకుమార్‌కు కేటాయించారు. ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఆయా శాఖల మార్పులు చేర్పులకు సంబంధించిన ఫైలుపై సంతకం చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి రాత్రి 10.30 గంటలకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల ప్రొరోగ్ అంశంతో పాటు, రాష్ట్ర విభజన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టే అంశంలో.. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబుకు, ముఖ్యమంత్రి కిరణ్‌కు మధ్య అభిప్రాయభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలను ప్రొరోగ్ చేయాలని సీఎం పట్టుపట్టినా.. సంబంధిత ఫైలును శ్రీధర్‌బాబు తనవద్ద అట్టిపెట్టుకున్న విషయం విదితమే. అలాగే.. సీఎం అభిమతానికి భిన్నంగా.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013కు మద్దతు తెలుపుతూ దీనిపై చర్చను ప్రారంభిస్తున్నట్లు శ్రీధర్‌బాబు డిసెంబర్ 16న శాసనసభలో ప్రకటించారు. ఈ పరిణామాన్ని సీఎం సహా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జీర్ణించుకోలేకపోయారు. ఆ మరుసటి రోజు సీఎం మీడియాతో మాట్లాడుతూ.. నిబంధనలను పరిశీలిస్తే సభలో విభజన బిల్లును ఇంతవరకు ప్రవేశపెట్టలేదని వివరణ ఇచ్చారు. అయితే శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క సీఎం వ్యాఖ్యలను కొట్టిపారేశారు. బీఏసీలో తీసుకున్న నిర్ణయం మేరకే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు అసెంబ్లీలో విభజన బిల్లును ప్రవేశపెట్టారని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సమైక్యవాదుల దృష్టిలో పలుచన అయ్యాననే భావనతో ఉన్న సీఎం.. మరో రెండు రోజుల్లో శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభం కాబోతున్న తరుణంలో శ్రీధర్‌బాబును శాసనసభ వ్యవహారాల శాఖ నుంచి తప్పించటం చర్చనీయాంశమైంది. శ్రీధర్‌బాబు తన మాట విననందుకే ఆయనను శాసనసభ వ్యవహారాల బాధ్యతల నుంచి తప్పించి, తనకు సన్నిహితుడు, సమైక్యవాదం వినిపిస్తున్న శైలజానాథ్‌కు ఆ శాఖను కిరణ్ కట్టబెట్టినట్లు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తద్వారా సభలో త నదే పైచేయి సాధించేలా వ్యూహం రూపొందించారని అభిప్రాయపడుతున్నారు. ఈ మార్పు వల్ల ఒకవేళ దీనిపై తెలంగాణవాదులు రాద్ధాంతం చేసి సభ జరగకుండా చేస్తే పరోక్షంగా తమకే లాభం జరుగుతుందని వారు చెప్తున్నారు. తెలంగాణవాదుల గొడవ వల్ల సభను జరపలేకపోయామని రాష్ట్రపతికి లేఖ రాస్తూ విభజనపై అసెంబ్లీ అభిప్రాయం తెలిపేందుకు మరో పక్షం రోజుల గడువు కోరతామని పేర్కొన్నారు. అంతా వ్యూహం ప్రకారమేనా..?: కొత్త సంవత్సరం ఆరంభంలో సీఎం చర్యలు కొంత విస్మయానికి గురిచేసినప్పటికీ.. కాంగ్రెస్ తెలంగాణ నేతలు మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారు. సీఎం ఏం చేసినా దానివల్ల తెలంగాణ వాదానికి జరిగే నష్టమేమీ లేదని, పెపైచ్చు శాసనసభ వ్యవహారాలవల్ల ఒరిగేది కూడా ఏమీ లేదని అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా శ్రీధర్‌బాబుకు వాణిజ్య పన్నుల శాఖను ఇవ్వడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక ఆదాయం వాణిజ్య పన్నుల శాఖదే. ఏటా రూ. 40 వేల కోట్ల పైచిలుకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న కీలకమైన వాణిజ్య పన్నుల శాఖను కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటి వరకు ఎవరికీ కట్టబెట్టలేదు. అంతటి ముఖ్యమైన శాఖను శ్రీధర్‌బాబుకు అప్పగించడం పట్ల సీమాంధ్ర నేతలతో పాటు తెలంగాణ మంత్రులూ విస్మయం చెందుతున్నారు. శ్రీధర్‌బాబు తీరుపై సీఎంకు నిజంగా కోపముంటే ఇంతటి కీలకమైన శాఖను కట్టబెట్టి పదోన్నతి ఎందుకు కల్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదంతా ఒక వ్యూహం ప్రకారం జరిగిందని, దీనిపై తాము పెద్దగా స్పందించదలచుకోలేదని తెలంగాణ సీనియర్ మంత్రి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదిలావుంటే.. శ్రీధర్‌బాబు శాఖ మార్పుకు నిరసనగా కరీంనగర్లో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం కిరణ్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ మార్పులపై ఆందోళన అక్కర్లేదు: కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ మార్పులపై తెలంగాణవాదులు, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరుగుతున్న తరుణంలో ఇలాంటి వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదని అభిప్రాయపడ్డారు. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడం కేవలం భారత పార్లమెంటుకు ఉన్న సార్వభౌమాధికారమే తప్ప మరెవరికీ లేదని పేర్కొన్నారు. అనవసరమైన ఆందోళనలకు, ఆవేశాలకు ఎవరూ లోనుకావద్దని విజ్ఞప్తి చేసిన కేసీఆర్.. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
నేటి రాష్ర్ట స్థాయి సైన్స్‌ఫేర్ వాయిదా
అనంతపురం ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : నార్పలలో శనివారం నుంచి సోమవారం వరకు జరగాల్సిన రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను వాయిదా వేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి మధుసూదన్‌రావు తెలిపారు. రాష్ర్ట విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంతో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాథ్ ఆదేశాల మేరకు ఇన్‌స్పైర్‌ను వాయిదా వేసినట్లు డీఈఓ వివరించారు. మళ్లీ ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామన్నారు. -
అక్షరయజ్ఞం సాగిద్దాం..
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘నిరక్షరాస్యులైన అమ్మకు, నాన్నకు అక్షరం నేర్పిద్దాం. సంపూర్ణ అక్షరాస్యత సాధిద్దాం. వంద రోజుల్లో పది లక్షల మందిని అక్షరాస్యులను చేద్దాం. భారతదేశ అక్షర యజ్ఞ చరిత్రలోనే ప్రకాశం జిల్లాను సువర్ణాక్షరాలతో లిఖిద్దామని’ జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్ పిలుపునిచ్చారు. ‘ప్రకాశం అక్షర విజయం’ కార్యక్రమ ర్యాలీని ఆదివారం ఆయన కలెక్టరేట్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నెల్లూరు బస్టాండు, భాగ్యనగర్, రామ్‌నగర్ మీదుగా సభా స్థలైన మినీ స్టేడియం వరకు సాగింది. కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మితో కలిసి జ్యోతిప్రజ్వలన చేశారు. అనంతరం శాంతి కపోతాలను ఎగుర వేశారు. ఈ సందర్భంగా అక్షర విజయంలో భాగస్వాములైన అధికారులు, వలంటీర్లనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘ప్రకాశం జిల్లాలో విభిన్న పరిస్థితులున్నాయి. అత్యంత క్లిష్టమైన బాధ్యతను కలెక్టర్ విజయకుమార్ భుజాన వేసుకున్నారు. అక్షరాస్యతలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ కింద నుంచి నాలుగైదు స్థానాల్లో ఉంది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా పదహారో స్థానంలో ఉంది. అక్షరాస్యత కోసం నియమించిన సాక్షరతా సిబ్బంది అప్పుడప్పుడూ కనిపిస్తారు. ఎక్కువసార్లు వినిపిస్తుంటారు. అరవై శాతం అక్షరాస్యత సాధించి నూరుశాతం సాధించినట్లు లెక్కలు వేస్తుంటారు. జిల్లాలో 30 లక్షల మంది జనాభా ఉన్నారు. అందులో 20 లక్షల మంది చదువుకున్నారు. చదువుకున్న ఇద్దరు శ్రద్ధపెట్టి మరొకరిని చదివిస్తే పది లక్షల మంది అక్షరాస్యులవుతారని’ వెల్లడించారు. రాష్ట్రంలో విభజన ఉద్యమాలు జరగకుండా ప్రశాంతంగా ఉంటే అక్షరాస్యులవుతున్న ఆ పది లక్షల మందిని చూసి తెలుగుతల్లి గర్వపడేదన్నారు. అక్షరం వస్తే జ్ఞానాన్ని పెంపొందించుకోవడంతోపాటు భగవద్గీత, బైబిల్, ఖురాన్ కూడా చదువుకోవచ్చని తెలిపారు. రాష్ట్రంలో రకరకాల వాదనలు వింటున్నామని, సందేహాలకు తావులేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 23 జిల్లాలతో కలిసి ఉండాలంటూ సమైక్యాంధ్ర వర్ధిల్లాలని నినాదాలు చేశారు. చదువుకుందాం.. పిల్లలను తీర్చిదిద్దుదాం కేంద్ర మంత్రి పనబాక ‘మనం చదువుకుందాం. మంచిమాటలు చెప్పి పిల్లలను తీర్చిదిద్దుదాం. వారిని ఉన్నత స్థానంలో నిలుపుదామని’ కేంద్ర పెట్రోలియం శాఖ సహాయమంత్రి పనబాక లక్ష్మి ఉద్బోధించారు. ప్రకాశం అక్షర విజయం సభలో ఆమె విశిష్ట అతిథిగా ప్రసంగించారు. ఒక కుటుంబం బాగుపడాలన్నా, చెడిపోవాలన్నా మహిళపైనే ఆధారపడి ఉందని, నిరక్షరాస్యులైన మహిళలు అక్షరాస్యులైతే తమ బిడ్డలను ఉన్నతస్థాయిలో తీర్చిదిద్దుకునే అవకాశం ఉందన్నారు. చదువుకోకుంటే మోసపోతారని హెచ్చరించారు. ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ ఒక మహిళ చదివితే ఇంటిల్లిపాదికీ చదువు ఉంటుందన్నారు. ఈ జిల్లాకు చెందినవారు గతంలో ఉన్నత చదువులకు ఇతర జిల్లాలకు వెళ్లేవారని, ప్రస్తుతం ప్రకాశం జిల్లా ఎడ్యుకేషనల్ హబ్‌గా మారిందన్నారు. కొండపి శాసనసభ్యుడు జీవీ శేషు మాట్లాడుతూ అజ్ఞానంలో నుంచి విజ్ఞానానికి రావడానికి చదువు దోహదపడుతుందన్నారు. మాస్టర్‌గా ఉన్న తృప్తి మంత్రిగా ఉన్నా లేదన్నారు. గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు మాట్లాడుతూ తాను చదువుకోలేకపోవడం వల్ల ఇంగ్లిష్‌లో కార్యకలాపాలు సాగించాలంటే మరొకరి సాయం తీసుకోవలసి వస్తోందన్నారు. రెండు లక్షల మంది ఓటర్లకు ప్రజాప్రతినిధిని అయినా చదువులో వెనుకబడినట్లు తెలిపారు. చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రకాశం అక్షర విజయం సామాజిక చిత్రం కావాలని, ఈ చిత్రానికి కలెక్టర్ డెరైక్టర్ కావాలన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యుడు బీఎన్ విజయకుమార్ మాట్లాడుతూ చదువులేకపోతే హక్కులు తెలుసుకోలేరన్నారు. శాసనమండలి సభ్యుడు పోతుల రామారావు మాట్లాడుతూ కేరళలో వనరులు లేకపోయినా వందశాతం అక్షరాస్యత సాధించి అభివృద్ధి చెందారన్నారు. ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా కేరళవాసులు కనిపిస్తారని చెప్పారు. యజ్ఞంలా అక్షరాస్యత: కలెక్టర్ వంద రోజుల్లో పదిలక్షల మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయడాన్ని యజ్ఞంగా భావించి ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ విజయకుమార్ వెల్లడించారు. జిల్లాలో 73 శాతం పురుషులు, 58 శాతం మహిళలు అక్షరాస్యులుగా ఉన్నారన్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా అనుకున్నంత అభివృద్ధి సాధించలేదన్నారు. అక్షర విజయంలో పాలుపంచుకునే వలంటీర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వడంతోపాటు వారి సేవలను పరిగణనలోకి తీసుకుంటానని హామీ ఇచ్చారు. జిల్లా జడ్జి రాధాకృష్ణ మాట్లాడుతూ పదిలక్షల మందిని అక్షరాస్యులను చేసి రాష్ట్రంలో పదహారవ స్థానంలో ఉన్న జిల్లా ఒకటో స్థానంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్పీ ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ అక్షర విజయంలో తమ వద్ద ఉన్న మూడువేల మంది సిబ్బందితో సహకరిస్తానని హామీ ఇచ్చారు. ప్రతి గ్రామానికి ఒక కానిస్టేబుల్‌ను పెట్టి అక్షరాస్యతకు కృషి చేయడంతోపాటు శాంతిభద్రతలు పర్యవేక్షించేలా చూస్తానన్నారు. ఈ సందర్భంగా అక్షరాస్యతకు సంబంధించి ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. జెండర్ సభ్యులు నృత్య ప్రదర్శన చేశారు. -
వైఎస్సార్ సీపీలో చేరిన కాంగ్రెస్ నేత బాలనాగిరెడ్డి
అనంతం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసల పరంపర కొనసాగుతూనే ఉంది. జిల్లా కాంగ్రెస్ నేత బాలనాగిరెడ్డి శుక్రవారం వైఎస్సార్ సీపీలో చేరారు. బాలనాగిరెడ్డితో సహా వెయ్యి మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి, పార్టీ నేతలు తోపుదుర్తి కవిత, ఆలూరు సాంబశివారెడ్డిలు హాజరైయ్యారు. బాలనాగిరెడ్డిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి వైఎస్సార్ సీపీ కండువా కప్పారు. దీంతో ఆ జిల్లాకు చెందిన మంత్రి శైలజానాథ్‌కు ఎదురుదెబ్బ తగిలినట్టయ్యింది. -
భారీ వర్షం: ప్రాథమిక నష్టం అంచనా.. 770 కోట్ల పైనే
ఒంగోలు, న్యూస్‌లైన్ : భారీ వర్షంతో జిల్లా అతలాకుతలమైంది. ప్రాథమికంగా నష్టం అంచనా రూ.770 కోట్లకుపైమాటేనని అధికారులు తేల్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టినా జనం మాత్రం ఇంకా బిక్కుబిక్కుమంటూనే ఉన్నారు. వేలాది నివాస గృహాలు, పదుల సంఖ్యలో కాలనీలు నీటిలోనే ఉండిపోయాయి. ముంపు గ్రామాలను సాధారణ స్థితికి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నించడం లేదన్న విమర్శలూ వెల్లువెత్తాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి సాకే శైలజానాథ్, రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి, పురపాలకశాఖ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డిలు శనివారం జిల్లాకు వస్తుండటంతో అధికారులు తాత్కాలికంగా ప్రాథమిక అంచనాలు సిద్ధం చేశారు. కూలీలు సురక్షితం గురువారం రాత్రి వరకు పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వారు ఎట్టకేలకు శుక్రవారం క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. యర్రగొండపాలెంలో పశువులమేత కోసం వెళ్లి దాదాపు 70 మంది జలదిగ్బంధంలో చిక్కుకుపోయారు. వారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. తీగలేరు, దొంగలవాగు ఇంకా ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. వాగులో ఇరుక్కుపోయిన ఆర్టీసీ బస్సును బయటకు తెచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండపి సమీపంలోని ముసి వాగు అవతల చిక్కుకున్న 300 మంది రాజమండ్రికి చెందిన కూలీలు, మరో 100 మంది కొండపికి చెందిన కూలీలను అధికారులు మరబోట్ల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు చేర్చే పనిలో ఉన్నారు. దీని కోసం పాకల సముద్ర తీరం నుంచి బోట్లు తెప్పించారు. జరుగుమల్లి మండలం సాదువారిపాలెం శుక్రవారం రాత్రికి కూడా జలదిగ్బంధంలోనే ఉండిపోయింది. చీరాలలో 5 వేల చేనేత గృహాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. అద్దంకి నియోజకవర్గంలో 150 ఇళ్లు కూలిపోయాయి, 14 గేదెలు, 15 గొర్రెలు చనిపోయాయి. చీరాల ఈపూరుపాలెం స్ట్రెయిట్ కట్కు గండిపడటంతో సమీపంలోని సవరపాలెం బ్రిడ్జికి ముప్పు పొంచి ఉంది. కొత్తపట్నం మార్గంలో ఉప్పువాగు పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంది. కందుకూరు ప్రాంతంలో కాలనీల్లో చేరిన నీటిని బయటకు పంపలేదు. ఒంగోలులో కూడా ఇంకా పెద్ద ఎత్తున నీరు నిలిచే ఉంది. పర్చూరు ప్రాంతంలో కాలనీల్లో చిక్కుకున్న నీటిని బయటకు పంపే పరిస్థితి లేకుండా పోయింది. దేవరపాలెం క్రాస్‌రోడ్డు తెగిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గిద్దలూరులో 14 వేల ఎకరాలు నీటమునిగాయి. కాకర్ల డ్యామ్ వద్ద భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలను నిలిపివేశారు. దీంతో 14 గ్రామాలకు రాకపోకలు లేకుండా పోయాయి. ఆర్టీసీ అధికారులు శుక్రవారం దాదాపు 30 సర్వీసులను తిప్పలేదు. ప్రధానంగా గుండ్లకమ్మ ప్రాజెక్టుకు వరదనీరు విపరీతంగా వస్తుండటంతో 9 గేట్లు తెరిచారు. ప్రాథమిక నష్టం అంచనా వివరాలు.. జిల్లాకు మంత్రులు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా పలు ప్రాంతాలను పరిశీలించడంతో పాటు ప్రాథమిక అంచనాలను తయారు చేశారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం దాదాపు రూ. 770 కోట్లకుగాపైగా జిల్లాలో నష్టం వాటిల్లిందని అధికారులు ప్రణాళిక సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ఆర్‌అండ్‌బీకి చెందిన 30.106 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని, దానికోసం రూ. 97.15 కోట్లు అవసరమవుతాయని నివేదించనున్నారు. పంచాయతీ రాజ్‌శాఖ పరిధిలో మరమ్మతులకు రూ. 229.21 కోట్లు అవసరమవుతాయని తేల్చారు. -
'కొత్త రాజధానిపై బాబు మాట్లాడటం ప్రజా ద్రోహం'
హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేపట్టబోయే బస్సు యాత్రపై మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. అది ఆత్మగౌరవ యాత్ర కాదు..ఆత్మద్రోహ యాత్ర అని ఆయన విమర్శించారు. సమైక్య రాష్ట్రం కోసం సీమాంధ్రులు ఉద్యమిస్తుంటే.. కొత్త రాజధానిపై బాబు మాట్లాడటం విడ్డూరమేనన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన ఆయన ఏముఖం పెట్టుకుని సీమాంధ్రలో యాత్ర చేస్తారన్నారు. సీమాంధ్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచి యాత్ర చేస్తే వారే ఆయనకు తగిన బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు. సీమాంధ్రలో ఆగస్టు 25వ తేదీ నుంచి బస్సుయాత్రను చేపడుతున్నట్లు ముందుగా చంద్రబాబు ప్రకటించినా అనివార్య కారణాల వల్ల వాయిదా వేశారు. ఓ దశలో ఎలాగైనా యాత్రను చేపట్టేద్దామని నిర్ణయించుకున్న బాబుకు సీమాంధ్ర నేతలు అసలు సంగతి చెప్పి రెండు కళ్ల సిద్ధాంతం వికటించిందని కళ్లు తెరిపించారు. దీంతో బాబు బస్సు యాత్రకు బ్రేక్ పడింది. తొలుత ప్రకటించిన షెడ్యల్ ప్రకారం విజయనగరం జిల్లా కొత్త వలస నియోజకవర్గం నుంచి రోడ్ షోను ఆరంభించాల్సి ఉంది. కాగా, ఆయన తాజాగా చేపట్టనున్న యాత్రపై సర్వత్రా విమర్శలు ఊపందుకున్నాయి.