పంజగుట్ట, న్యూస్‌లైన్:
దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించనున్న తెలంగాణ రాష్ట్రం అన్ని వర్గాల ప్రజల సహకారంతో అభివృద్ధిలో దూసుకువెళ్లాలని.. అప్పుడే తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి సరైన సమాధానం లభిస్తుందని టీఆర్‌ఎస్ శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ అన్నారు. ఆదివారం ఖైరతాబాద్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, తెలంగాణ ఎక్స్‌టెన్షన్ అధికారుల సంఘం క్యాలెండర్‌ను అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.భాస్కర్‌రెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు జి.యాదగిరి గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్‌లతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అసెంబ్లీలో శైలజానాథ్ మాటలు యావత్ తెలంగాణ సమాజాన్ని వేదనకు గురిచేశాయన్నారు. శాసనసభలో, పార్లమెంట్‌లో తీసుకున్న నిర్ణయాలను ప్రజలకు చేరవేసే భాధ్యత గ్రామ కార్యదర్శులదేనని, ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా వ్యవహరించే పంచాయతీ కార్యదర్శుల వేతనాలు మరీ తక్కువగా ఉండటం బాధాకరమన్నారు.
ఈ డిపార్ట్‌మెంట్‌లో నియామకాలు లేకపోవడం దారుణమన్నారు. గ్రామీణ వ్యవస్థ సరిగా ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు పోలీసుల రక్షణ లేకుండా ప్రజల్లోకి వెళ్లవచ్చునని, కాని ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి, ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. అభివృద్ధి ఫలాలను రాజ్యాంగం సాక్షిగా అర్హులకు అందించే సత్తా కేవలం గ్రామ కార్యదర్శులకు మాత్రమే ఉంటుందని, రాబోయే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ కార్యదర్శులు కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. దేవీప్రసాద్ మాట్లాడుతూ గ్రామకార్యదర్శి ఉద్యోగానికి డిగ్రీ అర్హత పెట్టి, డిగ్రీ అర్హత ఉన్న వారికి ఎంత వేతనం చెల్లించాలో కూడా ఈ పాడు ప్రభుత్వానికి తెలియదన్నారు.
ప్రస్తుతం సీమాంధ్ర శాసన సభ్యుల మాటలు వింటుంటే పదేళ్లు ఉమ్మడి రాజధాని కాదు, పదినిమిషాలు కూడా కలిసి ఉండేలేని పరిస్థితి ఉందన్నారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నూతన శకాన్ని నిర్మించుకునేందుకు రాజకీయ వ్యవస్థను, నాయకులను మార్చాల్సిన అసరం ఉందన్నారు. కార్యక్రమంలో పంజాయతీరాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జయప్రకాష్‌రెడ్డి, ఉద్యోగ సంఘం నాయకులు శ్రీనివాసరావు, రాఘవేంద్రరావు, వెంకటపతి రాజు, రంగాచారి, సురేష్ రెడ్డి, నారాయణ రెడ్డి, రాజేందర్ రెడ్డిలతో పాటు పది జిల్లాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
శైలజానాథ్ మాటలు బాధాకరం: ఈటెల
Published Mon, Jan 20 2014 3:59 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement