జలం కోసం కదిలిన జనం
రైవాడ నీటికోసం నిరసన పాదయాత్ర
నాలుగో రోజు వికలాంగుల మద్దతు
కృష్ణారాయుడుపేట(వేపాడ): రైవాడ జలాశయం నీటిని అదనపు ఆయకట్టుకు అందించాలని, పైపులైన్ నిర్మాణ ప్రతిపాదనలను శాశ్వతంగా విరమించుకోవాలన్న డిమాండ్లతో చేస్తున్న పాదయాత్ర నాలుగో రోజు బుధవారం కొనసాగింది. రైవాడ జలాశయం సాగునీటి సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కృష్ణారాయుడుపేట గ్రామ సమీపంలో రైవాడ కాలువ వద్ద గ్రామపెద్దలు అలబోని పైడిబాబు, బోజంకి శ్రీనివాస్ నేతృత్వంలో అధికసంఖ్యలో మహిళలు కాళీబిందెలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాగునీటి సాధన కమిటీ నాయకుడు వేచలపు వెంకట చినరామునాయుడు మాట్లాడుతూ తమ ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించాలని దశాబ్దాల కాలంగా ఆందోళన చేస్తున్నామని, జీవీఎంసీ చెల్లించాల్సిన రూ.112 కోట్లతో పంట కాలువలు నిర్మించాలన్న డిమాండ్లతో పాదయాత్ర చేస్తున్నామన్నారు. పాదయాత్రకు మద్దతు పలికిన లోక్‌సత్తా నేత బీశెట్టి బాబ్జి మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి తక్షణమే అదనపు ఆయకట్టుకు సాగునీరందించాలన్నారు.
ధన కమిటీ సభ్యుడు చల్లా జగన్ మాట్లాడుతూ కాలువను ఆనుకున్న గ్రామాలతో పాటు అదనపు ఆయకట్టుకు సాగునీరు అందించాలని డిమాండ్ చేసారు. కార్యక్రమంలో చినగుడిపాల సర్పంచ్ శీరంరెడ్డి సింహాద్రప్పడు, కండిపల్లి పెదనాయుడు, గండి నాయనబాబు, మల్లునాయుడు, నెక్కల శ్రీను, బి.వెంకన్న, కన్నబాబు, సూర్యనారాయణ, అధిక సంఖ్యలో మహిళలు, రైతులు పాల్గొన్నారు. జమ్మాదేవిపేటలో ప్రారంభమైన పాదయాత్ర ఆనందపురం, ఏకేజేపాలెం, కృష్ణారాయుడుపేట, పోతనవలస, ఉగ్గినవలస, ఆరైవై అగ్రహారం, కేజేపురం, ముషిడిపల్లి చేరుకుని రాత్రి బస చేశారు.
చివరిరోజు పాదయాత్రనిర్వహించే గ్రామాలు:
పాదయాత్ర చివరిరోజు గురువారం ఎల్.కోట మండ లం భూమిరెడ్డి పాలెంలో ప్రారంభమై గవరపాలెం, దాలివలస, కేకే అగ్రహారం, వారాడ, సంతపాలెం, మీదుగా ఆనందపురం కూడలికి చేరుకుంటుంది. అనంతరం సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ జరగనుంది.