కిరణ్ ‘మృదంగం’వినలేక..
Published Wed, Mar 12 2014 1:15 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
సాక్షి ప్రతినిధి, కాకినాడ :విశ్వసనీయత.. ఈ పదం వినిపించగానే రాజకీయాల్లో గుర్తుకువచ్చే వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి. మాట తప్పకుండా మడమ తిప్పకుండా వ్యవహరించిన వ్యక్తిత్వమే ఆయనను మహానేతగా నిలిపింది. అది లోపించబట్టే నేటి నేతలపై అనుచరులకే నమ్మకం లేకుండా పోతోంది.నిన్నటి వరకూ ముఖ్యమంత్రిగా ఉండి విభజనకు చక్రం అడ్డేస్తానని గప్పాలు కొట్టుకున్న నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇపుడు విడిపోయిన రెండు రాష్ట్రాలను కలిపేస్తానం టూ కొత్తగా సమైక్యాంధ్ర పార్టీని ప్రకటించి నేడు రాజమండ్రిలో బహిరంగ సభ నిర్వహణకు సిద్ధపడ్డారు. ఇప్పటి వరకూ ఆయన వెన్నంటి ఉన్న నాయకుల్లో చాలామంది ఈ పార్టీకి, సభకు దూరంగా ఉంటున్నారు.
ఈ పార్టీ గురించి మొట్టమొదట ప్రకటించిన ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు సైతం ఆయనకు గుడ్‌బై కొట్టి మంగళవారం వైఎస్సార్ సీపీలో చేరిపోయారు. ఇందుకు కారణం ఆయనపై ఎవరికీ నమ్మకం లేకపోవడమే. జై సమైక్యాంధ్ర పార్టీ ఆవిర్భావానికి వేదికైన జిల్లా నుంచి మొదట్లో వెంట ఉన్న వారిలో 10 శాతం మంది కూడా ఇప్పుడు కిరణ్‌ను నమ్మడం లేదు. నిన్నమొన్నటి వరకు కిరణ్ వెంట ఉన్న వారంతా తలోదారి వెతుక్కునే పనిలో ఉన్నారు. ఇతర పార్టీల్లో దారులన్నీ మూసుకుపోవడంతో విధిలేక ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రం కిరణ్ పార్టీ వైపు సానుకూలంగా ఉన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు తొలిసారి ప్రకటించింది రాజమండ్రి ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు. సమైక్యాంధ్ర కోసం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా పార్టీ పెడుతున్నారని హైదరాబాద్ అసెంబ్లీ లాబీల్లో రౌతు మీడియాకు తెలియజేశారు.
అప్పుడు సీఎంగా కిరణ్‌కుమార్‌రెడ్డి సమైక్యాంధ్ర గురించి చెప్పిందంతా వాస్తవమనే నమ్మకంతో రౌతు ఆయన వెంట ఉన్నారు. వాస్తవంగా మాజీ సీఎం అజెండా మరేదో ఉందని తెలుసుకున్న తరువాత నుంచి ఆయన నుంచి దూరం జరిగిపోయారు. కాంగ్రెస్‌ను వీడిన సూర్యప్రకాశరావు కిరణ్ పెట్టే పార్టీలోకి రావాలని ఒత్తిళ్లు వచ్చాయి. పలు సందర్భాల్లో తన ఆత్మ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమారేనని, ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని రౌతు చెప్పారు. అటువంటి ఉండవల్లి.. రాజకీయాలకు దూరమైపోయానని అన్న మాటలను గట్టుమీద పెట్టి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీకి తాత్కాలిక కమిటీలో ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యే రౌతు మాత్రం ఆ వైపు కన్నెత్తి చూడలేదు.
మహానేతపై అభిమానంతో...
ఉండవల్లి మాట తప్పి కిరణ్ పార్టీ వైపు వెళ్లినా రౌతు మాత్రం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఉన్న అంచంచల విశ్వాసంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. అదీ కూడా బుధవారం కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ సభ జరగడానికి 24 గంటల ముందు రౌతు వైఎస్సార్‌సీపీలో చేరడం గమనార్హం. మహానేత వైఎస్ సంక్షేమ ఫలాలు నిరుపేదలకు చేరడం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని నమ్ముతున్న జన నాడిని రౌతు గుర్తించబట్టే కిరణ్‌ను కాదని వైఎస్సార్‌సీపీలో చేరడానికి కారణమైందంటున్నారు. రౌతు హైదరాబాద్‌లో మంగళవారం జగన్ సమక్షాన వైఎస్సార్‌సీపీలో చేరారు. జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి రౌతునుసాదరంగా ఆహ్వానించారు. రౌతుతో పాటు జిల్లాలోని వైశ్య సామాజికవర్గం నుంచి పేరున్న కొల్లేపల్లి శేషయ్య, మాజీ కార్పొరేటర్ బి.వెంకటేశ్వరరావు జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావుతో శేషయ్యకు మంచి సాన్నిహిత్యం ఉండేది. జిల్లాలోని తూర్పుకాపు, వైశ్య సామాజిక వర్గీయులు ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి మద్దతుగా ఉండగా, రౌతు, కొల్లేపల్లి చేరిక పార్టీకి మరింత బలాన్నిచ్చింది. పార్టీలో చేరిన సందర్భంగా వారి వెంట ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు, రాజమండ్రి సిటీ, రూరల్ కోఆర్డినేటర్‌లు బొమ్మన రాజకుమార్, అనంత ఉదయభాస్కర్, ఆకుల వీర్రాజు, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ నాయకుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజమండ్రి నగర యువజన కన్వీనర్ గుర్రం గౌతమ్, యువజన విభాగం రాష్ర్ట కమిటీ సభ్యుడు వరదా కిరణ్, యువనేత జక్కంపూడి రాజా, పార్టీ రాష్ట్ర సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, చోడిశెట్టి రాఘవబాబు తదితరులున్నారు.
Advertisement
Advertisement