విలేకరులతో మాట్లాడుతున్న పోర్టు సాధన సమితి సభ్యులు
కావలి (నెల్లూరు): నాలుగున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ పట్టించుకోకుండా, ఇప్పుడు రామాయపట్నంలో భారీ ఓడరేవు నిర్మాణానికి ఉన్న సానుకూలతలను అంగీకరించి, పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని ప్రకటించారని రామాయపట్నం పోర్ట్ కమ్ షిప్ యార్డ్ సాధన సమితి చైర్మన్, వైఎస్సార్ సీపీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఉన్న సాధన సమితి కమిటీ సభ్యులు కావలిలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఫోన్‌లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి రామాయపట్నంలో ఓడరేవును నిర్మిస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఎన్ని రకాలుగా చెప్పినా పట్టించుకోలేదన్నారు. సాంకేతిక నిపుణులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రామాయపట్నంలో ఉన్న అన్నిరకాల సానుకూలతలతో అందజేసిన నివేదికలను ప్రాతిపదికగా చేసుకుని నిర్మాణం జరిగేలా చేయమన్నా దురుద్దేశాలు అంటగట్టారని గుర్తు చేశారు.
ఎంపీలుగా ఉన్న మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దీని కోసం పలు ఉద్యమాలు చేశారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు రామాయపట్నంలోనే భారీ ఓడరేవు నిర్మిస్తామని ప్రకటించడం శుభపరిణామమన్నారు. సాధన సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ వింతా కృష్ణారెడ్డి, కుందుర్తి శ్రీనివాసులు మాట్లాడుతూ వంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఒక్క కావలిలోనే కాకుండా, ప్రకాశం జిల్లాలోనూ ఆందోళనల్లో పాల్గొని పోర్టు సాధనకు కృషి చేశారన్నారు. చంద్రబాబు అన్ని హామీలు, ప్రకటల లాగానే ఈ పోర్టు శంకుస్థాపన కూడా ఉత్తుత్తి కాకుండా, కార్యరూపం దాల్చేలా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సాధన సమితి ప్రధాన కార్యదర్శి సురే మదన్‌మోహన్‌రెడ్డి, కోశాధికారి తన్నీరు మాల్యాద్రి, కార్యదిర్శి, జె.మల్లికార్జునరావు, సభ్యులు తలమంచి రవి, ఆకుమళ్ల శీనుబాబు పాల్గొన్నారు. కాగా అంతకు ముందు రామాయపట్నం పోర్ట్ కమ్ షిప్ యార్డ్ సాధన సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని బ్రిడ్జ్ సెంటర్‌లో టపాసులు కాల్చారు. ఈ కార్యక్రమంలో కమిటీ నాయకులు కేతిరెడ్డి శివకుమార్‌రెడ్డి, కనమర్లపూడి వెంకట నారాయణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment