కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు
పెళ్లకూరు(నెల్లూరు): రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అసమర్థుడని తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు విమర్శించారు. వైఎస్సార్‌సీపీ పెళ్లకూరు మండల కన్వీనర్, పుల్లూరు సర్పంచ్ మారాబత్తిన సుధాకర్‌కు మంగళవారం పుల్లూరులో పదవీ విరమణ సన్మానసభ జరిగింది. ఇందులో వెలగపల్లి పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి సీటు కోసం బాబు ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి తెలుగు ప్రజలను మోసం చేశాడన్నారు. నాలుగన్నరేళ్లు బీజేపీతో కలిసుండి ఎన్నికలొస్తున్న తరుణంలో అన్న క్యాంటీన్ అంటూ మరోమారు ప్రజలను మోసం చేస్తున్న బాబుకు సిగ్గు లేదని దుయ్యబట్టారు. భారత చట్టానికి విరుద్ధంగా జన్మభూమి కమిటీలను నియమించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన దర్మార్గుడని విమర్శించారు.
ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకుని తెలుగుజాతిని తలదించుకొనేలా చేశాడన్నారు. పార్టీ తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉంటే అధికార టీడీపీ హంగులు, ఆర్భాటాలు ఎలా చేసుకుంటుందని ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్రలో రాష్ట్ర ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాభివృద్ధికి భరోసా అని స్పష్టం చేశారు. అనంతరం సుధాకర్‌ను స్థానిక మండల పరిషత్ అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డితో కలిసి వారు ఘనంగా సన్మానించారు.
Comments
Please login to add a commentAdd a comment