బడివానిపేటలో ప్రబలిన జ్వరాలు | Rampant fevers in badivani pet | Sakshi
Sakshi News home page

బడివానిపేటలో ప్రబలిన జ్వరాలు

Published Wed, Aug 21 2013 3:54 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM

Rampant fevers in badivani pet

ఎచ్చెర్ల, న్యూస్‌లైన్: ఎచ్చెర్ల మండలంలోని మత్స్యకార గ్రామమైన బడివానిపేటలో నెల రోజులుగా చాలా మంది విష జ్వరాలతో బాధపడుతున్నారు. ప్రతి ఇంటిలోనూ  జ్వరపీడితులు ఉన్నారు. చికిత్స కోసం ఎక్కువ మంది స్థానిక సంచి వైద్యులను ఆశ్రయిస్తున్నారు. జ్వరాలు తీవ్రత పెరిగిన వారు శ్రీకాకుళంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటున్నారు. వైద్య సేవలు పొందినప్పటికీ జ్వరాలు తగ్గకపోవడంతో వీరంతా ఆవేదన చెందుతున్నారు. రోజూ గ్రామం నుంచి కనీసం ముగ్గురు వైద్య సేవల నిమిత్తం శ్రీకాకుళం వెళ్తున్నారు. ప్రస్తుతం మైలపల్లి ఎర్రయ్య, వారది లక్ష్మి, బడే బోడినాయుడుతో పాటు పలువురు పట్టణంలో చికిత్స పొందుతున్నారు. 
 
 గామంలో బడే లక్ష్మి, రాములమ్మ, నారాయణ, వారది ఎల్లమ్మ, ఆదినారాయణ, వారది రాములతో పాటు సుమారు 50 మందికి పైగా జ్వరంతో బాధపడుతూ సంచి వైద్యల వద్ద చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితం పొన్నాడ వైద్య సిబ్బంది ఇక్కడ తూతూ మంత్రంగా వైద్యసేవలు అందించి వెళ్లిపోయారు. జ్వరాలు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోలేదు. దీంతో రోజురోజుకీ జ్వర పీడుతులు పెరుగుతున్నారు తప్ప తరగటం లేదని గ్రామస్థులు అంటున్నారు. ఇంట్లో ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుందని వీరన్నారు. ప్లేట్‌లెట్స్ కౌంట్ తగ్గి, సుమారు పది మందికి డెంగీ లక్షణాలు కనిపించాయని ప్రైవేటు వైద్యలు తెలుపుతున్నారు. గ్రామంలోని వైద్యశిబిరాలు నిర్వహించి మెరుగైన సేవలను అందించాలని, పారిశుద్ధ్య కార్యక్రమం చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామంలో వైద్యసేవలు అందిస్తున్నామని, విషయాన్ని మెడికల్ ఆపీసర్‌కు తెలిపామని ఏఎన్‌ఎం ఉమ అన్నారు. నేడు గ్రామంలో వైద్యశిబిరం నిర్వహిస్తామని చెప్పారు. పారిశుద్ధ్య పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. 
 
 ఆనందపురంలో అదుపులోకి రాని విష జ్వరాలు  
 జి.సిగడాం: జి.సిగడాం మండలం ఆనందపురం గ్రామంలో విష జ్వరాలు అదుపులోకి రాలేదు. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే గ్రామంలో 85 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. వీరికి వైద్యసేవలు అందించినప్పటికీ పెద్దగా మార్పు లేకపోవడంతో జ్వర పీడితులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం వైద్యసిబ్బంది రోగులకు సేవలందించారు. వైద్య శిబిరంలో డాక్టర్ పీటీవీ కిరణ్‌కుమార్, సూపర్‌వైజర్లు సావిత్రమ్మ, త్రినాధ, ఏఎన్‌ఎంలు అన్నపూర్ణ, సుజాత, ఈశ్వరమ్మ, పార్వతి, చిన్ని, పొందూరు క్లష్టర్ ఆరోగ్య బోధకురాలు విజయలక్ష్మి రోగులకు వైద్యసేవలందించి, మందులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి గున్నబాబు, వజ్జపర్తి రఘురాం తదితరులు ఉన్నారు. సర్పంచ్ పొగిరి ప్రమీలారాణి పర్యవేక్షణలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
 
 గ్రామాల్లో ప్రబలుతున్న డయేరియా  
 మెళియాపుట్టి: మెళియాపుట్టి మండలంలో ఇటీవల పడిన వర్షాలకు చెత్తాచెదారాలు కుళ్లడంతో పాటు, తాగునీటి బావులు నీటి కాలుష్యానికి గురికావడంతో గ్రామస్తులు డయేరియా వ్యాధి బారిన పడుతున్నారు. ఎగువ బందపల్లిలో డయేరియా వ్యాధి ప్రబలింది. చందనగిరి రమేష్, నవీన్, బి.సాంబమూర్తి, గౌతమి వ్యాధి బారిన పడడంతో సోమవారం వీరిని టెక్కలి ఆస్పత్రికి తరలించారు. మంగళవారం గ్రామంలో బి.సింహాద్రి, బి.గౌరమ్మ, గాసమ్మ వ్యాధిబారిన పడ్డారు. వీరికి స్థానిక పీహెచ్‌సీ సిబ్బంది వైద్య సేవలు అందించారు. చొంపాపురం, ముక్తాపురంలో కరజాడ పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రసాద్‌రెడ్డి రోగులను పరీక్షించారు.15 మందికి వైద్య తనిఖీలు నిర్వహించారు. ఇద్దరు డయేరియా వ్యాధి గ్రస్తులకు వైద్యం అందించారు. జంతూరు గ్రామంలో డయేరియా తగ్గుముఖం పట్టింది. ఎగువ బందపల్లిలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement