పెద్దశ్రీరాంపురంలో పురివిప్పిన పాతకక్షలు
Published Wed, Aug 14 2013 4:44 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
కంచిలి, న్యూస్‌లైన్: మండల పరిధి పెద్దశ్రీరాంపురంలో పాతకక్షలు పురివిప్పాయి. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు దీనికి కారణమయ్యాయి. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన వారి మధ్య తలెత్తిన తగాడా కొట్లాటకు దారితీసింది. ఈ సంఘటనలో నలుగురు గాయాలపాలయ్యారు. వారిని చికిత్స కోసం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. క్రాంతి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నంలోని కేజీహెచ్‌కు తరలించారు. సంఘటనకు సబంధించి వివరాలు ఇవీ... ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల సమయంలో ఇరువర్గాల మధ్య కోల్డ్‌వార్ మొదలైంది. మంగళవారం గ్రామంలోని బల్లెడ వీధిలోకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాదిన క్రాంతికుమార్, కృష్ణకుమార్ బైక్‌పై వచ్చారు. అదే వీధిలో నివసిస్తున్న టీడీపీకి చెందిన లమ్మత సంజీవరావు ఇంటి ఎదురుగా వచ్చేసరికి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అది చినికి చినికి గాలివానలా మారి కొట్లాటకు దారితీసింది.
ఈ సంఘటనలో క్రాంతి తల, శరీరంపైన తీవ్ర గాయాలు తగిలాయి. కృష్ణమూర్తికి కూడా తల, చేతుల మీద గాయాలయ్యాయి. అలాగే సంజీవరావు, ఆయన భార్య లలిత కూడా గాయపడ్డారు. విషయం తెలిసి సోంపేట సీఐ జి.వి.రమణ, కంచిలి ఎస్‌ఐ కె.గోవిందరావు సిబ్బందితో కలిసి గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం ఇరువర్గాలు పోలీసులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పంచ్ మాదిన రామారావు, లమ్మత సంజీవరావుతోపాటు 8 మందిపైన, సంజీవరావు ఫిర్యాదు మేరకు క్రాంతి, కృష్ణమూర్తి, రాంప్రసాద్ సహా 8 మందిపైన పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన వారిని కాంగ్రెస్ వర్గీకులను ఆ పార్టీ నాయకులు నర్తు రామారావు, ఇప్పిలి కృష్ణారావు, కొల్లి ఈశ్వరరావు, పిలక చిన్నబాబు, దుర్గాసి ధర్మారావు, టీడీపీ వర్గీయులను బంగారు కురయ్య, జగదీష్ పట్నాయక్ పరామర్శించారు.
ఆధిపత్య పోరే గొడవకు కారణం
పంచాయతీపై పట్టుకోసం ఇరు పార్టీల మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరుసాగుతోంది. పంచాయతీ ఎన్నికలు పరిస్థితి విషమించేలా చేశాయి. కొంతకాలంగా ఇరువర్గాలు ఘర్షణలు దిగుతునే ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుడు బల్లెడ సుమన్ మీద టీడీపీకి చెందిన మాదిన రామారావు గెలుపొందారు. ఎప్పుడూ ఏకపక్షంగా సాగే ఎన్నికలు ఈసారి రసవత్తర పోటీ జరిగింది. అప్పటి నుంచి గ్రామంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండేది. ఈనేపథ్యంలో మంగళవారం కొట్లాట జరిగింది. గ్రామంలో కొద్ది రోజులుగా పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ పోలీసులు పరిస్థితిని చక్కదిద్దకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. గ్రామంలో పోలీస్ పికెట్ నిర్వహిస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు.
Advertisement
Advertisement