రాణాప్రతాప్ + రాణి
రాణాప్రతాప్ + రాణి
Published Tue, Apr 8 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 5:42 AM
సాలూరు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జి గుమ్మిడి సంధ్యారాణికి మాజీ ఎమ్మెల్యే రాణాప్రతాప్ భంజ్ దేవ్ సెగ తగిలింది. ఎస్టీ కుల వివాదంతో పదవిని పోగొట్టుకున్న భంజ్‌దేవ్ ఇప్పుడు అసెంబ్లీ టిక్కెట్ కోసం తీవ్రంగా లాబీయింగ్ జరుపుతూ.. తనదే పైచేయని ముమ్మరంగా ప్రచారం జరుగుతుండడంతో సంధ్యారాణి వర్గీయుల్లో ఆందోళన మొదలైంది. తనకే టిక్కెట్టు వస్తుందని గత కొంతకాలంగా చెబుతూ వస్తున్న భంజ్‌దేవ్ వ్యాఖ్యలను లైట్‌గా తీసుకున్న సంధ్యారాణి వర్గీయులు నేడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. క్యాడర్ లేని భంజ్‌దేవ్‌కు టిక్కెట్ ఇస్తే నష్టపోతామని సంధ్యారాణి వర్గీయులు చెబుతుండగా, మూడుసార్లు ఎమ్మెల్యే పదవిని చేపట్టిన తమ నాయకుడికి ఎన్నికలు ఎలా ఫేస్ చేయాలో తెలియంది కాదని భంజ్‌దేవ్ వర్గీయులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దీంతో నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ క్యాడర్‌లో అయోమయం నెలకొంది.ఐదేళ్లగా పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు చూస్తూ, సమర్థంగా పార్టీని నడుపుతున్న గుమ్మడి సంధ్యారాణిని కాదని ఆఖరు నిమిషంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌కే అసెంబ్లీ టిక్కెట్టని అధిష్టానం సంకేతాలివ్వడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా 2004 ఎన్నికల్లో సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్‌ను ఆశించి భంగపడిన తర్వాతనే ఎన్నికలకు వారం రోజుల ముందు టీడీపీలో చేరారని, ఆ సమయంలో ఆమెకు భంజ్‌దేవ్ బాసటగా నిలిచారని ఆయన వర్గీయులు, అభిమానులు గుర్తుచేస్తున్నారు. అదే స్ఫూర్తితో ఈసారి భంజ్‌దేవ్‌కు ఆమె సహకరించాలని కోరుతున్నారు. 1999లో కాంగ్రెస్ తరఫున, 2004లో టీడీపీ తరఫున పోటీ చేసి చేదు అనుభవాన్ని సంధ్యారాణి మూటగట్టుకున్నారని, మరోమారు ఆ పరిస్థితి తలెత్తకుండా భంజ్‌దేవ్‌కు సహకరించడమే ఉత్తమమంటున్నారు.
అసలైన గిరిజనుడు కాదన్న ముద్రపడిన భంజ్‌దేవ్‌ను ఎన్నికల బరిలో దింపితే నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న గిరిజనుల ఓట్లు దక్కవని సంధ్యారాణి వర్గీయులతో పాటు తెలుగు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు. భంజ్‌దేవ్ అసలైన గిరిజనుడు కాదని జనం పూర్తిగా విశ్వసిస్తున్నందున ఆయనకు టిక్కెట్ ఇస్తే పార్టీకి నష్టం తప్పదని బాహాటంగానే పార్టీ అభిమానులు చెబుతున్నారు. ఎలాగోలా ఎస్టీ కులధ్రువీకరణ పత్రాన్ని భంజ్‌దేవ్ పొందినా మరోమారు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర రూపంలో ముప్పు తప్పదని గుర్తుచేస్తున్నారు. భంజ్‌దేవ్ ఎమ్మెల్యే పదవిని పోగొట్టుకున్న తర్వాత నుంచి నేటివరకూ పార్టీ అభివృద్ధికి అవిశ్రాంతం కృషి చేసిన సంధ్యారాణికి బీజేపీతో పొత్తుకారణంగా కనీసం అరుకు ఎంపీ టిక్కెట్టు కూడా ఇచ్చే అవకాశం లేకుండా పోతోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
పార్టీని నమ్ముకుని పనిచేసిన నాయకులకే న్యాయం జరగకపోతే ఇక సామాన్య కార్యకర్తలకు ఏమేరకు న్యాయం చేస్తుందని పార్టీ అధినాయకత్వాన్ని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఏదిఏమైనా సంధ్యారాణి, భంజ్‌దేవ్‌ల నడుమ టిక్కెట్ విషయంలో నెలకొన్న పోటీ ఆపార్టీ నాయకుల్లో విభేదాలు బట్టబయలయ్యేలా చేస్తున్నాయి. సాలూరు అసెంబ్లీ స్థానం నుం చి 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఆర్.పి.భంజ్‌దేవ్, కాంగ్రెస్ అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి పోటీ చేశారు. ఇప్పుడు ఒకే పార్టీలో ఉంటూ సీటు కోసం పోటీ పడుతున్నారు.
Advertisement