టీడీపీలో ‘రాజ’ముద్ర
వారంతా రాజులే. అలాగని ప్రజాసంక్షేమమేధ్యేయంగా పాటుపడే పాలకులు కాదు. నిస్వార్థంగా జనానికి సేవ చేసే జవాబుదారీలు కాదు. తమను నిత్యం అంటిపెట్టుకునేవారి సంక్షేమమే వారి లక్ష్యం. స్వార్థ ప్రయోజనం... ఆశ్రిత పక్షపాతం... బంధుప్రీతి... వారి నైజం. అధికారం వారి చేతుల్లోనే ఉండాలి. పదవులు వారే అనుభవించాలి. మిగతా జనమంతా వారి కనుసన్నల్లోనే బతకాలి. అందుకే అత్యధిక బీసీలున్న ఈ జిల్లాలో టీడీపీ హయాంలో వారి ఎదుగుదల నామమాత్రమే. పథకాలన్నీ పెద్దలకే అందుతున్నాయి. బీసీలకు కనీస సౌకర్యాలు కొరవడుతున్నాయి. తెలుగుదేశం పాలనలో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై అప్పుడే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసంతృప్తి రాజుకుంటోంది.
సాక్షిప్రతినిధి విజయనగరం: రాజంటే... తన రాజ్యంలో సుస్థిర పాలనను అందించడం... తరతమ భేదాలు లేకుండా ప్రజలందరినీ సమానంగా చూడటం... ఎలాంటి పక్షపాతాలకు, రాగద్వేషాలకు తావివ్వకుండా నిరంతరం ప్రజల యోగక్షేమాల గురించే ఆలోచించడం చేయాలి. కానీ అలాంటి రాజవంశ ముద్ర వేసుకున్న మన జిల్లా తెలుగుదేశం పార్టీ నేతల్లో ఈ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీనిని ఆ పార్టీవారే బాహాటంగా అంగీకరిస్తారు. జిల్లాలో అత్యధికంగాఉన్న బీసీ సామాజిక వర్గాన్ని అధికారపార్టీ నేతలు పూర్తిగా విస్మరించారు. కేవలం రాజ సామాజిక వర్గానికి, వారి అనుచర గణానికి మాత్రమే పదవులు, కాంట్రాక్టులు కట్టబెడుతున్నారు. దీనిపై ఆ పార్టీ వర్గాల్లోనే తీవ్ర అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
గాలిలో కలసిన బీసీలకిచ్చిన హామీలు
గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి టీడీపీ అధినేత చంద్రబాబు చాలా హామీలు ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 18 లక్షల మంది వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజలు ఆ హామీలను నమ్మి ఓట్లేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చకపోగా, బీసీలపై సవతితల్లి ప్రేమ చూపించడం మొదలుపెట్టారు. దానిలో భాగంగానే కేంద్ర మాజీ మంత్రి, విజయనగరం ఎంపీ అశోక్‌గజపతిరాజు అనుచరులకు విజయనగరం ఏఎంసీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులను ఇచ్చారు. బొబ్బిలి రాజు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడాన్ని సుతరామూ అంగీకరించని అక్కడి పార్టీ ఇన్చార్జి తెంటు లకు‡్ష్మనాయుడికి ఆర్టీసీ సంస్థ రీజనల్ చైర్మన్ పదవినిచ్చి కేవలం బుజ్జగించారు. ఈ మూడింటితోనే బీసీలకు ఎంతో చేసేశామని చెప్పుకుంటున్నారు. కానీ ఇవన్నీ నియోజకవర్గ, జిల్లా, రీజనల్ స్థాయి పదవులే కావడం విశేషం.
రాష్ట్రస్థాయి పదవులకు నోచనీ బీసీలు
ఇక రాష్ట్ర స్థాయి పదవులను మాత్రం బీసీలకు దక్కనివ్వడం లేదు. సుజయ్‌కు ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన తూముల భాస్కరరావును రాష్ట్ర ఆర్థిక మండలి సభ్యుడిగా నియమించుకున్నారు. రాష్ట్ర బ్రాహ్మణ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్‌గా భోగపురపు వాయునందన శర్మను వేసుకున్నారు. తాజాగా అశోక్ ప్రధాన అనుచరుడు, సొంత సామాజిక వర్గానికి చెందిన ఐ.వి.పి.రాజును రాష్ట్ర ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించుకున్నారు. విజయనగరంలో అశోక్‌గజపతిరాజు, సాలూరులో ఆర్పి భంజ్‌దేవ్, కురుపాంలో శత్రుచర్ల విజయరామరాజు, బొబ్బిలిలో ఆర్వి సుజయకృష్ణ రంగారావు రాజుల సామాజిక వర్గం నుంచి టీడీపీలో పెత్తనం చెలాయిస్తుండగా త్వరలోనే వీరికి మరోరాజు కేంద్ర మాజీ మంత్రి వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ తోడవ్వనున్నారు. ఇలా విజయనగరం జిల్లా టీడీపీ మొత్తం రాజుల మయంగా మారుతోంది. పోనీ వీరు జనానిమైనా చేస్తున్నారా అంటే..అదీ లేదు.
శత్రుచర్ల విజయరామరాజు, ఆర్పి భంజ్‌దేవ్, వైరిచర్ల కిశోర్ చంద్రదేవ్ ఇప్పటికే కులనిర్థారణ వివాదాల్లో నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. పదవి కోసం శత్రుచర్ల విజయరామరాజు సొంత నియోజకవర్గాన్ని వదిలి పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. అశోక్ గజపతి, సుజయకృష్ణ రంగారావు, భంజ్‌దేవ్‌లు తమ ఆస్తులను కాపాడుకోవడంపై పెడుతున్న శ్రద్ధ ప్రజల సంక్షేమంపై పెట్టడం లేదు. విజయనగరానికి కేంద్ర పథకాలు, విభజన హామీలు తెప్పించుకోవడంలో అశోక్ పూర్తిగా విఫలమవ్వగా, గనుల శాఖలో ఉండి వాటిలో అక్రమాలను నిలువరించడంలో, జిల్లాకు రాష్ట్ర ప్రాజెక్టులు రప్పించడంలో సుజయ్ ఫెయిలయ్యారు. ఇక భంజ్‌దేవ్ పదవిలో ఉన్నప్పుడూ లేనప్పుడు కూడా తనపై వస్తున్న ఆరోపణల నుంచి తనను తాను కాపాడుకోవడంతోనే సరిపెడుతున్నారు. ఇక ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీలో ఉండి, జిల్లా ప్రజలకు కనీసం దర్శన భాగ్యం కూడా కల్పించని కిశోర్‌చంద్రదేవ్ ఇప్పుడు సడన్‌గా ప్రత్యక్షమై పదవి కోసం వీరి పంచన చేరుతున్నారు. వీరివల్ల జిల్లా ప్రజలు ఏ విధమైన ప్రయోజనం పొందలేకపోవడంపై సర్వత్రా అసంతృప్తి వ్యక్తమవుతోంది.