సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ప్రత్యక్షంగా సమ్మెలోకి వెళ్తున్నారు.
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ప్రత్యక్షంగా సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డిని కలిసి సమ్మె నోటీసును ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ వై. రాజీవ్‌రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ఆర్‌అండ్‌బీ మినిస్ట్రీయల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఇంజనీర్లు సైతం అర్ధరాత్రి నుంచి ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈతో పాటు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆర్‌డీసీ ఈఈలు, డీఈఈ, జేఈ, ఏఈలు అందరూ కలిపి 40 మంది సమ్మెలో పాల్గొంటున్నట్లు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కర్నూలు ఈఈ ఉమా మహేశ్వరరావు, డీఈఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు.
విభజనతో సీమకు తీవ్ర నష్టం
- ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజీవ్‌రెడ్డి
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని రోడ్లు భవనాల శాఖ ఎస్‌ఈ వై. రాజీవ్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎస్‌ఈ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఆర్‌అండ్‌బీ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమష్టి కృషితో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, రాష్ట్ర రాజధానిని వదలిపెట్టే ప్రసక్తేలేదన్నారు.
రాష్ట్ర విభజనతో తాగు, సాగునీటికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. పాలక ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భారీగా తరలివచ్చి ఈ నెల 29వ తేదీన కర్నూలులో జరగనున్న ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డిప్యూటీ ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి, ఈఈలు తులసీనాయక్, చెన్నకేశవులు, ఆర్‌డీసీ ఈఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.