విశాఖపట్నం: 'నిర్భయ' నిందితుడు ముకేష్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఓ వైపు కలకలం రేపుతుండగా మరోవైపు విశాఖలో మృగాళ్లు రెచ్చిపోయారు. ప్రాథమిక వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ యువతి ఈ నెల 4వ తేదీన విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం వేపగుంటలో ఓ వివాహ వేడుకకు వచ్చింది. తిరిగి హైదరాబాద్‌కు వెళ్లేందుకు 5వ తేదీ తెల్లవారుజామున ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకుంది.
అక్కడ శివ శేఖర్, కిరణ్, మణికంఠ, చందు అనే నలుగురు యువకులు అమెను అపహరించి కారులో సిరిపురం మీదుగా సర్క్యూట్ హౌస్ సమీపానికి తీసుకువెళ్లారు. అక్కడ ఈ నలుగురిలో ఒకరు ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకువచ్చి ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని చేతిలో రూ.100 పెట్టి వెళ్లిపోయారు. బాధితురాలు జరిగిన దారుణాన్ని స్నేహితులకు తెలిపింది. వారు వచ్చి ఆమెకు ఆశ్రయం కల్పించారు. అయితే 6వ తేదీ సాయంత్రం నిందితుల్లో ఒకరైన శివశేఖర్ ఆమెకు ఫోన్ చేసి హైదరాబాద్ టిక్కెట్ తీసి పంపిస్తానని, ఆర్టీసీ కాంప్లెక్స్‌కు రమ్మని చెప్పాడు. దీంతో స్నేహితుల సాయంతో ఆమె కాంప్లెక్స్‌కు చేరుకుంది. శివశేఖర్ అక్కడకు రాగానే అతనిని పట్టుకుని అవుట్‌పోస్ట్ పోలీసులకు అప్పగించారు.