సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రైతుల సంక్షేమం, అభ్యున్నతి కోసం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్)లకు ప్రభుత్వం వందశాతం రాయితీ కింద ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందజేయాలని భావించింది. జాతీయ ఆహార భద్రత మిషన్ కింద పప్పు దినుసుల సాగు చేపట్టాలని నిర్ణయించింది.
ఇందుకోసం 2010-11, 2011-12లలో జిల్లాలోని 32 మండలాల్లో రాష్ట్రీయ కృషివికాస్ యోజన(ఆర్‌కేవీవై) కింద రూ.3.80 కోట్లతో 63 ట్రాక్టర్లు, గొర్రు, విత్తనాలు వేసే యంత్రాలు మంజూరు చేసింది. ఒక్కో యూనిట్ విలువ రూ.5 లక్షలు పూర్తి రాయితీ. కొన్నిచోట్ల సహకార, రైతుమిత్ర, వాటర్‌షెడ్ కమిటీలకు అప్పగించారు. ట్రాక్టర్లపై ఈ సంఘాలకు ‘ఆగ్రోస్’ సంస్థ పూర్తిగా సబ్సిడీ అందించింది. ఒక్కో సహకార, రైతుమిత్ర సంఘాల కింద కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆయా గ్రామాల్లో పప్పుదినుసుల సాగు చేయాలని సూచించారు.
పీఏసీఎస్‌ల్లో ఉండాల్సిన ట్రాక్టర్లు.. చైర్మన్ల ఇంట్లో..
జిల్లాలో ఆర్‌కెవీవై పథకం సద్వినియోగం కావడం లేదు. అప్పటి సహకార సంఘాల అధ్యక్షులు ట్రాక్టర్లను తమ ఇష్టారాజ్యంగా వాడుకున్నారు. ఈ పథకం కింద ట్రాక్టర్లు మంజూరై మూడేళ్లు గడిచినా జిల్లాలో ఒక్క ఎకరం కూడా సాగుచేసిన దాఖలాలు లేవు. అద్దెకు ఇచ్చినా దాఖలాలు లేవు. కాగా పంపిణీ చేసిన ట్రాక్టర్లు, పరికరాలు అధికారులకు ఎక్కడున్నాయో తెలియదు.
ముథోల్ నియోజకవర్గం లోకేశ్వరం మండల కేంద్రంలోని సహకార సంఘానికి మంజూరైన ట్రాక్టర్‌ను నర్సారెడ్డి లక్ష్మణచాంద మండలం బొప్పారంలో అద్దెకు నడుపుతున్నట్లు సమాచారం. అలాగే సిర్పూరు నియోజకవర్గానికి ఏడు మంజూరు కాగా, బెజ్జూర్ మండలానికి మంజూరైన రెండింటికి కనీసం రిజిస్ట్రేషన్ చేయించక పోగా అందులో ఒకటి అమ్ముకున్నారన్న ప్రచారం ఉంది.
మరో ట్రాక్టర్‌ను అనధికారికంగా అద్దెకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇలా జిల్లాలో కేటాయించిన 63 ట్రాక్టర్లలో సగం ఆచూకీ లేవు. ఉన్న ట్రాక్టర్లు చైర్మన్ల కనుసన్నల్లో అద్దెకు నడుస్తుండటం వివాదాస్పదం అవుతోంది. ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇష్టారాజ్యం
Published Mon, Jan 20 2014 4:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:47 AM
Advertisement
Advertisement