మత ఘర్షణలే బీజేపీ లక్ష్యం
* అందుకు ప్రణాళికలు రచిస్తోంది
* సీఎం సిద్ధరామయ్య
సాక్షి,బెంగళూరు : రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీ రాష్ట్రంలో మతఘర్షణలను రెచ్చగొట్టడానికి ప్రణాళికలు రచిస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. ఇందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కల్పించబోమన్నారు. బెంగళూరులోని కేపీసీసీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరిగిన పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
బీజేపీకి ప్రజాప్రభుత్వం, లౌకిక వాదంపై నమ్మకం లేదన్నారు. అందువల్లే మతఘర్షణల రూపంలో పబ్బం గడుపుకోవాలని... అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తోందని సిద్ధరామయ్య విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీకు అధికార వికేంద్రీకరణపై నమ్మకం లేదన్నారు. అందవల్లే అన్నీ తానై ప్రవర్తిస్తూ ప్రజాప్రభుత్వ విధానాలకు కళంకం తెస్తున్నారని ఆరోపించారు. మరో ఏడాదిలోపు ఆయన అసలు రూపం బయట పడుతుందని జోష్యం చెప్పారు.
బీజేపీ పాలనలో ప్రసంగాల్లో మాత్రం లౌకిక వాదం కనిపిస్తుందన్నారు. అయితే దేశంలో హిందూ రాజ్య స్థాపన లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందని సీఎం సిద్ధరామయ్య ఘాటు వాఖ్యలు చేశారు. ఉన్నత కులాలు, వర్గాలకు చెందిన వారికే అధికారం, పదవులు అన్న అజెండాతోనే నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
ప్రధాని పదవి చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా నరేంద్రమోడీ రైతులు, మైనారిటీ వర్గాల సంక్షేమం గురించి ఇప్పటి వరకూ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. మొక్కజొన్న కొనుగోలుకు అవసరమై సబ్సిడీ అందించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్న విషయాన్ని పరిశీలిస్తే కేంద్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంతటి శ్రద్ధ ఉందో అర్థమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.