
మీడియా ప్రతినిధుల సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ
సాక్షి, విజయనగరం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతిని నిరూపిస్తానని.. అలాకాకపోతే తాను జైలుకు వెళ్లడానికి సిద్ధమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సొమ్ము ఒకడిది సోకు ఒకడిది అన్న చందాన కేంద్ర ప్రభుత్వ సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి పొందుతోందన్నారు. ప్రధాన మంత్రి రాష్ట్రానికి ఏమీ చేయలేదని రాష్ట్ర ప్రభుత్వం దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించారు. ప్రత్యేక హోదా విషయంలో 5 వేల కోట్ల రూపాయలు, ప్రత్యేక ప్యాకేజి 16000 కోట్ల రూపాయలు ఒప్పుకున్న మాట అవాస్తవమా అని ప్రశ్నించారు.
విశాఖపట్నం రైల్వే జోన్, దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటుకు సంబంధించి విభజన చట్టంలో పరిశీలన చేయమని ఉందని, కృష్ణమరాజ పట్నం పోర్టుతో సీఎం చంద్రబాబు బేరం కుదుర్చుకుని... ఇప్పుడు దుగరాజపట్నం పోర్టు కావాలంటున్నారని తెలిపారు. సాక్షర భారత్ ప్రాజెక్టును కొత్త పథకంలో విలీనం చేసినందున.. కొత్త ప్రపోజల్స్ పెట్టమంటే.. పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో 20వేల మంది ఉద్యోగాలు పోయాయన్నారు.
చంద్రబాబు నిజం మాట్లాడరు.. ఆయనకు ముని శాపం ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మానవహక్కులకు భంగం వాటిల్లుతోందని, వాటిని కాపాడతామని అన్నారు. చంద్రబాబుకు మానసిక పరిస్థితి బాగాలేదని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.. చంద్రబాబు లాగా మామకు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాలేదని, ప్రజల సహకారంతో కష్టపడి ప్రధాన మంత్రి అయ్యారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment