గుంటూరు: డిమాండ్ల సాధన కోసం రేషన్ డీలర్లు చేపట్టిన నిరసన కార్యక్రమాలు శుక్రవారం కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల డీలర్లు నెలవారీ డీడీలు చెల్లించకుండా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. అయితే, నిరసనలో పాల్గొనే డీలర్లను డీడీలు చెల్లించాలంటూ గుంటూరు జిల్లా అధికారులు ఒత్తిడి తెస్తున్నారని డీలర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి లీలా మాధవరావు ఆరోపించారు. డీడీలు చెల్లించకుంటే డీలర్ షిప్పులు రద్దు చేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. యంత్రాంగం తీరుకు నిరసనగా ఈనెల 25వ తేదీన చలోగుంటూరు కార్యక్రమం చేపడుతున్నట్లు వివరించారు. అన్ని జిల్లాల కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.