రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్లను దొంగదెబ్బ తీసింది. బియ్యం సరఫరా కోసం చెల్లించిన సొమ్ము పాత బకాయిల కింద జమచేసుకొని తమను మోసం చేశారని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి, విజయవాడ : గత నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు కందిపప్పు, పచ్చిశనగపప్పు విక్రయించాలని నిర్ణయించింది. పప్పు నాణ్యత లేకపోవడంతో పాటు ప్రైవేటు మార్కెట్లో «ధరకు ఇంచుమించుగా ప్రభుత్వం ఇచ్చే ధర ఉండటంతో రేషన్ డీలర్లు సరుకు తీసుకోవడానికి ఇష్టపడలేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అప్పుగానే ప్రభుత్వం కందిపప్పు సరఫరా చేసింది.
కందిపప్పు బకాయి వసూలు....
జిల్లాలో మొత్తం 2,235 మంది రేషన్ డీలర్లు ఉన్నారు. అలానే 12.60 లక్షల తెల్ల రేషన్ కార్డులున్నాయి. గత నెలలో ఒక్కో రేషన్ డీలర్‌కు రెండేసి క్వింటాళ్ల చొప్పున అప్పు మీద కందిపప్పు ఇచ్చారు. వాటి ఖరీదు. రూ.8000. ఈ నెలలో కందిపప్పు విక్రయించిన తరువాత సొమ్ము చెల్లిద్దామని డీలర్లు భావించారు. బియ్యం కోసం డీలర్లు పౌరసరఫరాల శాఖకు సొమ్ము చెల్లిస్తే, వాటిని ప్రభుత్వం కందిపప్పునకు జమ చేసుకుంటోంది. బియ్యానికి తిరిగి సొమ్ము చెల్లిస్తేనే సరఫరా చేస్తామని అధికారులు చెబుతున్నారు. బియ్యానికి కట్టిన సొమ్మును కందిపప్పుకు జమ చేసుకోవడంతో డీలర్లు ఆవేదన చెందుతున్నారు. ఒక్కో డీలర్‌కు సుమారు 50 నుంచి 80 క్వింటాళ్ల బియ్యం ఆగిపోయాయి. ప్రస్తుతం ఉన్న సాఫ్ట్‌వేర్ ప్రకారం సొమ్ము చెల్లిస్తే తొలుత పాత బకాయికి జమ చేసుకుంటుందని డీలర్లకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై డీలర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు బియ్యం ఆపకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు.
జిల్లాలో 4055 క్వింటాళ్ల కందిపప్పు డీలర్లకు సరఫరా....
కందిపప్పు నాణ్యత లేకపోవడంతో పాటు సకాలంలో సరఫరా చేయకపోవడంతో మార్చి నెలలో కేవలం 13 శాతం మాత్రమే విక్రయాలు సాగించారు. ఒక్కో కార్డుకు కిలో కందిపప్పు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా డీలర్లకు అప్పు పై 4055 క్వింటాళ్లను జిల్లా వ్యాప్తంగా అధికారులు పంపిణీ చేశారు. సరఫరా చేసిన మొత్తం సరుకులో కేవలం 13 శాతం డీలర్లు విక్రయించగలిగారు. కందిపప్పు నాణ్యత లేకపోయినా బియ్యంతో పాటే వచ్చి ఉంటే ఏదో విధంగా కార్డుదారులకు డీలర్లు అమ్మేసేవారు. మార్చి 13వ తేదీ తర్వాత పప్పు సరఫరా చేశారు. 15 తరువాత సర్వర్ పనిచేయదు. అందువల్ల చౌకబియ్యాన్ని 90 శాతం మంది పేదలు 10 వ తేదీ లోగానే తీసేసుకుంటారు. డీలర్లకు 13 న కందిపప్పు సరఫరా చేయడంలో విక్రయించలేకపోయారు. నాణ్యత సరిగా లేకపోవడంతో పాటు, ప్రైవేటు మార్కెట్లో కేజీ రూ.55కు లభిస్తుండగా, రేషన్ దుకాణంలో రూ.40కు విక్రయిస్తుండటంతో చాలా మంది పేదలు కందిపప్పు తీసుకోవడానికి ఇష్టపడలేదు.
బియ్యం సొమ్ము జమ వాస్తవమే
ఈ నెలలో బియ్యానికి చెల్లించిన సొమ్ము గతనెలలో ఇచ్చిన కందిపప్పుకు జమ చేసుకుంటున్నారు. అదేమంటే సాఫ్ట్‌వేర్ అలా ఉందని అంటున్నారు. బియ్యం సకాలంలో సరఫరా చేయకపోతే పేదలు ఇబ్బంది పడతారు. ఇప్పటికే ఈ విషయం అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. మంగళ, బుధవారాల్లో కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్‌ను కలిసి విజ్ఞాపన పత్రం ఇద్దామని భావిస్తున్నాం. కందిపప్పు విక్రయించే వరకు ఆ బకాయి వసూలు చేయకుండా ఆపాలి.– ఎం.శ్రీనివాస్,కృష్ణా జిల్లా రేషన్ డీలర్ల అసోసియేషన్ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment