=తెల్లకార్డుదారులకు చెబుతున్న డీలర్లు
=నంబర్ల సేకరణపై అధికారులకు ప్రభుత్వం టార్గెట్
= 75శాతం మాత్రమే పూర్తయిన సేకరణ
సాక్షి, విజయవాడ : ఆధార్ నంబర్ ఇస్తేనే ఇక నుంచి సరకులు ఇస్తామంటూ రేషన్ షాపుల డీలర్లు తెగేసి చెబుతున్నారు. ఇప్పటికే జిల్లాలో 75శాతం మంది తెల్లకార్డుదారుల నుంచి ఆధార్ నంబర్లను సేకరించారు. మిగిలిన వారి ఆధార్ నంబర్లు తీసుకోవాలని సివిల్ సప్లయిస్ అధికారులకు ప్రభుత్వం ఉంచి ఉత్తర్వులు అందడంతో అధికారులు డీలర్లపై ఒత్తిడి పెంచారు. ఈ కారణంగా ఆధార్ నంబరు ఉంటేనే రేషన్ సరకులు ఇవ్వాలన్న నిబంధనను కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలిసింది. వచ్చే ఫిబ్రవరి ఆఖరుకు జిల్లాలోని 11.88 లక్షల రేషన్ కార్డులకు ఆధార్ నంబర్లు అనుసంధానం చేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం.
సుప్రీం ఆదేశాలు పట్టించుకోరా?
కొంతమంది తెల్లకార్డుదారులు ఆధార్ ఐరిష్ తీయించుకోలేదని చెబుతుండటంతో డీలర్లు అసహనం వ్యక్తం చేస్తూ.. సరకులు ఇచ్చేదిలేదని అంటున్నారు. దీంతో రేషన్ షాపుల వద్ద గొడవలు జరుగుతున్నాయి. వంటగ్యాస్ తదితర సంక్షేమ పథకాలకు ఆధార్ లింకు పెట్టవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాంటప్పుడు మీరు ఎందుకు అడుగుతున్నారంటూ కొంతమంది డీలర్లను నిలదీస్తున్నట్లు తెలిసింది. అటువంటి వారికి సరకులు ఇవ్వకుండా పౌరసరఫరాల అధికారుల వద్దకు పంపుతున్నామని డీలర్లు చెబుతున్నారు. అయితే వీరిలో కొందరు స్థానిక నేతల వద్దకు వెళ్లి సిఫార్సులు చేయించుకుంటున్నారు. కాగా పౌరసరఫరాల అధికారులు రేషన్ డీలర్ల వద్ద ఉన్న ఆధార్ నంబర్లను ఎప్పటికప్పుడు సేకరించి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు.
బోగస్ కార్డులు ఏరివే తకేనట!
బోగస్ కార్డులను ఏరివేసేందుకే ఆధార్ నంబర్లు అడుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. కొంతమంది పేదలకు రెండు, మూడు చోట్ల తెల్లరేషన్ కార్డులు ఉంటున్నాయి. వీరు గాక కొంతమంది ఆదాయం ఎక్కువ ఉన్న వారు కూడా తెల్లరేషన్ కార్డులను పొందారు. ప్రస్తుతం కార్డుదారుల ఆస్తులతో పాటు బ్యాంకు డిపాజిట్లు, పాన్‌కార్డులు తదితరాలకు కూడా ఆధార్ అనుసంధానం చేస్తున్నారు. తెల్లరేషన్ కార్డులకు ఆధార్ నంబర్లు నమోదు ప్రక్రియ పూర్తికాగానే తనిఖీలు నిర్వహించి, అదనపు కార్డులు, ఆదాయం ఎక్కువ ఉన్నవారి కార్డులను రద్దు చేస్తామని అధికారులు అంటున్నారు. దీని వల్ల ప్రభుత్వం పై ఆర్ధిక భారం తగ్గడమే కాకుండా నిజమైన పేదలకే లబ్ధి చేకూరుతుందని చెబుతున్నారు.
రేషన్ ఆపడం లేదు
ఆధార్ ఇవ్వని వారికి రేషన్ సరకులు ఆపేయమని ఆదేశాలైతే ఇవ్వలేదు. అయితే కార్డుదారులంతా ఆధార్ నంబర్ తప్పని సరిగా ఇవ్వాలి. ఫిబ్రవరి వరకు చూసి ఆధార్ నంబర్ ఇవ్వకపోతే వారు లేనట్లుగా భావించి, వారి వివరాలను ప్రభుత్వానికి పంపుతాం.
- సంధ్యారాణి, డీఎస్‌వో
ఆధార్ నంబరు ఇస్తేనే రేషన్ !?
Published Thu, Dec 26 2013 2:05 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement