జగన్‌కు జై కొట్టిన రాయలసీమ | Rayalaseema want YS Jagan Mohar Reddy as Chife Minister | Sakshi
Sakshi News home page

జగన్‌కు జై కొట్టిన రాయలసీమ

Published Fri, Dec 6 2013 1:18 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

Rayalaseema want YS Jagan Mohar Reddy as Chife Minister

* జగన్ సీఎం కావాలని కోరుకుంటున్న 54 శాతం మంది సీమ ఓటర్లు   
* ఎన్‌టీ వీ-నీల్సన్ సర్వేలో వెల్లడి
* చంద్రబాబు సీఎం కావాలన్న 37 శాతం ఓటర్లు
* 52 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌కు 39-44 సీట్లు
* టీడీపీకి 7-10; కాంగ్రెస్‌కు 2-4 సీట్లే
* 7-8 ఎంపీ సీట్లు వైఎస్సార్ కాంగ్రెస్‌కు దక్కే అవకాశం
* కాంగ్రెస్, టీడీపీలకు ఒక్కోసీటు దక్కవచ్చు లేదా అస్సలు రాకపోవచ్చు
 
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాయలసీమ జై కొట్టింది. వచ్చే సాధారణ ఎన్నికల తరువాత ఆయన ముఖ్యమంత్రి కావాలని 54 శాతం మంది ఓటర్లు కోరుకున్నారు. రాయలసీమలో ఉన్న 52 అసెంబ్లీ స్థానాలకుగాను 39 నుంచి 44 సీట్లను ఆయన నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకోనుందని ఎన్‌టీవీ-నీల్సన్ సంస్థ సంయుక్తంగా చేసిన సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేను గురువారం నుంచి మూడు రోజుల పాటు ఎన్‌టీవీ ప్రసారం చేయనుంది. తొలి రోజు గురువారం రాత్రి రాయలసీమ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని ఎన్‌టీవీ ప్రసారం చేసింది.

జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆంధ్రప్రదేశ్‌ను విభజించాలని నిర్ణయం తీసుకున్న తరువాత అక్టోబర్ నెలాఖరు వరకూ 294 అసెంబ్లీ, 42 లోక్‌సభ స్థానాల పరిధిలోని 18-24, 25-44, ఆ తర్వాత 45 సంవత్సరాలకు మించి వయసు ఉన్న మూడు కేటగిరీల్లో 1.74 లక్షల మంది ఓటర్ల అభిప్రాయాలను శాంపిళ్లుగా సేకరించి సర్వే చేసినట్లు ఎన్‌టీవీ వెల్లడించింది.

సర్వేను పార్టీల వారీగా మాత్రమే చేశామని, వచ్చే ఏడాది జనవరిలో, తిరిగి సాధారణ ఎన్నికలకు ముందు కూడా సర్వే చేస్తామని తెలిపింది. తాము ప్రధానంగా నాలుగు అంశాలపై దృష్టి పెట్టామని, వచ్చే ఎన్నికల్లో సీఎంగా ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు, ఏ పార్టీ పట్ల ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఏ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నెన్ని సీట్లు వస్తాయి, లోక్‌సభ ఎన్నికల్లో ఎన్నెన్ని సీట్లు వస్తాయి, ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు వస్తాయనే అంశాలపై ప్రజాభిప్రాయాన్ని రాబట్టామని ఎన్‌టీవీ తెలిపింది.

 ప్రతి నియోజకవర్గంలో 600 మంది అభిప్రాయాలు..
రాయలసీమలోని మొత్తం 52 నియోజకవర్గాలకు గాను ప్రతి అసెంబ్లీ స్థానం నుంచి 600 మంది నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. మొత్తంగా 31 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. వచ్చే ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రిగా ఎవరిని కోరుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు రాయలసీమ ప్రాంతంలోని 54 శాతం మంది జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చూడాలని కోరుకుంటున్నామని చెప్పారు. అదే టీడీపీ అధినేత చంద్రబాబును సీఎంగా చూడాలనుకుంటున్నామని 37 శాతం మంది మాత్రమే చెప్పారు. వీరిద్దరికి మధ్య సీఎం పదవి విషయంలో జనాభిప్రాయంలో 17 శాతం తేడా ఉంది. ఇతరులు సీఎంగా కావాలని తొమ్మిది శాతం మంది ప్రజలు కోరుకున్నారు.

ఈ ప్రాంతంలో ఉన్న 52 అసెంబ్లీ సీట్లకుగాను 39 నుంచి 44 సీట్లను వైఎస్సార్ కాంగ్రెస్ గెలుచుకుంటుందని సర్వేలో వెల్లడైంది. టీడీపీ ఏడు నుంచి పది సీట్లు, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు నుంచి నాలుగు సీట్లకు పరిమితం కానున్నాయి. బీజేపీ, ఇతరులు చెరో స్థానం చేజిక్కించుకోనున్నారు. ఇదే ప్రాంతంలో వైఎస్సార్ కాంగ్రెస్ 51 శాతం ఓట్లను, టీడీపీ 33, కాంగ్రెస్ 13, బీజేపీ రెండు, ఇతరులు ఒక శాతం ఓట్లను సాధించుకునే అవకాశం ఉంది. రాయలసీమలో ఉన్న ఎనిమిది లోక్‌సభ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్ ఏడు లేదా ఎనిమిది, టీడీపీ, కాంగ్రెస్‌లో ఏదో ఒక పార్టీ ఒక స్థానాన్ని గెలుచుకునే అవకాశం ఉంది.

పార్లమెంటరీ నియోజకవర్గం వారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 50 శాతం, టీడీపీ 33 శాతం, కాంగ్రెస్ 15 శాతం, బీజేపీ, ఇతరులు చెరో 1 శాతం ఓట్లు సాధించుకునే అవకాశం ఉందని ఎన్‌టీవీ- నీల్సన్ సర్వేలో వెల్లడైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement