
ఆర్‌బీఐ లేఖపై ఏపీ సర్కారు మల్లగుల్లాలు
రీ షెడ్యూల్ అయితే గట్టెక్కొచ్చని భావించిన సర్కారు
ప్రభుత్వంపై నమ్మకం లేక గత ఖరీఫ్ వివరాలు రాబట్టిన ఆర్‌బీఐ!
సీఎంకు అందుబాటులోకి రాని
ఆర్‌బీఐ గవర్నర్
హైదరాబాద్: రుణాల రీషెడ్యూల్‌పై రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) నుంచి వచ్చిన తాజా లేఖతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. గత ఖరీఫ్ రుణాలు రీ షెడ్యూల్ అయితే రుణ మాఫీపై కొంతకాలం గట్టెక్కొచ్చన్న ఆలోచనలో ఉన్న ప్రభుత్వానికి ఆర్‌బీఐ లేఖ శరాఘాతంలా తగిలింది. రుణాలు రీషెడ్యూల్ అయితే వాటినే రుణ మాఫీకి ఉపయోగించుకోవచ్చని భావించిన ప్రభుత్వం ఇప్పుడు ఆర్‌బీఐకి ఏమి సమాధానమివ్వాలో తేల్చుకోలేకపోతోంది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ నుంచి సేకరించిన పంటల దిగుబడి వివరాల ఆధారంగా గత ఖరీఫ్‌లో పంటల దిగుబడి సాధారణానికంటే 50 శాతానికి తగ్గలేదని, అందువల్ల ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి రుణాల రీ షెడ్యూల్‌కు అనుమతి సాధ్యం కాదని ఆర్‌బీఐ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ దీపావలి పంత్ జోషి ఆ లేఖలో స్పష్టంచేసిన విషయం తెలిసిందే. అయితే జోషి పేర్కొన్న పంటల దిగుబడి వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవే అయినందున ఇప్పుడు ఆ సమాచారాన్ని ఖండించలేని పరిస్థితి నెలకొందని వ్యవసాయ శాఖ ఉన్నతస్థాయి వర్గాలు చెబుతున్నాయి.
ఆర్‌బీఐ లేఖ చూస్తే రుణాల రీ షెడ్యూల్‌కు దారులు మూసుకుపోయినట్లేనని అధికారవర్గాలు అంటున్నాయి. ఆర్‌బీఐ గవర్నర్‌తో మాట్లాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదని తెలిసింది. రుణ మాఫీ చేయకుండా కరువు, తుఫాను పేరుతో గత ఖరీఫ్‌లో రైతుల రుణాలు రీ షెడ్యూల్ చేసి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే అభిప్రాయం ఆర్‌బీఐ అధికారుల్లో గట్టిగా ఉందని, అందుకే రీ షెడ్యూల్ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా సమాచారం కోరుతోందని ఉన్నతాధికార వర్గాలు పేర్కొంటున్నారు.