
జిల్లాలో ఖాళీల వివరాలుజిల్లాలో 2020 వరకు ఉద్యోగ విరమణ చేసే ఉపాధ్యాయుల ఖాళీలను ప్రభుత్వం సేకరించింది. గత డీఎస్సీలో జిల్లావ్యాప్తంగా మూడు వందల లో పు పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ 104 పో స్టులు, ఎస్జీటీ 206, భాషోపాధ్యాయులు 40, పీఈటీలు 6 ఖాళీలు ఉన్నా యి. ప్రస్తుతం చేపట్టనున్న డీఎస్సీలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.
కడప ఎడ్యుకేషన్ :రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ కొలువులు భర్తీ చేయుటకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు జులై 6న ప్రకటన విడుదల కానుంది. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో హడావుడి నెలకొంది. ఎలాగైన ఉపాధ్యాయ పోస్టు సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఖాళీగా ఉన్న అన్ని రకాల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసి విద్యావ్యవస్థను పరిపుష్టి చేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అలాగే పాఠశాలల్లో సమగ్ర కనీస వసతుల కల్పనకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.4,300 కోట్లు కేటాయించనున్నారు. అలాగే విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు జిల్లాకు ఇరువురు డీఈఓలను నియమించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వీరిలో ఒకరు ప్రాథమిక, మరొకరు ఉన్నత విద్య బాధ్యతలను చూడనున్నారు. అలాగే టెట్, డీఎస్సీ ప్రకటనలకు సంబంధించి షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. దీంతో డీఎస్సీ అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.
టెట్ పరీక్షల షెడ్యూల్
టెట్ ప్రకటనను మే 4న ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫీజును మే 5నుంచి 22వ తేదీ వరకు చెల్లించవచ్చు. దరఖాస్తులను మే 5 నుంచి 23వ తేదీ వరకూ సమర్పించవచ్చు. నమూనా పరీక్షల (మాక్ టెస్టు) ఏప్రిల్ 25న ఆన్‌లైన్లో అందుబాటులో ఉంటుందని మంత్రి తెలిపారు. టెట్ పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను జూన్ 3 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు. జూన్ 10, 11,12 తేదీల్లో పేపర్ 1, పేపర్–2ఏ పరీక్ష 13,15,17,19 తేదీల్లో, పేపర్ 2బీ పరీక్ష 21న ఉంటుందని తెలిపారు. ఇందుకు సంబంధించి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మద్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. టెట్ ప్రాథమిక కీ జూన్ 22న, తుది కీ 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
డీఎస్సీకి సంబంధించి
డీఎస్సీకి సంబంధించి జూలై 6 ప్రకటన విడుదల చేయనున్నారు. ఇందుకు సంబం ధించి జూలై 6 నుంచి ఆగష్టు 8 వరకు ఫీ జు చెల్లించవచ్చు. దరఖాస్తులను జూలై 7 నుం చి ఆగష్టు 9 వరకు సమర్పించవచ్చు. నమూనా పరీక్ష (మాక్ టెస్ట్) ఆగష్టు 1వ తేదీ నుం చి ఆన్‌లైన్లులో అందుబాటులో ఉండనుంది. సంబంధిత పరీక్షకు కావల్సిన హాల్‌టికెట్లను ఆగష్టు 15 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. టీఆర్‌టీ పరీక్షను ఆగష్టు 23 నుంచి 30 వరకు నిర్వహించాలని భావిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సంబంధిత పరీక్షలను కూడా రెండు పూటల నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక కీ ఆగష్టు 31న విడుదల కానుంది. తుది కీ సెప్టెంబర్ 10న విడుదల చేసి, 15వ తేదీ ఫలితాలను ప్రకటించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.
సిలబస్‌ను ప్రకటించాలి
డీఎస్సీ ప్రకటన విడుదలపై అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే సిలబస్‌ను కూడా ప్రకటిస్తే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. సమయం తక్కువగా ఉండడంతోపాటు గతంలో పాఠశాల విద్యాశాఖ వారే పరీక్షను నిర్వహించేవారు. దీంతో సిలబస్‌పై అభ్యర్థులకు కొంత అవగాహన ఉండేది. అలాంటిది ఈ సారి డీఎస్సీని ఏపీపీఎస్‌సీ ద్వారా నిర్వహించాలని ప్రభుత్వం యోచనలో ఉంది. వీరు నిర్వహించే పరీక్షకు సిలబస్ ఏ విధంగా ఉంటుందోనని అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. అలాగే సిలబస్ రూపకల్పనలో అన్ని సబ్జెక్టులకు ప్రాధాన్యతనిస్తూ నూతన సాంకేతిక సమాచార అంశాలను పొందుపరచాలని అభ్యర్థులు సూచిస్తున్నారు. డీఎడ్ అభ్యర్థులకు మే 17 నుంచి పరీక్షలను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వీరికి గడువు చాలా తక్కువ. దీన్ని దృష్టిలో పెట్టుకుని సిలబస త్వరగా ప్రకటిస్తే మంచిదని సూచిస్తున్నారు.