అమ్మకానికి హౌసింగ్ భూములు! | Real Estate lands for sale! | Sakshi
Sakshi News home page

అమ్మకానికి హౌసింగ్ భూములు!

Published Thu, Feb 5 2015 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 8:47 PM

అమ్మకానికి హౌసింగ్ భూములు!

అమ్మకానికి హౌసింగ్ భూములు!

  • స్థలాల వివరాలు సేకరిస్తున్న ప్రభుత్వం
  • సంక్షేమ పథకాల కోసం భూములు విక్రయిస్తారనే ప్రచారం..
  • గృహ నిర్మాణ మండలి అధీనంలో ఉన్న స్థలాల విలువ రూ. 10 వేల కోట్లు
  •  ఇప్పటికే హైదరాబాద్‌లోని 1,800 ఎకరాల లెక్కలు సీసీఎల్ ఏకు..
  •  ‘దిల్’కు చెందిన రూ. 6 వేల కోట్ల భూముల వివరాలు సేకరణ
  • సాక్షి, హైదరాబాద్: ఆ సంస్థ చేతిలో ఉన్న భూముల విలువ ఒకటీ రెండూ కాదు ఏకంగా రూ. పదివేల కోట్లు... ఒక్క హైదరాబాద్ పరిధిలో ఉన్న స్థలాల విలువే రూ. రెండు వేల కోట్లకు పైమాటే.. ఇంకేం ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి బంగారు బాతులా మారింది.. ఆ భూములన్నీ అమ్మేసి, నిధులన్నీ ఖజానాలో చేర్చుకునే ప్రయత్నం చేస్తోంది.. ఇంతకూ ఆ సంస్థ ఏదో తెలుసా..‘రాష్ట్ర గృహ నిర్మాణ మండలి (హౌసింగ్ బోర్డు)’ దీని పరిధిలో ఉన్న ఖాళీ స్థలాల వివరాలను ప్రభుత్వం శరవేగంగా సేకరిస్తోంది.

    రాజధాని చుట్టుపక్కల ఉన్న దాదాపు 1,800 ఎకరాల భూముల వివరాలు ఇప్పటికే సీసీఎల్‌ఏకు అందాయి. హౌసింగ్ బోర్డుకు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.10వేల కోట్ల విలువైన భూములు ఉండగా... దీనికి అనుబంధంగా ఉన్న ‘దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్)’కు దాదాపు రూ. 6 వేల కోట్ల విలువైన స్థలాలు ఉన్నాయి. ఈ మొత్తం వివరాలను ఇప్పుడు ప్రభుత్వం సేకరిస్తోంది. వీటిలో ఇప్పటికిప్పుడు గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ప్రభుత్వ మదిలో లేదు. సంక్షేమ పథకాలకు భారీగా నిధులు అవసరం ఉండటం, అందుకు సరి పడా ఆదాయ మార్గాలు లేకపోవటంతో ఈ భూముల అమ్మకం తథ్యమనే భావన వ్యక్తమవుతోంది.
     
    బోర్డు విభజన తర్వాతే..

    తెలంగాణ, ఏపీల మధ్య ఇప్పటివరకు గృహనిర్మాణ మండలిని విభజించలేదు. దీంతో తొలుత దాని విభజనపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో కూడా ఇదే విషయంపై చర్చించారు. వీలైనంత త్వరగా విభజన తంతు పూర్తయ్యేలా చూడాలని నిర్ణయించారు. రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డులను వేరే విభాగంలో విలీనం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అర్బన్ హౌసింగ్‌ను పురపాలకశాఖలో విలీనం చేయాలన్న ఓ ప్రతిపాదన ఇప్పటికే ప్రభుత్వ పరిశీలనలో ఉండటంతో దాన్ని కొలిక్కి తెచ్చే అవకాశం కనిపిస్తోంది.
     
    ఉద్యోగుల్లో ఆందోళన..

    ప్రభుత్వం భూముల వివరాలను సేకరిస్తుండడంపై గృహనిర్మాణ మండలి సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో, శివార్లలోని స్థలాల వివరాలను 3రోజులుగా ఉన్నతాధికారులు వెంటపడి మరీ తెప్పించుకున్నారని..వాటిని అమ్మే ఆలోచనలో ఉంటే తమ భవితవ్యమేమిటో ముందుగా చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

    ఈ మేరకు సంస్థ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు బుధవారం గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి దానకిషోర్‌తో భేటీ అయ్యారు. గృహ నిర్మాణ మండలిని కొనసాగించని పక్షంలో తమనేం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ విషయంలో తనకూ స్పష్టత లేదని, విభజన తర్వాతే తెలుస్తుందని, ఇప్పటికిప్పుడు చెప్పటం సాధ్యం కాదని దానకిషోర్ పేర్కొనటంతో ఉద్యోగులు మరింత ఆందోళన చెందారు. తమది పెన్షనబుల్ ఉద్యోగమైనందున పింఛన్ భద్రత ఉండే నిర్ణయం తీసుకోవాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement