పెదపారుపూడి, న్యూస్‌లైన్ : ‘చిన్నతనంలో మాతో కలిసి మెలిసి తిరిగేవాడు. ఆటపాటలంటే మక్కువ. ఏడో తరగతి వరకు ఇక్కడే చదివాడు. ఎంత అగ్రహీరో అయినా మా స్నేహాన్ని మరచిపోలేదు’ అంటూ పెదపారుపూడి మండలం యలమర్రు గ్రామంలోని శ్రీహరి సహవిద్యార్థులు వివరించారు. సినీనటుడు శ్రీహరి ఆకస్మిక మరణంతో ఆయన స్వగ్రామం యలమర్రులో విషాదఛాయలు అలముకున్నాయి. స్నేహానికి ఎంతగానో విలువనిచ్చేవాడని గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు వాకా చిన్న సత్యనారాయణ తెలిపారు.
7వ తరగతి వరకు ఇక్కడే చదివాడు...
సినీనటుడు శ్రీహరి 7వ తరగతి వరకు యలమర్రు గ్రామంలో ఉన్న పాఠశాలలో చదువుకున్నాడు. ఆయన తల్లిదండ్రులు రఘుముద్రి సత్యనారాయణ, లక్ష్మి. శ్రీహరికి ఇద్దరు సోదరులు . అన్నయ్య శ్రీనివాసరావు హైదరాబాద్‌లోనే ట్రావెల్స్ యజమానిగా, శ్రీహరి సినిమాలకు ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తుంటారు. తమ్ముడు శ్రీధర్ సినిమాల్లో నటిస్తున్నారు.
శ్రీహరి తల్లిదండ్రులు యలమర్రు గ్రామంలోనే వ్యవసాయం చేసేవారు. 30 ఏళ్లక్రితం ఇక్కడ్నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీహరి పెదనాన్న వద్దకు కుటుంబ సమేతంగా వెళ్లిపోయారు. అప్పట్నుంచి గ్రామంతో ఆ కుటుంబానికి పెద్దగా సంబంధాలు లేవు. ఆయన మిగిలిన చదువులన్నీ హైదరాబాద్‌లోనే కొనసాగాయని బంధువులు చెబుతున్నారు. శ్రీహరి పాఠశాలలో చదివేటప్పుడు క్రీడలంటే ఎంతో మక్కువతో ఉండేవారని, ఆయనతో చదువుకున్నవారు పేర్కొంటున్నారు.
ఏటా గంగానమ్మ జాతరకు వస్తాడు...
గ్రామంలో జరిగే గంగానమ్మ జాతరకు భార్య, కుమారులతో ఏటా వచ్చేవాడని పేర్కొంటున్నారు. గ్రామదేవత గంగానమ్మ అంటే చిన్నప్పటి నుంచి ఎంతో ఇష్టమని బంధువులు అంటున్నారు. ఆరు నెలల క్రితం గంగానమ్మ అమ్మవారికి రూ.లక్షతో వెండి కిరీటం, ఆభరణాలు చేయించారని తెలిపారు. గంగానమ్మ గుడిని తన సొంత ఖర్చులతో కట్టిస్తానని గ్రామపెద్దలకు హామీ ఇచ్చారని వివరించారు.
వచ్చినప్పుడల్లా కలిసేవాడు...
యలమర్రు గ్రామానికి వచ్చినప్పుడల్లా తన బంధువులతో పాటు సహవిద్యార్థులమైన తమను కలిసి వెళ్లేవాడని శ్రీహరి బాల్యస్నేహితులు వాకా చిన్నసత్యనారాయణ, సుంకర వెంకటేశ్వరరావు, వల్లభనేని నరసింహారావు, అట్లూరి శివాజీ చెబుతున్నారు. ఆయన మరణ వార్త తమను తీవ్ర కలతకు గురిచేసిందని వాపోయారు. యలమర్రులో శ్రీహరి కుటుంబానికి సొంత ఇల్లు కూడా లేదు. శ్రీహరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో శ్రీహరితోనే ఉంటున్నారని వారి బంధువులు వివరించారు. శ్రీహరి పెదనాన్న, పెద్దమ్మ రఘుముద్రి కోటేశ్వరరావు, లక్ష్మి మాత్రమే యలమర్రులో ఉంటున్నారు.
శ్రీహరి మృతితో విషాదఛాయలు
Published Thu, Oct 10 2013 2:12 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement