బ్యాలెట్ చూపకపోతే ఓటు వేయనీయం: బొత్స
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థులు తప్పుకుంటారని భావిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఎమ్మెల్యేలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసుకోవచ్చన్నారు. ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరుగుతుంది కాబట్టి ఏ అభ్యర్థికి ఓటు వేస్తున్నారో ఏజెంట్‌కు చూపించిన తర్వాతే బ్యాలెట్ బాక్సులో ఓటువేయడానికి అనుమతిస్తామని చెప్పారు. బ్యాలెట్ చూపించకపోతే ఎమ్మెల్యేలను ఓటు వేయనీయబోమన్నారు.
కాంగ్రెస్ తరపున ముగ్గురు అభ్యర్థులను బరిలో నిలపాలని తాను, సీఎం కిరణ్, కాంగ్రెస్ పెద్దలతో చర్చించి నిర్ణయించామన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటు వేసే సన్నివేశం ఉత్పన్నం కాదన్నారు. తెలంగాణ బిల్లులో అంశాలు లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టే ఉభయసభలు బిల్లును వ్యతిరేకించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గడం హర్షనీయమని బొత్స అన్నారు.