కృష్ణా జలాల వినియోగంలో రికార్డు | Record of Krishna water usage | Sakshi
Sakshi News home page

కృష్ణా జలాల వినియోగంలో రికార్డు

Published Wed, May 20 2020 5:47 AM | Last Updated on Wed, May 20 2020 5:47 AM

Record of Krishna water usage - Sakshi

సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల వినియోగంలో తెలుగు రాష్ట్రాలు రికార్డు సృష్టించాయి. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు కలిపి 920.405 టీఎంసీలు వినియోగించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ 647.559 టీఎంసీలు వినియోగించుకుంటే.. తెలంగాణ 272.846 టీఎంసీలు ఉపయోగించుకుంది. ఆంధ్రప్రదేశ్‌ వాటా వినియోగం పూర్తి కాగా.. తెలంగాణ వాటాలో ఇంకా 60.605 టీఎంసీల మిగులు ఉంది. ఉమ్మడి ప్రాజెక్ట్‌లు, మధ్యతరహా ప్రాజెక్ట్‌లలో కనీస నీటి మట్టానికి ఎగువన 60.333 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)మంగళవారం ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖ రాసింది. రాష్ట్ర విభజన తర్వాత గత ఆరేళ్లుగా కృష్ణా నదీ జలాల వినియోగం లెక్కలను కృష్ణా బోర్డు పక్కాగా తేల్చుతోంది. అంతకుముందు అంటే.. ఉమ్మడి రాష్ట్రంలో నీటి వినియోగం లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉండేది కాదు. 

ఇదీ లెక్క
► నీటి సంవత్సరం జూన్‌ 1న ప్రారంభమై.. మే 31న ముగుస్తుంది. ఈ నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి భారీగా 1,782 టీఎంసీల ప్రవాహం వచ్చింది. 
► నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్‌లు నిండాయి. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీలో మిగులుగా ఉన్న 801 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు.
► శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా 169.668 టీఎంసీలు, హంద్రీ–నీవా ద్వారా 41.918, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా 5.410, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 3.333 వెరసి ఆంధ్రప్రదేశ్‌ 220.329 టీఎంసీలు వినియోగించుకుంది. 
► శ్రీశైలం జలాశయం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 49.677 టీఎంసీలు, చెన్నైకి తాగునీటి సరఫరా రూపంలో 1.667 వెరసి 51.344 టీఎంసీలు తెలంగాణ వినియోగించుకుంది.
► సాగర్‌ ప్రాజెక్ట్‌ నుంచి ఎడమ కాలువ ద్వారా 35.287 టీఎంసీలు, కుడి కాలువ ద్వారా 158.264 టీఎంసీలు, కృష్ణా డెల్టాకు 152.360, గుంటూరు చానల్‌కు 3.150 వెరసి 349.061 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంది. 
► సాగర్‌ నుంచి హైదరాబాద్‌ తాగునీటి సరఫరా, ఏఎమ్మార్పీ ద్వారా 57.799, ఎడమ కాలువ ద్వారా 91.007 వెరసి 148.806 టీఎంసీలను తెలంగాణ ఉపయోగించుకుంది.
► తుంగభద్ర ప్రాజెక్ట్‌ నుంచి హెచ్చెల్సీ ద్వారా 30.192, ఎల్లెల్సీ ద్వారా 20.215, కేసీ కెనాల్‌ ద్వారా 27.762 వెరసి 78.169 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌ వినియోగించుకుంది. 
► ఆర్డీఎస్‌ ద్వారా తుంగభద్ర ప్రాజెక్ట్‌ నుంచి 5.93 టీఎంసీలు తెలంగాణ వాడుకుంది. 
► జూరాల ప్రాజెక్ట్‌ నుంచి 27.589, నెట్టెంపాడు ఎత్తిపోతల ద్వారా 12.223, భీమా ఎత్తిపోతల ద్వారా 13.049, కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల ద్వారా 4.422 వెరసి 57.283 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.
► మూసీ, పాకాల చెరువు, వైరా తదితర మధ్యతరహా ప్రాజెక్ట్‌ల ద్వారా 9.483 టీఎంసీలను తెలంగాణ వినియోగించుకుంది.
► ప్రస్తుత నీటి సంవత్సరంలో తెలుగు రాష్ట్రాల్లోని కృష్ణా పరీవాహక ప్రాంత రిజర్వాయర్లలో 980.738 టీఎంసీల లభ్యత ఉన్నట్లు బోర్డు లెక్కగట్టింది.
► ఇందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా (66 శాతం) 647.287 టీఎంసీలు కాగా.. తెలంగాణ వాటా (34 శాతం) 333.451 టీఎంసీలు. 

8 ప్రాజెక్టుల డీపీఆర్‌లుతక్షణమే ఇవ్వండి
తెలంగాణ సర్కార్‌కు కృష్ణా బోర్డు ఆదేశం
కృష్ణా జలాలను తరలించడానికి కొత్తగా చేపట్టిన ఐదు ప్రాజెక్టులతోపాటు సామర్థ్యం పెంచిన మూడు ప్రాజెక్టులతో కలిపి మొత్తం 8 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లు తక్షణమే ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఆదేశించింది. ఇదే అంశంపై అక్టోబర్‌ 16న రాసిన లేఖకు స్పందించలేదని గుర్తు చేస్తూ ఇప్పటికైనా వాటి డీపీఆర్‌లు సమర్పించాలని స్పష్టం చేస్తూ బోర్డు సభ్యుడు  హెచ్‌కే మీనా మంగళవారం తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశారు. 

మా వాటా నీటిని తరలించేందుకే ఎత్తిపోతల...
శ్రీశైలం జలాశయంలో 854 అడుగుల కంటే దిగువకు నీటిమట్టం చేరినప్పుడు కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేసినా పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా కరవు పీడిత రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీటి అవసరాల మేరకు నీటిని తరలించలేని దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో రాయలసీమ తాగు, సాగునీటి అవసరాలు తీర్చడం కోసం శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల నీటి మట్టం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌కు దిగువన ఎస్సార్బీసీలో 4 కి.మీ. వద్దకు ఎత్తిపోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ ఎత్తిపోతలపై కృష్ణా బోర్డుకు తెలంగాణ సర్కార్‌ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కృష్ణా బోర్డు చేసిన కేటాయింపుల ప్రకారమే తమ వాటా నీటిని తరలించడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టామని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలంగాణ సర్కారు విభజన చట్టాన్ని ఉల్లంఘించి.. సీడబ్ల్యూసీ, అపెక్స్‌ కౌన్సిల్, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా  పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్తరామదాస ఎత్తిపోతల పథకాలు, వాటర్‌ గ్రిడ్‌లో భాగంగా మిషన్‌ భగీరథ ప్రాజెక్టులు చేపట్టిందని, కల్వకుర్తి ఎత్తిపోతల, నెట్టంపాడు ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ సామర్థ్యాన్ని పెంచుతోందని.. దీని ప్రభావం దుర్బిక్ష ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు చేపట్టి నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై తీవ్రంగా ఉంటుందని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. వాటిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 14న జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ బోర్డుకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన కృష్ణా బోర్డు తక్షణమే ఆ ఎనిమిది ప్రాజెక్టుల డీపీఆర్‌లు అందజేయాలని తెలంగాణ సర్కార్‌ను ఆదేశించింది. ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement