సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 512.. తెలంగాణ రాష్ట్ర వాటా 299 టీఎంసీలు.. మా రాష్ట్రానికి హక్కుగా ఉన్న జలాలను వాడుకుంటే తప్పేంటని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)కి తేల్చిచెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల తాగు, సాగునీటి ఇబ్బందులను అధిగమించడం కోసం ఏపీ సర్కార్ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు లేఖ రాసింది. ఈ లేఖలో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వాలని ఏపీ సర్కార్‌ను శుక్రవారం కృష్ణా బోర్డు కోరింది. తెలంగాణ సర్కార్ లేవనెత్తిన అనుమానాలనునివృత్తి చేసేలా కృష్ణా బోర్డుకు నివేదిక ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నివేదికలో పొందుపర్చే అవకాశమున్న అంశాలు ఏమిటంటే..
► కర్ణాటక సర్కార్ ఆల్మట్టి డ్యాం ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచడంవల్ల అదనంగా 130 టీఎంసీలను నిల్వ చేసుకోగలుగుతుంది. దీనివల్ల కృష్ణా వరద ప్రవాహం జూరాలకు ఆలస్యంగా చేరుతుంది. వరద ప్రవాహం శ్రీశైలానికి చేరక ముందే జూరాల ప్రాజెక్టు కాలువ, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా ఎత్తిపోతల ద్వారా తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తుంది. రుతుపవనాల గమనంలో వచ్చిన మార్పుల వల్ల నదీ పరీవాహక ప్రాంతంలో వర్షపాతం ఏకరీతిగా కురవకపోవడం వల్ల కృష్ణా నదికి వరద రోజులు తగ్గాయి. వరద వచ్చిన రోజుల్లో గరిష్ఠంగా ఉంటోంది.
► శ్రీశైలం జలాశయం గరిష్ఠ నీటి మట్టం 885 అడుగులు. జలాశయంలో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడే పీహెచ్‌పీ (పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్) ప్రస్తుత పూర్తిసామర్థ్యం మేరకు 44వేల క్యూసెక్కులను శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్సార్బీసీ), టీజీపీ (తెలుగుగంగ ప్రాజెక్టు), గాలే రు–నగరి సుజల స్రవంతి పథకం (జీఎన్‌ఎస్ ఎస్)కు తరలించవచ్చు. కృష్ణా నదికి వరద రోజులు తగ్గిన నేపథ్యంలో శ్రీశైలంలో 881 అడుగుల స్థాయి లో నీటి మట్టం ఏడాదికి పది రోజులకు మించి ఉండదు.
► అలాగే, శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 854 అడుగులు ఉంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా కాలువలోకి ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే చేరతాయి. నీటి మట్టం 841 అడుగులకు చేరితే పీహెచ్‌పీ ద్వారా చుక్క నీరు కూడా కాలువకు చేరదు. కానీ, శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 834 అడుగుల నుంచే ఎడమగట్టు కేంద్రం నుంచి తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేపడుతోంది. కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల ద్వారా 800 అడుగుల నుంచి.. ఎస్సెల్బీసీ ద్వారా 824 అడుగుల నుంచే తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తోంది. పర్యవసానంగా జలాశయంలో నీటి మట్టం రోజురోజుకూ తగ్గిపోతుంది. తెలంగాణ 800 అడుగుల నుంచి నీటిని తరలిస్తున్న నేపథ్యంలో.. రాయలసీమ, నెల్లూరు జిల్లాలో తాగు, సాగునీటి ఇబ్బందులను అధిగమించడానికే శ్రీశైలం జలాశయంలో 800 అడుగుల (సంగమేశ్వరం) నుంచి పీహెచ్‌పీకి దిగువన ఎస్సార్బీసీలోకి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తిపోసే సామర్థ్యంతో ఎత్తిపోతల పథకాన్ని తాము చేపడితే తప్పేంటని బోర్డుకు వివరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. కృష్ణా బోర్డు కేటాయించిన నీటిని మాత్రమే ఈ ఎత్తిపోతల ద్వారా తరలిస్తామని.. అంతకంటే చుక్క నీటిని కూడా తరలించబోమని స్పష్టం చేయాలని నిర్ణయించింది.
► మరోవైపు.. కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్‌ల నుంచి అనుమతి తీసుకోకుండా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల కల్వకుర్తి సామర్థ్యం పెంపు, నెట్టంపాడు సామర్థ్యం పెంపు, తుమ్మిళ్ల ఎత్తిపోతల, ఎస్సెల్బీసీ సామర్థ్యం పెంపు ద్వారా 178.93 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకునేలా తెలంగాణ సర్కార్ కొత్తగా ప్రాజెక్టులు చేపట్టడంపై అనేకమార్లు ఫిర్యాదులు చేశామని.. వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని బోర్డును ప్రశ్నించాలని కూడా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
సముద్రంలో కలిసే వరదను మళ్లిస్తే తప్పేంటి?
ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండగా.. కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేస్తూనే ప్రకాశం బ్యారేజీ ద్వారా 801 టీఎంసీలను సముద్రంలోకి విడుదల చేశారు. కృష్ణా నదికి నాలుగేళ్లలో ఒకసారి ఈ స్థాయిలో వరద వస్తుంది. శ్రీశైలంలో నీటి మట్టం 881 అడుగుల స్థాయిలో ఉన్నప్పుడు పీహెచ్‌పీ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కులే రాయల సీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. కానీ.. ఆ స్థాయిలో నీటి మట్టం ఏడాదికి పది రోజులు కూడా ఉండే అవకా శంలేదు. జలాశయంలో గరిష్ఠ స్థాయిలో నీటి మట్టం ఉన్న ప్పుడు.. సముద్రంలో కలిసే ఆ వరద జలాలను ఒడిసి పట్టి.. దుర్భిక్ష రాయలసీమలో బంజరు భూములకు మళ్లించడానికే పీహెచ్‌పీ దిగువన కాలువల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టాలని నిర్ణయించామని కృష్ణా బోర్డుకు వివరించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందులో తప్పేంటని బోర్డును ప్రశ్నించాలని భావిస్తోంది.
బోర్డు పరిధిలోకి అన్ని ప్రాజెక్టులు..
కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఉద్దేశించిన కృష్ణా బోర్డు పరిధిని, వర్కింగ్ మాన్యువల్ (కార్యనిర్వాహక నియమా వళి)ని తక్షణమే ఖరారుచేసి అమల్లోకి తీసుకొచ్చేందుకు కోరాలని కూడా నిర్ణయించింది. రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులన్నీ బోర్డు తన అధీనంలోకి తీసుకోవాలని.. కేటాయించిన నీటి మేరకు బోర్డే నీటిని విడుదల చేయాలని మరోసారి ప్రతిపాదించనుంది. నీటి కేటాయింపులను.. విడుదలను బోర్డే చేయడంవల్ల అదనంగా ఒక్క నీటి చుక్కనూ వినియోగించుకునే అవకాశం ఉండదని తేల్చిచెప్పాలని భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment