సీహెచ్‌సీల్లో వేధిస్తున్న వైద్యుల కొరత
వైద్యవిధాన ఆసుపత్రుల్లో భారీగా ఖాళీలు
పడిపోతున్న ప్రసూతి సూచీలు
అన్నీ తెలిసి చోద్యం చూస్తున్న ప్రభుత్వం
‘‘ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని ఏరియా ఆసుపత్రి. ఒకప్పుడు ఏటా 2400 వరకు ఈ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేవి. కానీ ఇప్పుడు ప్రసవాల సంఖ్య 30 శాతం పడిపోయింది. కారణం ఇక్కడ రెండేళ్లుగా సివిల్ సర్జన్, ఫిజీషియన్, ఈఎన్‌టీలు లేరు. దీంతో ఇక్కడి ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.’’
చిత్తూరు (అర్బన్):జిల్లాలోని ఏపీ వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ) ఆసుపత్రుల్లో ఖాళీ కుర్చీల రాజ్యమేలుతోంది. జిల్లా ఆసుపత్రి మినహా మిగిలిన సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల్లో ఏళ్ల తరబడిగా వైద్యుల పోస్టులు భర్తీ కావడంలేదు. దీనికి తోడు ఇటీవల పీజీ విద్యను అభ్యసించడానికి చాలా మంది వైద్యులు దీర్ఘకాలిక సెలవులపై వెళ్లిపోతున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత,శిశు మరణాలను అరికట్టి ఆసుపత్రుల్లోనే కాన్పులు జరిగేలా చూడటానికి ఏర్పాటు చేసిన వైద్యకేంద్రాలు నిర్వీర్యం అయిపోతున్నాయి.
ఖాళీలే ఖాళీలు...
వాయల్పాడు సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ)లో చిన్న పిల్లల వైద్య నిపుణులు, అనస్తీషియన్ (శస్త్ర చికిత్స సమయంలో మత్తుకుప్పం ఏరియా ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఫిజీషియన్, ఈఎన్‌టీలతో పాటు సివిల్ సర్జన్ పోస్టులు మూడేళ్లుగా భర్తీకి నోచుకోలేదు. చిన్నగొట్టిగల్లు సీహెచ్‌సీలో గైనకాలజిస్టు, అనస్తీషియన్, జనరల్ మెడిసిన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడున్న వైద్యుల్లో కొందరు పీజీ అభ్యసించడానికి వెళ్ళిపోయారు. ఫలితంగా గత ఏడాది 600 కాన్పులు ఇక్కడ జరగాల్సి ఉండగా కేవలం 117తో సరిపెట్టాల్సి వచ్చింది.
పుంగనూరులో అనస్తీషియన్, చిన్నపిల్లల వైద్యులు లేరు. కలికిరిలోనూ చిన్నపిల్లల వైద్యులు, గైనకాలజిస్టు లేరు. ఈ రెండు ఆసుపత్రుల్లో అయిదేళ్లుగా ఈ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పీలేరులో ఏడాదిగా సివిల్ సర్జన్ లేకపోవడంతో శస్త్రచికిత్సల పడిపోయాయి. పలమనేరులో సివిల్ సర్జన్ అనస్తీషయన్, గైనకాలజిస్టు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఏపీవీవీపీలో ప్రసవాలు ఇలా...
జిల్లాలోని వైద్య విధాన ఆసుపత్రుల్లో గత అయిదేళ్లలో కాన్పుల సంఖ్య లక్ష్యాన్ని చేరుకోవడంలో తడబడుతోంది. వైద్యులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మినహా ఇతర ఏపీవీవీపీ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పరిశీలిస్తే...
సంవత్సరం కాన్పుల లక్ష్యం జరిగిన కాన్పులు
2011-12 12,775 9,658
2012-13 16,200 11,141
2013-14 16,200 12,936
2014-15 16,200 13,001
2015-16 17,280 12,559