
అనంతలో ఆందోళనల హోరు
పెట్రో ధరల పెంపును ఉపసంహరించుకోవాలి
నగరంలో గురువారం వామపక్షాలు, వ్యాపారవర్గాలతో పాటు, ఆశావర్కర్లు ప్రభుత్వ విధానాలపై నిరసన తెలిపారు. పెట్రో ధరల పెంపును ఉపసంహరించుకోవాలని సీపీఎం, సీపీఐ నాయకులు, విధానాలపేరుతో వేధింపులు మానుకోవాలని వ్యాపారులు ప్రదర్శనలు నిర్వహించారు. తొలగింపు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు.
వామపక్షాల డిమాండ్
అనంతపురం అర్బన్: పెట్రోలు, డీజిల్ ధరల పెంపును వెంటనే ఉపసంహరించుకోవాలని వామపక్షపార్టీల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక టవర్ క్లాక్ వద్ద వేరువేరుగా సీపీఎం, సీపీఐ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. సీసీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాల్యాద్రి మాట్లాడుతూ అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నప్పటికీ దేశంలో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి కేంద్రం ప్రజలపై భారం మోపుతోందన్నారు. పెట్రోల్, డీజిల్‌పై రాష్ట్రంలో నాలుగు శాతం వ్యాట్‌ను అదనంగా మోపడం వల్ల ప్రజలపై అధిక భారం పడుతోందన్నారు. నగర కమిటీ కార్యదర్శి నాగేంద్రకుమార్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాల్గొన్నారు.
పెంచిన పెట్రో ధరలను తగ్గించాలి: జగదీశ్
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నప్పటికీ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజావ్యతిరేక చర్యని సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ అన్నారు. పెంచిన ధరను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ధరల పెంపును నిరసిస్తూ గురువారం స్థానిక టవర్ క్లాక్ వద్ద ఆటోను తాళ్లతో లాగుతూ సీపీఐ నాయకులు నిరసన తెలిపారు.
సమరశీల పోరాటాలకు సంసిద్ధులు కావాలి
ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేయాలని నాయకులు సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ పిలుపునిచ్చారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో గురువారం ఆ పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు.