
సాక్షి,సిటీబ్యూరో: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ ధరలకు మాత్రం అమాంతం రెక్కలొచ్చాయి. పెరిగిన ధరలు తెలంగాణలో సామాన్యుడికి గుదిబండగా మారాయి. ధరల మంటపై పెల్లుబికిన ఆందోళనలకు పలు రాష్ట్రాలు దిగివచ్చి ధరలు కొంతమేర తగ్గించినా.. తెలంగాణ ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం లేదు. తాజాగా రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 4 శాతం పన్నును తగ్గించింది. దీంతో ఆ రాష్ట్రంలో లీటర్ పెట్రోల్‌పై రూ.2.50 ధర తగ్గింది. పక్కనున్న ఏపీలో సైతం పెట్రోల్, డీజిల్‌పై అదనంగా వసూలు చేస్తున్న పన్నులో రూ.2 తగ్గించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం రూపాయి ధర తగ్గించింది. తెలంగాణ రాష్ట్రంలో ధరల తగ్గింపు లేని కారణంగా దేశంలోనే డీజిల్ ధర టాప్‌లోను, పెట్రోల్ ధర రెండో స్థానంతో ఆల్‌టైమ్ రికార్డు సృష్టిస్తున్నాయి.
క్రూడాయిల్ తగ్గినా ధరల మంట
ఐదేళ్ల క్రితంతో పోలిస్తే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధర ప్రస్తుతం బ్యారెల్‌కు 31.25 శాతం తక్కువగా ఉంది. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు బ్యారెల్ ధర రూ.4,950కు చేరింది. దీంతో హైదరాబాద్‌లో శుక్రవారం నాటికి లీటర్ పెట్రోల్ ధర రూ.86.18గాను, డీజిల్ రూ.79.73కు చేరింది. 2013 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్ ధర రూ.7,200 చేరడంతో అప్పట్లో హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.83.07తో రికార్డు సృష్టించింది. డీజిల్ రూ.58.67కు చేరింది. తర్వాత 2016 జనవరి నాటికి ముడి చమురు బ్యారెల్ రూ.2,048కు తగ్గడంతో లీటర్ పెట్రోల్ రూ.60.63కు, డీజిల్ రూ.54.40 తగ్గింది. ఈ ఏడాది జనవరి నాటికి ముడి చమురు బ్యారెల్ రూ.4,416కు చేరడంతో పెట్రోల్ ధర రూ.75.47, డీజిల్ రూ.67.23గా చేశారు. తాజాగా ముడిచమురు ధరకు రెక్కలు రావడంతో మార్కెటింగ్ సంస్థలు రోజు వారి సవరణలతో పెట్రో, డీజిల్ ధరలను మరింత పెంచేశాయి. ప్రతిరోజు సగటున పెట్రోల్‌పై 13 నుంచి 51 పైసలు, డీజిల్æపై 11 నుంచి 48 పైసలు పెరుగుతున్నాయి. ఫలితంగా పక్షం రోజుల్లో పెట్రోల్ లీటర్‌పై రూ.2.83, డీజిల్‌పై రూ.3.36 పెరిగింది.
నగరంలో ఈ ఏడాది ఇందనధరల పెంపు(లీటర్‌పై రూ.లో) ఇలా..
నెల పెట్రోల్ డీజిల్ (రూ)
(శుక్రవారం) 86.18 79.73
సెప్టెంబర్ 1 83.25 76.37
ఆగస్టు 1 80.90 73.76
జూలై 1 80.03 73.24
జూన్ 1 82.94 75.22
మే 1 79.04 71.63
ఏప్రిల్ 1 78.08 70.16
Comments
Please login to add a commentAdd a comment