కుమ్మరించిన వాన
- ఈ సీజనులో ఇదే అత్యధికం
- గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
- 9 సెం.మీల వర్షపాతం నమోదు
- ఈ సీజనులో ఇదే అత్యధికం
- గణనీయంగా తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, విశాఖపట్నం: వాన దంచికొట్టింది. సోమవారం వేకువ జామున భారీ వర్షం కురిసింది. దాదాపు రెండు గంటల పాటు కుండపోత పోసింది. ఉదయానికి కాస్త తగ్గుముఖం పట్టింది. మధ్యాహ్నం, సాయంత్రం వేళ మధ్యమధ్యలో మోస్తరు వర్షం కురిసింది. ఆ సమయంలో జనం బయటకు వెళ్లలేకపోయారు. పాదచారులకే కాదు.. వాహనాలపై వెళ్లే వారూ అవస్థలు పడ్డారు. తెల్లవారుజామున కురిసిన వర్షానికి రోడ్లు చాలా వరకు జలమయమయ్యాయి.
గెడ్డలు, వర్షపు నీటితో పొంగాయి. అప్పుడప్పుడు పడ్డ వానకు ఎక్కడికక్కడే నీరు చేరడంతో నగర రోడ్లు చిత్తడిచిత్తడిగా తయారయ్యాయి. వర్షం, జల్లులే తప్ప ఈదురుగాలులు లేకపోవడం జనానికి ఊరటనిచ్చింది. సోమవారం ఉదయం 8.30 గంటల వరకు నగరంలో 9 సెం.మీల భారీ వర్షపాతం నమోదయింది. ఆ తర్వాత రాత్రి వరకు 2 సెం.మీల వర్షం రికార్డయింది. ఈ సీజనులో 9 సెం.మీల వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమం. బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం కూడా వర్షం కురవనుంది. మరోవైపు చల్లబడ్డ వాతావరణంతో విశాఖలో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా క్షీణిస్తున్నాయి. సోమవారం విశాఖ విమానాశ్రయంలో అత్యల్పంగా 26 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత 23.6 డిగ్రీలు నమోదయింది.