సాక్షి, ఒంగోలు: అవినీతి సొమ్ముతో పట్టుబడిన వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బందిపై వేటుకు రంగం సిద్ధమైంది. వీరిపై ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపడంతో కఠిన చర్యలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏకంగా సబ్‌రిజిస్ట్రార్ నుంచి అటెండర్‌వరకు వలలో చిక్కడంతో ఉన్నత స్థాయి అధికారులు ఆశ్చర్యపోవాల్సి వచ్చింది. గత ఏడాది ఆగస్టు 13న గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, ఈ ఏడాది జనవరి 21న చీమకుర్తి, మార్చి 28న దర్శి సబ్ రిజిస్ట్రార్‌కార్యాలయాల్లోని 12 మంది సిబ్బంది నగదుతో పట్టుబడ్డారు. వీరిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో శాఖాపరమైన విచారణకు కూడా ఆదేశాలందినట్లు తెలిసింది. అరెస్టులు కూడా చేయవచ్చనే వార్తల నేపథ్యంలో సదరు అధికారులు, సిబ్బంది వణికిపోతున్నారు. ఆ నాటి దాడుల్లో గిద్దలూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ. 74,315, చీమకుర్తిలో రూ..25,985, దర్శిలో రూ.. 3,65,830 దొరకడం సంచలనం కలిగించింది.
అప్పటి గిద్దలూరు సబ్ రిజిస్ట్రార్ షేక్ ఇస్మాయిల్ షరీఫ్, జూనియర్ అసిస్టెంట్ కె.రాజేంద్రకుమార్, బుక్కా ఝాన్సీబాయి (షరాఫ్), కఠారి వెంకటరత్నం (ఆఫీస్ సబార్డినేట్), చీమకుర్తి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న పీవీ రామకృష్ణ, జూనియర్ అసిస్టెంట్ జి. చినరామస్వామి (ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్), వి.నాగశిరోమణి (షరాఫ్), పి.రవి (అటెండర్), దర్శిలో ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ నామా కృష్ణమోహనరావు, కల్లూరి భారతి (జూనియర్ అసిస్టెంట్), ఆఫీసు సబార్డినేట్లు ఎల్.బాలేశ్వరి, రాజమ్మలపై చర్యలు చేపట్టాల్సిందిగా ఏసీబీ డీఎస్పీ జె.భాస్కరరావు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. నాటి ఆపరేషన్‌లో ఏసీబీ సీఐలు సుధాకర్‌రెడ్డి, టీవీ శ్రీనివాసరావు, కె.వెంకటేశ్వర్లు, చంద్రమౌళి, పి.కృపానందం పాల్గొన్నారు.
రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులపై వేటు?
Published Sat, Nov 16 2013 4:19 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement