భారంగా క్రమబద్ధీకరణ! | Regulatory burden! | Sakshi
Sakshi News home page

భారంగా క్రమబద్ధీకరణ!

Published Sun, Jan 11 2015 1:33 AM | Last Updated on Sun, Apr 7 2019 4:32 PM

భారంగా క్రమబద్ధీకరణ! - Sakshi

భారంగా క్రమబద్ధీకరణ!

  • ఉచిత రిజిస్ట్రేషన్లకే స్పందన
  • 125 గజాలను మించిన స్థలాలకు అరకొర దరఖాస్తులు
  • రిజిస్ట్రేషన్ ధర మార్కెట్‌లోకన్నా ఎక్కువగా ఉండటమే కారణం
  • ధరలపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచిస్తున్న రెవెన్యూ వర్గాలు
  • సాక్షి , హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియపై రాష్ట్ర విభజన ఎఫెక్ట్ పడింది! ప్రభుత్వ భూముల్లో నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఆయా స్థలాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన జీవో 58 కింద 125 గజాల్లోపు స్థలాల ఉచిత క్రమబద్ధీకరణకు దరఖాస్తులు వెల్లువెత్తుతుండగా, అంతకన్నా ఎక్కువ స్థలాల క్రమబద్ధీకరణకు మాత్రం స్పందన కరువైంది. ప్రత్యేకించి రాజధానిలో ఈ పరిస్థితి నెలకొంది.

    ఈ భూముల విషయంలో గతంలో ఉమ్మడి రాష్ర్ట ప్రభుత్వం భారీగా పెంచిన రిజిస్ట్రేషన్ ధరలనే పరిగణనలోకి తీసుకోవడం ఇందుకు కారణం. దీంతో దీనికి సంబంధించిన జీవో 59కు ప్రజల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. విలువైన భూములున్న షేక్‌పేట్ మండలంలో శనివారం నాటికి ఉచిత క్రమబద్ధీకరణ కోసం 453 దరఖాస్తులు రాగా, సొమ్ము చెల్లించే కేటగిరీలో మాత్రం మూడు దరఖాస్తులే రావడం పరిస్థితికి అద్దం పడుతోంది.
     
    క్రమబద్ధీకరణే భారమైందా!

    ప్రైవేటు భూముల కొనుగోలు కంటే ప్రభుత్వ భూములను క్రమబద్ధీకరించుకోవడమే అధిక భారంగా మారిందని ఆ భూముల్లో నివాసముంటున్న వారు భావిస్తున్నారు. దీంతో ఆశించిన స్పందన రావడం లేదని రెవెన్యూ వర్గాలే అంటున్నాయి. రాష్ట్రం విడిపోయాక మార్కెట్‌లో భూముల ధరలు తగ్గాయని, రిజిస్ట్రేషన్ ధరలు మాత్రం అలాగే ఉన్నాయని చెబుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య నగరాలు, పట్టణాల్లోనూ చాలాచోట్ల భూముల ప్రస్తుత మార్కెట్ ధర కన్నా రిజిస్ట్రేషన్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న వాదన వినిపిస్తోంది.

    క్రమబద్ధీకరణకు తగిన స్పందన లేకపోవడంతో రాష్ర్ట ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. కాగా, ఈ విషయంలో ప్రభుత్వం వ్యాపార దృక్పథంతో కాకుండా సరళీకరణ విధానాన్ని అవలంభించాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసాలేర్పరచుకుని ఉంటున్న వారికి ఆయా(ఆక్రమిత) స్థలాలను క్రమబద్ధీకరించడం మంచిదే అయినప్పటికీ, రిజిస్ట్రేషన్ ధరలు ఎక్కువగా ఉండడంతో కబ్జాదారులు ముందుకు రావడం లేదని అభిప్రాయపడుతున్నారు.

    ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం 2013 ఏప్రిల్ 1నుంచి రిజిస్ట్రేషన్  ధరలను పెంచింది. అయితే రాష్ర్ట విభజన తర్వాత చాలా ప్రాంతాల్లో భూముల ధరలు తగ్గినమాట వాస్తవమని అధికారులు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2013 ఏప్రిల్ 1 కంటే ముందున్న రిజిస్ట్రేషన్ ధరలను ప్రస్తుత క్రమబద్ధీకరణ ప్రక్రియకు వర్తింపజేయడం మేలని, ప్రభుత్వం ఈ విషయమై పునరాలోచించాలని కోరుతున్నారు. అలాగే దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 19 వరకు ఉన్న గడువును పెంచాలని కూడా సూచిస్తున్నారు.
     
    హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ధరలు
     
    చదరపు గజం రూ. 62 - 65 వేలు
    పంజాగుట్ట రోడ్ నంబర్ 5, 14, పంజాగుట్ట చౌరస్తా నుంచి మాసబ్‌ట్యాంకువైపు, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2, 3, 10, 12, ఎర్రగడ్డ రైతుబజార్, మసీదు ప్రాంతాలు, ఫతేనగర్ ఫ్లైవోవర్ ఏరియా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1, 10, 36, 45, 71, 78, 82, 92, శ్రీనగర్ కాలనీ, యూసఫ్‌గూడ పోలీస్ లైన్స్, వెంగళరావునగర్, ఎల్లారెడ్డిగూడ, మైత్రివనం తదితర ప్రాంతాలు
     
     చదరపుగజం ధర రూ. 42-45 వేలు
     అరోర హౌసింగ్ కాలనీ, గౌరీ శంకర్‌నగర్, కమలాపురి కాలనీ, ఇబ్రహీంనగర్, ఖాజానగర్, నందినగర్, పంజాగుట్ట రోడ్ నంబర్ 4,14, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 9, 6, 7, 13, షేక్‌పేట్, షౌకత్‌నగర్, శ్రీరాంనగర్, జోహ్రానగర్, ఆల్విన్ లేఅవుట్, భరణి లేఅవుట్, హుడా ఎన్‌క్లేవ్, ఎమ్మెల్యే కాలనీ, నందిహిల్స్, నందగిరి హిల్స్, ప్రశాసన్ నగర్, విజయ కోఆపరేటివ్ సొసైటీ.. తదితర ప్రాంతాలు
     
    చదరపు గజం రూ. 33 వేలు
    కళ్యాణ్‌నగర్, ఎర్రగడ్డ విజయ ఆసుపత్రి రోడ్, మధురానగర్, శ్రీనివాసనగర్, టోలిచౌకి రోడ్ నుంచి టూంబ్స్ వరకు, సిద్ధార్థ నగర్, విమెన్ కోఆపరేటివ్ సొసైటీ తదితర ప్రాంతాలు.
     
     చదరపు గజం రూ. 25 వేలు
     బోరబండ, రాజీవ్‌నగర్, లక్ష్మినరసింహనగర్, సాయికృష్ణనగర్, వెంకటగిరి, అలీనగర్, ఏజీ కాలనీ, ఇమాంగూడ, ఇంజనీర్స్ కాలనీ, ఎల్‌ఐసీ కాలనీ, మారుతీనగర్, నాగార్జున నగర్, నవోదయ కాలనీ, ఎస్బీహెచ్ ఆఫీసర్స కాలనీ, శాలివాహన నగర్ కాలనీ, వికాసపురి, జవహర్‌నగర్, జయప్రకాశ్‌నగర్, రహమత్‌నగర్, కృష్ణదేవరాయనగర్, శ్రీరాం నగర్, హబీబ్ ఫాతిమానగర్ తదితర ప్రాంతాలు.
     (పైన పేర్కొన్న ప్రాంతాల్లో ప్రధాన రహదారి వెంబడి తప్ప మిగిలిన స్థలాల ధరలు రిజిస్ట్రేషన్ ధరకన్నా 15 నుంచి 25 శాతం తక్కువగా ఉన్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.)
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement