ఈదర పిటిషన్ కొట్టివేత
ఒంగోలు సెంట్రల్: జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి ఈదర హరిబాబు అనర్హుడని ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులపై జిల్లా కోర్టులో ఈదర దాఖలు చేసిన పిటిషన్‌ను మొదటి అదనపు జిల్లా జడ్జి, ఎస్‌కె మహ్మద్ ఇస్మాయిల్ మంగళవారం కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. నాటకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు ఈదర హరిబాబు జెడ్పీ అధ్యక్షుడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికయ్యారు. దీంతో టీడీపీ విప్ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది.
తమ పార్టీ తరఫున గెలిచి, తాము జారీ చేసిన విప్‌ను ధిక్కరించి పార్టీ అభ్యర్థికి ఓటు వేయకపోగా, మరో పార్టీ మద్దతుతో జెడ్పీ అధ్యక్షుడిగా ఎన్నికవడం చెల్లదని రిటర్నింగ్ అధికారైన జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై ఆర్వో హరిబాబుకు నోటీసు జారీ చేశారు. అనంతరం విచారణ నిర్వహించారు. విచారణ సందర్భంగా విప్‌ను తాను తీసుకోలేదని, తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని ఈదర తెలిపారు.
విప్ జారీ చేసినట్లు సంబంధిత పత్రాలను ఆర్వోకు టీడీపీ నేతలు అందజేశారు. విచారణ అనంతరం విప్ ఉల్లంఘించినట్లు నిర్ధారించి అనర్హుడిగా కలెక్టర్ ప్రకటించారు. ఈ తీర్పుపై ఉమ్మడి రాష్ట్ర కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దిగువ కోర్టులో పరిష్కరించుకోవాల్సిందిగా హైకోర్టు పిటిషనర్‌కు సూచించింది. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం మంగళవారం కోర్టు ఈదర పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.