అవినీతి రహిత జెడ్పీగా తీర్చిదిద్దుతా
- సమర్ధుడైన అధ్యక్షునిగా పనిచేస్తా
- జిల్లాలో టీడీపీ పరిస్థితి బాగాలేదు
- విలేకరుల సమావేశంలో జడ్పీ చైర్మన్ ఈదర
ఒంగోలు సబర్బన్ : అవినీతి రహిత జిల్లా పరిషత్‌గా తీర్చిదిద్దుతానని జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు అన్నారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఆయన ఛాంబర్‌లో బుధవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ ప్రణాళిక వివరించారు. జెడ్పీలో అవినీతి పేరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రత్యేక ప్రణాళితో ముందుకు వెళ్ళేందుకు సిదంధమైనట్లు వెల్లడించారు. తాను సమర్థుడైన అధ్యక్షునిగా పనిచేసి పేరు నిలబెట్టుకుంటానన్నారు. తాను నిజాయితీగా పనిచేస్తే తన వద్ద పనిచేసే అధికారులు కూడా నిజాయితీగా పనిచేస్తారన్నారు. అందరూ తనకు సహకరించాలని విజ్ఙప్తి చేశారు.
జిల్లా రాజకీయ సంక్షోభంలో ఉందని, దీనివల్ల అభివృద్ధిలో కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఖర్చుచేసే ప్రతి రూపాయికి అకౌంట్‌బిలిటీ ఉండేవిధంగా చర్యలు చేపడతానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపార్టీలో ఉన్నారని విలేకరులు అడిగిన ప్రశ్నకు టీడీపీ నాది...ఆ పార్టీలోనే ఉన్నానని సమాధానమిచ్చారు. మరి పార్టీ అధ్యక్షుడు పార్టీ నుంచి సస్పెండ్ చేశారుకదా అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ పార్టీని స్థాపించిన అన్న ఎన్‌టిఆర్‌ను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, అయితే ప్రస్తుతం ఆయన ఫోటోతోనే పార్టీ నడుస్తుందని గుర్తు చేశారు. జిల్లాలో టీడీపీ పరిస్థితి బాగాలేదని, అయితే పార్టీని బతికించుకుంటానని అన్నారు. అన్ని విషయాలను త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని చెప్పారు. తన ఫోటోలతో ఫ్లెక్సీలు వేయొద్దని అందరికీ విజ్ఞప్తి చేశారు. బొకేలకు, పూలదండలకు కూడా దూరంగా ఉంటున్నానని వివరించారు. తాను తప్పు చేసినా వెనకాడకుండా పత్రికలు, మీడియా క చ్చితంగా వెలుగులోకి తీవాలన్నారు.