
రేమిడిచర్లలో యువకుడి హత్య
మరదలితో వివాహేతర సంబంధం నెరుపుతున్న ఓ ప్రబుద్ధుడు ఆమె భర్తను అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. నమ్మకంగా పొలానికి తీసుకెళ్లి తోడల్లుడిని దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన బొల్లాపల్లి మండలం రేమిడిచర్లలో శనివారం వెలుగుచూసింది.
రేమిడిచర్ల(బొల్లాపల్లి):
వినుకొండ రూరల్ సీఐ బి.చిన మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. రేమిడిచర్లకు చెందిన భూక్యా వాగ్యానాయక్ ఉరఫ్ సాయినాయక్, అదే గ్రామానికి చెందిన భూక్యా బుజ్జినాయక్‌లు తోడల్లుళ్లు. వీరిద్దరూ ఒకే కుటుంబంలోని అక్కాచెల్లెళ్లను వివాహమాడారు. గ్రామంలో సౌమ్యుడిగా పేరున్న వాగ్యానాయక్‌కు మూడేళ్ల కుమారుడు, ఏడాది వయసు కుమార్తె ఉన్నారు.
తనకున్న ఎకరం పొలాన్ని సాగుచేసుకుంటూ వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. బుజ్జినాయక్ పొలంలో కూడా పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో బుజ్జినాయక్‌కు మరదలైన వాగ్యానాయక్ భార్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇందుకు అడ్డుగా ఉన్న ఆమె భర్త హత్యకు కుట్రపన్నాడు. పత్తి పొలానికి నీరు పెట్టాలని చెప్పి శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై తోడల్లుడిని పొలానికి తీసుకెళ్లాడు.
అప్పటికి బుజ్జినాయక్ తల్లిదండ్రులు కూడా పొలంలోనే ఉండటంతో నలుగురు కలిసి పొలానికి నీరు కట్టారు. అనంతరం శనివారం తెల్లవారుజామున పొలంలోనే వాగ్యానాయక్‌ను హతమార్చిన బుజ్జినాయక్.. ప్రమాదంగా చిత్రీకరించేందుకు గ్రామ సమీపంలోని చెరువు వద్ద ఉన్న గుంతలో మృతదే హాన్ని, ద్విచక్ర వాహనాన్ని పడవేసి వెళ్లాడు. స్థానికుల నుంచి సమాచారం తెలుసుకున్న సీఐ చిన మల్లయ్య, బండ్లమోటు పోలీసు సిబ్బందితో కలసి సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు.
మృతుడి తమ్ముడు భూక్యాకుమార్‌నాయక్ పిర్యాదు మేరకు బుజ్జినాయక్‌తో పాటు అతడి తల్లిదండ్రులు కోటేశ్వరావునాయక్, కేస్లీబాయిలపై కూడా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామన్నారు. వీఆర్వో శ్రీనునాయక్ పంచనామా నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నట్లు తెలుసుకున్న నిందితుడు పురుగుమందు తాగి ఆత్మహత్యా యత్నం చేసి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమచారం.