ఒంగోలు వన్‌టౌన్: ఆర్టీసీలో హైర్ బస్సుల సమ్మె సైరన్ మోగింది. అద్దె బస్సుల యజమానుల సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ యాజమాన్యం అవలంబిస్తున్న నిర్లక్ష్యవైఖరికి నిరసనగా ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అద్దె బస్సులన్నీ నిలిపివేసి సమ్మె చేస్తామని ఏపీ స్టేట్ హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌కు ఈ నెల 8న సమ్మె నోటీస్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆర్టీసీ యాజమాన్యం అద్దె బస్సుల యజమానులను కనీసం చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో ఈ నెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అద్దె బస్సులన్నింటినీ నిలిపివేసి నిరసన తెలపాలని అసోసియేషన్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన హైర్ బస్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఒంగోలు రీజియన్ వ్యాప్తంగా ఈ నెల 28 నుంచి అద్దె బస్సులను నిలిపివేసి సమ్మెలో పాల్గొనాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు పి.వి.మల్లేశ్వరరావు తెలిపారు. దీర్ఘకాలంగా అద్దె బస్సుల యజమానులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో ఆర్టీసీ యాజమాన్యం నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
సర్వీస్ ట్యాక్స్ చెల్లింపు సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు యాజమాన్యానికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఫలితంగా ఇప్పటికీ సర్వీస్ ట్యాక్స్ అధికారులు తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. ప్రావిడెంట్ ఫండ్ రూపంలో తమ వద్ద నుంచి కోట్ల రూపాయలు రికవరీ చేస్తూ ఆ మొత్తాన్ని తిరిగి ఇప్పించడం లేదన్నారు.
బస్సులకు చెల్లించాల్సిన అద్దె చార్జీలు ప్రతినెల 10, 25 తేదీల్లో ఇవ్వాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. దీంతో బస్సుల యజమానులు అప్పుల్లో కూరుకుపోయి వ్యాపారం చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2007, 2008, 2009 నోటిఫికేషన్ మేరకు బస్సు యజమానులకు ఇవ్వాల్సిన వేతన సవరణ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
డీజిల్ పెరిగినప్పుడల్లా ధరలు పెంచకపోవడంతో నష్టపోతున్నామని చెప్పారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అదనపు ట్రిప్పులు తిప్పినప్పుడు వాటికి ఎటువంటి అనుమతి లేకుండా ఆ బిల్లులోనే రేటు తగ్గించకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సులు ప్రమాదానికి గురైనప్పుడు సంస్థ అధికారులకు సంబంధం లేకుండా గతంలో లాగా తామే నిర్ణయం తీసుకొని సంస్థకు ఎటువంటి అప్రతిష్ట రాకుండా చూడగలమన్నారు.
వ్యాట్‌ట్యాక్స్‌కు సంబంధించి రాష్ర్టం మొత్తం మీద ఉన్న అద్దె బస్సులన్నింటి కీ ఒకే ట్యాన్ నంబర్ తీసుకొని ఆర్టీసీ యాజమాన్యమే ఆ ట్యాక్స్ చెల్లించాలని కోరారు. రాష్ట్రం మొత్తం మీద ఉన్న అద్దె బస్సులన్నింటినీ ఒకే ఇన్య్సూరెన్స్ పాలసీ తీసుకొని చెల్లిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా ఆ హామీ కూడా అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు.
ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె సైరన్
Published Thu, Sep 25 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 1:54 PM
Advertisement