‘అద్దె’కు వచ్చి ఉసురు తీశారు | 'Rental' spirit seemed to come to | Sakshi
Sakshi News home page

‘అద్దె’కు వచ్చి ఉసురు తీశారు

Published Fri, Jul 18 2014 2:18 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

‘అద్దె’కు వచ్చి ఉసురు తీశారు - Sakshi

‘అద్దె’కు వచ్చి ఉసురు తీశారు

  •     బంగారం కోసం వృద్ధురాలి హత్య
  •      నమ్మించి సొత్తు దోచుకున్న జంట
  • పెదగంట్యాడ : బంగారం కోసం ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేశారు. పెదగంట్యాడ ప్రాంతంలో గురువారం ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చిన ఓ అపరిచిత జంట ఈ దారుణానికి ఒడిగట్టిందని భావిస్తున్నారు.

    ఇటీవల ఆరిలోవలోనూ ఇదే తరహాలో హత్య జరిగిన నేపథ్యంలో ఈ రెండూ ఒక ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. నెల్లిముక్కులో బొట్టా మహలక్ష్మి (70)కి రెండంతస్తుల ఇల్లుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఆమె ఒంటరిగా ఉంటోంది. మూడో కుమారుడు చనిపోవడంతో అతని భార్య లక్ష్మి, పిల్లలు రెండో అంతస్తులోని ఒక పోర్షన్‌లో ఉంటున్నారు. మొదటి అంతస్తులో రెండు పోర్షన్లు ఖాళీగా ఉన్నాయి.

    గురువారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనంపై ఇరవై, పాతికేళ్ల వయసున్న ఓ జంట అక్కడికి వచ్చారు. ఇల్లు అద్దెకు కావాలని మహాలక్ష్మిని అడిగారు. అడ్వాన్స్ రూ. 2 వేలు ఇచ్చారు. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు వారు మళ్లీ వచ్చారు. గృహప్రవేశం చేస్తామని, ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలని లోనికి ప్రవేశించారు. వీరు గృహ ప్రవేశం చేస్తున్న సమయంలో మహలక్ష్మి కోడలు తనపిల్లలను తీసుకుని ఆస్పత్రికి వెళ్లింది. కాస్సేపటి తర్వాత ఆమె ఇంటికి చేరుకుంది.

    అపరిచిత జంట అద్దెకు అడిగిన పోర్షన్ తలుపు దగ్గరకు వేసి ఉండటం లక్ష్మి గమనించింది. పిలిచినా ఎవరూ బయటకు రాకపోవడంతో తలుపు తీసుకొని లోపలికి వెళ్లింది. మధ్యగదిలో మహాలక్ష్మి చనిపోయి కనిపించింది. దీంతో ఆమె నిశ్చేష్టురాలయింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు డీసీపీ శ్రీనివాస్, సౌత్ ఏసీపీ కె.వి.రమణ, న్యూపోర్టు సీఐ జి.శ్రీనివాస్, ఎస్‌ఐ షణ్ముఖరావు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

    డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీమ్‌ను రప్పించి వేలిముద్రలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అపరిచిత జంటే మహాలక్ష్మి గొంతు నులిమి హత్య చేశారని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మెడలోని బంగారం తాడు, చెవి ముక్కులకు ఉన్న బంగారం వస్తువులు కనిపించలేదు. ఆభరణాలకోసం దురాగతానికి పాల్పడిఉంటారని లక్ష్మి పోలీసులకు వివరించింది. ఆ వృద్ధురాలి వద్దనున్న చిక్కంలోని నగదునూ ఆ జంట కాజేసింది.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement