పరేడ్ మైదానంలో ప్రసంగిస్తున్న జిల్లా కలెక్టర్ వీరపాండియన్, చిత్రంలో ఎస్పీ అశోక్‌కుమార్
అనంతపురం అర్బన్: ‘‘జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించి రాష్ట్రంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుదాం. సంక్షేమాభివృద్ధి పథకాలు అర్హులందరికీ అందేలా మెరుగైన సేవలు అందించాలనే మా సంకల్పానికి ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి.’’ అని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ అన్నారు. శనివారం స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆవిష్కరించారు. సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రజలకు తన సందేశాన్ని వినిపించారు. వేడుకలో జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, ఎమ్మెల్యేలు వై.విశ్వేశ్వరరెడ్డి, వి.ప్రభాకర్ చౌదరి, ఎమ్మెల్సీలు వెన్నపూస గోపాల్‌రెడ్డి, శమంతకమణి, మేయర్ ఎం.స్వరూప, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు, ఎస్సీ జి.వి.జి.అశోక్‌కుమార్, అసిస్టెంట్ కలెక్టర్ కె.ఎస్.విశ్వనాథన్, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి, ఏఎస్పీ చౌడేశ్వరి, ఓఎస్‌డీ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘‘వ్యవసాయం, అనుబంధ రంగాల్లో రెండంకెల వృద్ధికి కృషి జరుగుతోంది. వ్యవసాయం, పండ్లతోటల విస్తీర్ణం 8.91 లక్షల హెక్టార్లు కాగా.. రూ.14,731 కోట్ల ఆదాయానికి పెరిగి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని మరింతగా పెంచి జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రైతులను ప్రోత్సహిస్తున్నాం. 2024 నాటికి 8 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు పెంచడం ద్వారా 64 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడితో రూ.20 వేల కోట్ల ఆదాయం తీసుకోవాలనే లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాను వందశాతం డ్రిప్ వినియోగించే ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాం. పశు సంవర్ధక, సెరికల్చర్, మత్స్య రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం.’’
జల వనరులపై ప్రత్యేక దృష్టి
జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో జలవనరులపై ప్రత్యేక దృష్టి సారించాం. 3.45 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే లక్ష్యంతో హంద్రీనీవా ప్రాజెక్టు రెండు దశల పనులు పూర్తయ్యాయి. పుంగనూరు బ్రాంచ్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. మడకశిర బ్రాంచ్ కెనాల్ పనులు చివరి దశలో ఉన్నాయి. జిడిపల్లి, గొల్లపల్లితో పాటు ఈ ఏడాది మారాల, చెర్లోపల్లి జలాశయాలకు కృష్ణా జలాలను ఇచ్చాం. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్, హెచ్‌ఎల్‌సీ, మైనర్ ఇరిగేషన్ ద్వారా జిల్లాకు 170.817 టీఎంసీల నీరు చేరింది. మడకశిర, హిందూపురం, పెనుకొండ నియోజకవర్గాల్లోని మారుమూల ప్రాంతాలకు కృష్ణా నీటిని అందించాం. ఈ ఏడాది జిల్లాకు 92.073 టీఎంసీల నీరు విడుదల చేయగా, 82 చెరువులకు నీటిని ఇవ్వడం వల్ల 7.20 టీఎంసీల మేర భూగర్భజలం వృద్ధి చెందింది.
పేదలను ఆదుకునేలా ఉపాధి
ఉపాధి హామీ పథకం ద్వారా పేదలను ఆదుకునేలా పనులు కల్పిస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.302 కోట్లు వేతనంగా కూలీలకు చెల్లించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ నెల వరకు రూ.385 కోట్ల వేతనం చెల్లించడం ద్వారా జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచింది. భూగర్భ జలాలు పెంచే లక్ష్యంతో పంట సంజీవని కింద లక్ష పంట కుంటలు లక్ష్యం కాగా రూ.568.38 కోట్ల ఖర్చుతో 1,05,205 పంట కుంటలు పూర్తి చేయడం ద్వారా దేశంలోనే జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ
ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచి, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. గత ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 59,109 మందికి ఎన్‌టీఆర్ వైద్య సేవ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించాం. ఇందుకు రూ.155 కోట్లు వెచ్చించాం. 108, ఎన్టీఆర్ వైద్య పరీక్షలు, తల్లిబిడ్డా ఎక్స్‌ప్రెస్, ఈ–ఔషిధి, చంద్రన్న సంచార చికిత్స, మహిళా హెల్త్ చెకప్, తదితర పథకాల ద్వారా పేదలకు మెరుగైన సేవలు అందిస్తాం.
విద్యాభివృద్ధికి ప్రత్యేక స్థానం
విద్యాభివృద్ధికి ప్రత్యేక స్థానం కల్పించాం. సర్వశిక్షా అభియాన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.83.03 కోట్లు విడుదల కాగా, రూ.55.65 కోట్లు ఖర్చు చేశాం. కస్తూరిబా పాఠశాలల్లో వసతుల కల్పన, పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ఆవాసరహిత ప్రత్యేక శిక్షణా కేంద్రాల ద్వారా శిక్షణ, మదరసాలతో వాలంటీర్ల నియామకం, 1 నుంచి 8వ తరగతి వరకు చదువుతున్న బాల, బాలికలకు యూనిఫాం తదితర కార్యక్రమాలకు ఈ ఖర్చు చేశాం. 125 పాఠశాలల్లో డిజిటల్ బోధన, పర్చువల్ క్లాస్ రూర్ స్టూడియో నిర్మించాం.
అర్హులకు సంక్షేమ పథకాలు
అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకున్నాం. పేదలకు ఎన్టీఆర్ ఇళ్లు, రేషన్ కార్డులు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు, తదితరాలను అందిస్తూ వారి ఆర్థిక ఎదుగుదలకు చర్యలు తీసుకున్నాం. పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి పరిచేలా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment