గుంటూరు రూరల్ : ప్రేమను తిరస్కరించారనే కారణంతో యువతులపై జరిగిన యాసిడ్ దాడులు చూశాం. ఇందుకు విరుద్ధంగా ఓ యువతి ప్రేమ పేరుతో తన జీవితంతో చెలగాటమాడిన అధ్యాపకుడిపై యాసిడ్ దాడికి పాల్పడింది. గుంటూరు రూరల్ మండలం నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాల వద్ద శనివారం జరిగిన ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది.
వివరాలు..
నరసరావుపేట మండలం కాకాని గ్రామానికి చెందిన గింజుపల్లి సుబ్బారావు మూడో కుమార్తె సౌజన్య స్థానిక పాలడుగు నాగేశ్వరరావు డిగ్రీ కళాశాలలో 2009లో డిగ్రీ చదివింది. ఆ సమయంలో అక్కడ గణిత అధ్యాపకుడిగా ఉన్న నగరం మండలం పరసాయపాలేనికి చెందిన పి.వెంకటరమణకు ఆమెతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం సౌజన్య వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతోంది. వెంకటరమణ నల్లపాడు పాలిటెక్నిక్ కళాశాలక బదిలీ అయ్యాడు. ఇప్పటికీ వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహరం నడుస్తోంది. పెళ్లికి వెంకటరమణ కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఈ ఏడాది ఆగస్టులో అనూష అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ వెంకటరమణ తనకు ఎలాంటి వివాహం జరగలేదని ఎమ్మెస్సీ పూర్తి అయ్యాక వివాహం చేసుకుందామని సౌజన్యకు చెప్పాడు. దీంతో ఆమె ఫోన్‌లో మాట్లాడుతూనే ఉంది. వెంకటరమణకు పెళ్లయినట్లు తెలుసుకున్న సౌజన్య ఫోన్ చేసి వెంకటరమణను నిలదీసింది. అప్పటి నుంచి ఆమె ఫోన్ నంబరు కూడా వెంకటరమణ తీసి వేశాడు. దీంతో సౌజన్య తనను మోసగించినవాడిని హతమార్చి, తానూ ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. వైజాగ్‌లో ఓ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి సల్ఫూరిక్ యాసిడ్‌ను కొనుగోలు చేసి శనివారం మధ్యాహ్నం గుంటూరు చేరుకుంది.
1.35 గంటల సమయంలో నల్లపాడు కళాశాల వద్ద కాపు కాసింది. భోజన సమయంలో బయటకు వచ్చిన వెంకటరమణపై ముందుగానే జగ్గులో సిద్ధంగా ఉంచుకున్న యాసిడ్‌తో దాడి చేసింది. వెంకటరమణ శరీరంపై ఉన్న దుస్తులతో పాటు ముఖం అంతా కాలిపోయింది. దాడి సమయంలో జగ్గును వెనక్కు నెట్టడంతో సౌజన్య మోఖం, చేతుల పైన స్వల్ప గాయాలు అయ్యాయి. కళాశాల సిబ్బంది వెంకటరమణను ఆసుపత్రికి తరలించారు. రూరల్ సీఐ అజయ్‌కుమార్ సిబ్బందితో వచ్చి సౌజన్యను స్టేషన్‌కు తరలించారు. ఆమెకు కూడా గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
చనిపోదామనుకున్నా..
ఐదేళ్లుగా ప్రేమించి వివాహం చేసుకుంటానంటూ వెంకటరమణ తన జీవితంతో ఆడుకున్నాడని సౌజన్య కన్నీటి పర్యంతమయింది. మరొకరిని వివాహం చేసుకుని మోసగించిన అతడిని హతమార్చి తాను కూడా చనిపోదామని నిశ్చయించుకున్నానంది. అధ్యాపకుడిపై యాసిడ్ దాడి చేసిన సౌజన్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ప్రతీకారం
Published Sun, Dec 21 2014 2:05 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement