విజయనగరం కంటోన్మెంట్ : జిల్లా పరిపాలనా కేంద్ర కార్యాలయమైన కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖలోని ఉద్యోగుల మధ్య అంతర్యుద్ధం కొనసాగుతోంది. కొంత మంది సీనియర్ ఉద్యోగులు వేధిస్తున్నారంటూ కింది స్థాయి ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడంతో పాటు కలెక్టర్ ఎంఎం నాయక్, జేసీ రామారావులకు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ శాఖలోని ఉద్యోగుల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న అంతర్యుద్ధం వెలుగులోకి వచ్చింది. ఏఓ రమణమూర్తి, సీ సెక్షన్ సూపరింటెండెంట్ వాణి తమను వేధిస్తున్నారంటూ పలువురు ఉద్యోగులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పని వేళలు దాటిపోయినా ఉండమంటున్నారనీ ఫిర్యాదు చేశారు. బంధువులు చనిపోయి వెళ్లాలన్నా లెటర్ రాసాకే వెళ్లాలంటున్నారనీ ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై జిల్లా రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు తదితరులు వెళ్లి ఉన్నతాధికారులతో మాట్లాడారు. అరుునా ఫలితం లేకపోయింది. సెక్షన్ ఉద్యోగుల సమస్యలను తామే పరిష్కరించుకుంటామని సంఘ నాయకులకు కలెక్టర్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే కలెక్టరేట్‌లోని కొందరు ఉద్యోగులు సమయ పాలన పాటించకపోగా తమ సెక్షన్‌లో కాకుండా ఇతర సెక్షన్‌లలో కూడా కూర్చుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయిన డీఆర్వో హేమసుందర్ స్థానంలో అదనపు బాధ్యతలు స్వీకరించిన ఏజేసీ నాగేశ్వరరావు కూడా తమను నిర్లక్ష్యంగా చూస్తూ మాట్లాడుతున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. అయితే సెక్షన్‌లోని ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదనీ సీనియర్లు ఉన్నతాధికారులతో చెప్పినట్టు సమాచారం. ఇలా ఫిర్యాదులతో కలెక్టరేట్‌లో వాతావరణం వేడెక్కుతోంది. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనన్న ఉత్కంఠ ఉద్యోగ వర్గాల్లో నెలకొంది.
కలెక్టర్‌కు వెళ్లాల్సిన లెటర్లు కూడా ఆలస్యం!
కలెక్టర్‌కు వివిధ కార్యాలయాల నుంచి లెటర్లు వస్తుంటాయి. వీటిని సకాలంలో పంపించడానికి కింది స్థాయి ఉద్యోగులే కీలకం. ఇటీవల కోర్టులో జరిగే ఓ సమావేశానికి హాజరు కమ్మని లెటర్ రాగా ఆ లెటర్ కలెక్టర్‌కు చేరలేదు. దీంతో ఎందుకు చేరలేదని సంజాయిషీ కోరుతూ కలెక్టర్ పేరున లెటర్ రావడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. సెక్ష న్‌లోని ఉద్యోగులెవరూ పీఆర్, డీఆర్‌లు రాయడం లేదని(పర్సనల్ రికార్డు, డెయిలీ రికార్డు) చెబుతున్నారు. ప్రతీ ఉద్యోగి పీఆర్ రాస్తూ దానిని ఎవరికి బదలాయించారో, లేక పరిష్కరించారోనన్న విషయాలు పేర్కొనాలి. కానీ అలా జరగడం లేదు. దీనిపై పలువురు ఉన్నతాధికారులు కింది స్థాయి ఉద్యోగులను ప్రశ్నిస్తున్నారు. దీంతో కింది స్థాయి ఉద్యోగులు ఎప్పుడూ లేనిది ఈ ఛార్టు ఉద్యోగాలు తమకేంటన్న విసుగు ప్రదర్శించడంతో వీరి మధ్య విబేధాలు ముదిరి పాకాన పడ్డాయి.
అయితే జిల్లా రెవెన్యూ సంఘ నాయకులు వచ్చినా ఈ సమస్యకు పుల్‌స్టాఫ్ పడలేదు. మరోవైపు జిల్లా కేంద్రంలోని సీ సెక్షన్‌పై కొందరు దృష్టి సారించడం, ఆ సెక్షన్‌లో చేరేందుకు కొందరు చూపిస్తున్న ఉత్సాహం కూడా ఈ వివాదాలకు కారణంగా చెబుతున్నారు. తమ విధులను సక్రమంగానే నిర్వర్తిస్తున్నప్పటికీ తమపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కింది స్థాయి ఉద్యోగులు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే అందరం సమన్వయంగా పని చేసుకుంటేనే కీలకమైన రెవెన్యూ శాఖలో మంచి ఫలితాలను సాధించగలమని జాయింట్ కలెక్టర్ రామారావు స్పష్టం చేశారు. మాదంతా ఒకే కుటుంబమని ఇటువంటివి సాధారణమేననీ తేలికగా తీసేశారు. కానీ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని ఉద్యోగ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.
రెవెన్యూలో అంతర్యుద్ధం
Published Sun, Sep 28 2014 2:55 AM | Last Updated on Thu, Mar 21 2019 7:28 PM
Advertisement
Advertisement