అక్రమార్కులతో చెట్టపట్టాలు!
లేని సర్వే నంబర్లు సృష్టిస్తున్న రెవెన్యూ సిబ్బంది
రిజిస్ట్రేషన్ లేకుండా భూముల ఆన్‌లైన్
పెరిగిపోతున్న భూ అక్రమాలు వత్తాసు పలుకుతున్న అధికారులు
అవినీతంతా రెవెన్యూలో ఉందని ఇటీవల సీఎం చేసిన వ్యాఖ్యలు జిల్లాకు సరిగ్గా సరిపోతున్నాయి.
కాసులిస్తే తిమ్మిని బమ్మిని చేసేస్తున్నారు.
ప్రభుత్వ భూములను తమ సొంత సొత్తులా వేరేవారికి రాసేస్తున్నారు. ఇంకొంచెం పెద్ద
మొత్తం జేబులో పడితే ఏకంగా కొత్త సర్వేనంబర్లు సృష్టించేస్తున్నారు. చాలా తహశీల్దారు
కార్యాలయాల్లో చేయి తడ పందే చిన్న కాగితం కూడా ముందుకు కదలడంలేదు. సమస్యలు
పరిష్కారంకాకపోవడంతో రైతులు, సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు.
పై చిత్రంలో కనిపిస్తున్నది. గజపతినగరంలోని వి లువయిన ప్రభుత్వ భూమి. సర్వే నంబర్ 195/8. ఈ భూమిని 25 సెంట్లు ఐసీడీఎస్‌కు కేటాయించారు. మిగిలిన 15 సెంట్లు ఎన్‌జీఓ భవనానికి కేటాయించారు. అయితే గజపతినగరం అధికారులు సమైక్యాంధ్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో నలుగురికి ఇళ్ల పట్టాల కోసం ఇచ్చేశారు. ఎలా అంటే సర్వే కొత్త సర్వే నంబర్ సృష్టించి. వాస్తవానికి ఈ భూమి సర్వే నంబర్ 195లో 8. అయితే ఇళ్ల పట్టాల కోసం 195లో 6 అంటూ సరికొత్తగా సర్వేనంబర్ సృష్టించి రాసిచ్చేశారు. ఈ స్థలాన్ని చదును చేస్తుం డగా స్థానికులు అడ్డుకుని అధికారులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోకపోవడంతో న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు.
ఇక్కడ పోలీసులు ఉన్నది ఏ హత్య కేసో.. దొంగతనం కేసు గురించోకాదు...రెవెన్యూ కార్యాలయంలో జరిగిన తప్పుల గూర్చి పోలీసు కేసు నమోదైంది. గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఎరుబోతు రాములు అనే వ్యక్తికి గ్రామ పురోణి ద్వారా కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా ఆన్‌లైన్ చేసేశారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు నంబర్లు వేసి ఆన్‌లైన్ చేయాల్సిన భూమిని నేరుగా ఆన్‌లైన్ చేసి పాత పట్టాదారు పాసుపుస్తకాల్లో నమోదు చేసేశారు. విచిత్రం ఏమిటంటే ఈ విషయం తెలిసి రాద్ధాంతమయితే తిరిగి ఆన్‌లైన్లో పేర్లు మళ్లీ మార్పు చేశారు.
మరో కేసు చూస్తే నోళ్లెళ్లబెట్టడం ఖాయం. గజపతినగరం మరుపల్లి గ్రామానికి చెందిన ఓ విద్యాసంస్థ యజమాని రుణం పొందేందుకు వీలుగా .. ఇతర రైతుల భూములను ఆయన పేరున రెవెన్యూ అధికారులు రాసిచ్చారు. రెడ్డి నారాయణ రావు అనే వ్యక్తి తమ గ్రామంలోని పలువురికి చెందిన సుమారు 15 ఎకరాలపైనే తన పేరున తహశీల్దార్ కార్యాలయంలో రాయించుకున్నారు. కేవలం రెవెన్యూ అధికారులను లోబర్చుకునే ఆ పని చేశారని, తమ భూములను అన్యాయంగా వేరొకరి పేరున ఉంటూ దానిపై కోట్లాది రూపాయల రుణాలు వాడుకుంటున్నారని సంబంధిత వ్యక్తులు పలుమార్లు అధికారుకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.
ఇవి మచ్చుకు మాత్రమే జిల్లా వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలు ఎంచక్కా ఆక్రమిస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. చాలా మంది ఆక్రమణదారులకు సహకరిస్తున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దార్‌లకు ఇచ్చిన డిజిటల్ సంతకాలను కింది స్థాయి సిబ్బంది వినియోగిస్తున్నారు. మరి కొన్ని చోట్ల అధికారులే కింది స్థాయి సిబ్బందికి ఎలా చేయాలో చెబుతున్నారు. దీంతో భూములు చేతులుమారిపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో తమ సమస్యలు పరిష్కరించాలని సాధారణంగా దరఖాస్తు చేసుకుంటారు. వచ్చిన క్రమాన్ని బట్టి వాటిని ఆయా అధికారులు పరిష్కరించాలి. కానీ దరఖాస్తుతో పనిలేకుండా పలు కార్యాలయాల్లో పనులు జరిగిపోతున్నాయి. కొన్ని పనులకు రేటు కట్టి వసూలు చేస్తున్నారు.
దీని ప్రకారం పనులు దరఖాస్తు లేకుండానే ఎంచక్కా చేసేస్తున్నారు. దీంతో జిల్లాలో దరఖాస్తు చేసుకుని తమ సమస్య ఎప్పటికైనా పరిష్కరించకపోతారా అని ఎదురు చూస్తున్న వారి పత్రాలు చెదలు తినేస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా మీ ఇంటికి మీ భూమిలో 1.25లక్షల దరఖాస్తులు వస్తే, నేరుగా తహశీల్దార్ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య మరో 50 వేలుంటుందని అంచ నా. అలాగే తిరిగి తిరిగి సమస్య పరిష్కరించే నాథుడే లేడని వదిలేసినవి మరో 25 వేలుంటాయి. జిల్లాలో గంట్యాడ, గజపతినగరం, కొత్తవలస, భోగాపురం, విజయనగరం, చీపురుపల్లి, సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం ప్రాంతాల్లో రియల్టర్లు ఎన్నో ఎకరాలను ఆక్రమించుకున్నారు. చెరువులు, వాగులు, వంకలు ఆక్రమించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటే దీనికి కారణం ఆమ్యామ్యాలేనని పలుమార్లు బహిరంగ ఆరోపణలు వినవస్తున్నాయి.