ఎఫ్‌సీఐకి మొండిచేయి చూపిన మిల్లర్లు
బహిరంగ మార్కెట్‌కు బియ్యం తరలింపు
అడ్డదారిలో సొమ్ముచేసుకున్న వైనం
లక్ష్యాన్ని మరచి పౌర సరఫరాల శాఖ వత్తాసు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైస్ మిల్లర్లు మాయ చేశారు. పంట దిగుబడి రాలేదని బుకాయించి లెవీ కింద భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)కు ఇవ్వాల్సిన ధాన్యాన్ని ప్రైవేటుకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. అయితే మిల్లర్లు చెప్పిన కుంటిసాకులకు జిల్లా పౌర సరఫరాల శాఖ యంత్రాంగం కూడా తలూపింది. దీంతో ఎఫ్‌సీఐకి భారీ నష్టం వాటిల్లడమే కాకుండా లెవీ సేకరణ లక్ష్యం నీరుగారిపోయింది. రైస్ మిల్లర్లు రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మరపట్టించిన తర్వాత వచ్చే బియ్యంలో 75శాతం ప్రభుత్వానికి లెవీ కింద ఇవ్వాల్సి ఉంటుంది.
ఇలా తీసుకున్న బియ్యం తిరిగి ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు సరఫరా అవుతుంది. ఇందులో భాగంగా జిల్లాలో 104 రైస్‌మిల్లుల పరిధిలో గతేడాదికి సంబంధించి 85వేల టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి లెవీ రూపంలో ఇవ్వాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ధేశించింది. సెప్టెంబర్ 30వతేదీ నాటికి ఈ బియ్యం ఎఫ్‌సీఐకి అప్పగించాలని సూచించింది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో బియ్యం సేకరణ ప్రారంభించిన సదరు శాఖ లక్ష్యాన్ని చేరలేకపోయింది. గడువు ముగిసే నాటికి కేవలం 46,396 టన్నుల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి చేర్చగలిగింది.
బయటి ధర అధికం.. అందుకే..
బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కిలో బియ్యం ధర కనిష్టంగా రూ.32 వరకు ఉంది. అయితే ప్రభుత్వానికి లెవీ రూపంలో ఇచ్చే బియ్యం ధరలు పరిశీలిస్తే 2012-13 సంవత్సరం లెక్కల ప్రకారం సాధారణ రకం క్వింటాలుకు రూ.2,082, ఉప్పుడు (బాయిల్డ్) బియ్యం రూ.2,114గా ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఎఫ్‌సీఐకి ఇస్తే ఏం లాభమని భావించిన మిల్లర్లు పెద్ద ఎత్తున బియ్యాన్ని బహిరంగ మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పంట దిగుబడులు తగ్గినందునే...
ఈ ఏడాది జిల్లాలో పంట దిగుబడులు తగ్గినందునే ధాన్యం ఉత్పత్తులు తక్కువగా వచ్చాయి. అందువల్లే ప్రభుత్వం విధించిన లెవీ లక్ష్యం సాధించలేకపోయాం. మొత్తంగా ఈ ఏడాది లెవీ కింద రావాల్సిన బియ్యం కోటాలో 38,604 టన్నుల బియ్యానికి కోత పడింది.
- నర్సింహారెడ్డి, డీఎస్‌ఓ
సీఎంఆర్ లక్ష్యం పూర్తి..
జిల్లాలో గతేడాది రబీ సీజన్‌లో మహిళా సంఘాలు, డీసీఎంఎస్, పీఏసీఎస్‌ల ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 3,052 మెట్రిక్ టన్నుల (సీఎంఆర్..కస్టమైజ్డ్ మిల్లింగ్ రైస్) బియ్యాన్ని జిల్లా యంత్రాంగం కొనుగోలు చేసింది. వీటిని మిల్లింగ్‌కు గాను 10 రైస్ మిల్లులకు పంపారు. గతనెల 30 నాటితో మిల్లింగ్‌చేసి ఎఫ్‌సీఐకి చేరవేయాల్సి ఉంది. జిల్లా పౌరసరఫరాల సంస్థ ఆయా మిల్లుల నుంచి మొత్తం 2,123 మెట్రిక్ టన్నుల బియ్యం సేకరించింది. నిర్దేశించిన లక్ష్యాన్ని వందశాతం చేరుకున్నాం.
-ప్రభు, జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్
లెవీకి ఎగనామం!
Published Thu, Oct 3 2013 12:41 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement