హక్కుల ‘పంచాయతీ’!
పీఆర్ ఉద్యోగులు ఐక్యంగా నిలవాలి: హరిహరనాథన్
గుంటూరు వెస్ట్: పంచాయతీరాజ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు హక్కుల కోసం ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధపడాలని ఎంపీడీవోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.హరిహరనాథన్ పిలుపునిచ్చారు. ఏపీ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం గుంటూరులోని జిల్లాపరిషత్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీఆర్ శాఖలోని ఉద్యోగులు ఏళ్లతరబడి ప్రమోషన్లు లేక నిరాశలో ఉన్నారన్నారు. రెవెన్యూశాఖలో తమకంటే వెనుక విధుల్లో చేరినవారు తక్కువ కాలంలోనే పదోన్నతులు పొందుతున్నారని చెప్పారు. దీంతో పీఆర్ ఉద్యోగులు ఐక్యంగా హక్కులను సాధించుకోవాలని ఉద్ఘాటించారు.
అశోక్‌బాబూ.. చిన్నచూపు వద్దు
ఎంపీడీవోల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ జి.జోసెఫ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌శాఖలో 30 వేల మందికిపైగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఎన్‌జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌బాబు దీన్ని గుర్తెరిగి పంచాయతీరాజ్ ఉద్యోగులను చిన్నచూపు చూడటం మానుకోవాలన్నారు. ఉద్యోగులు రోడ్డెక్కకుంటే సమస్యలు పరి ష్కారం కావని ఎంపీడీవోల సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.బ్రహ్మయ్య అన్నారు. పాల కుల నిర్లక్ష్యంతో పంచాయతీ రాజ్ వ్యవస్థ బలహీనపడుతోందని ఏపీ మిని స్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు చెప్పారు. తమ అసోసియేషన్‌తో సంబంధం లేకుండా ఈనెల 9న విజయవాడలో నిర్వహిస్తున్న సమావేశాన్ని ఉద్యోగులు బహిష్కరించాలని సమావేశంలో తీర్మానించారు.