
జీపీఎస్‌తో ట్రావెల్
రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల్లో అత్యాధునిక జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) తోడ్పడుతుంది.
- అనుసంధానంతో ప్రమాదాలకు చెక్
- ప్రైవేటు వాహనదారుల నిరాసక్తత
- అక్కరకు రాని అత్యాధునిక వ్యవస్థ
రోడ్డు ప్రమాదాల నివారణకు వాహనాల్లో అత్యాధునిక జీపీఎస్ (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం) తోడ్పడుతుంది. అయితే ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ప్రైవేటు ట్రావెల్స్, ఆర్‌టీసీ, ట్రాన్స్‌పోర్టు కంపెనీలు పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రవాణా శాఖ పట్టించుకోవడం లేదు. వాహనాల్లో ఈ వ్యవస్థ ఏర్పాటును తప్పనిసరి చేయాలని, తద్వారా ప్రమాదాలను అరికట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
యలమంచిలి, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. ప్రమాదాలప్పుడు హడావిడి చేసి వాహనాలు తనిఖీ,జరిమానాలతో మమ అనిపించే రవాణాశాఖ అనంతరం అంతకు మించి ప్రమాదాల నివారణకు చేపడుతున్న చర్యలు శూన్యం.
అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా,వినియోగించడంలో వాహనదారులు, అమలులో రవాణా అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలకు అడ్డుకట్ట పడడం లేదు. వాస్తవంగా పైవేట్ ట్రావెల్స్‌తోపాటు పలు వాహనాల అతివేగం, నిద్రలేమి, మద్యం అలవాటు, రాంగ్‌రూట్ ప్రయాణాలవల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటి నివారణకు వాహనాల్లో జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటు ఎంతో దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రూ.కోట్లలో వ్యాపారం చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్, ట్రాన్స్‌పోర్టు యజమానులు తక్కువ ఖర్చుతో సమకూరే జీపీఎస్ సిస్టం ఏర్పాటుకు మాత్రం సుముఖంగా లేరు. కార్లు, చిన్నవాహనాల్లో జీపీఎస్ సిస్టం ఏర్పాటుకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు ఖర్చవుతుండగా భారీ వాహనాల్లో రూ. 40 నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. రాష్ట్రంలో కేవలం రెండు మూడు ప్రముఖ ట్రావెల్స్ మాత్రమే కొన్ని బస్సుల్లో జీపీఎస్ సిస్టంను అమలు చేస్తున్నాయి. రాజస్తాన్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంను విజయవంతంగా అమలుచేస్తోంది.
జీపీఎస్ పరికరమంటే...
జీపీఎస్ పరికరాన్ని వాహనాల్లో అమర్చి ఆన్‌లైన్ ద్వారా ప్రైవేట్ ట్రావెల్స్ కార్యాలయాల్లో ఉన్న కం ప్యూటర్లకు అనుసంధానిస్తారు. వాహనం ఎంత వేగంతో ప్రయాణిస్తోంది...! ఏ మార్గంలో వెళ్తుం దన్న విషయాలను క్షణాల్లో తెలుసుకోవచ్చు. వాహనాలు ప్రమాదాలకు గురయినపుడు, వాహనాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఎవరి ప్రమేయం లేకుండా జీపీఎస్ సిస్టం ద్వారా కం ప్యూటర్లకు సమాచారం చేరుతుంది. దాని ఆధారం గా నిర్వాహకులు సత్వరం స్పందించి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాహనాలను అతివేగంగా నడిపినపుడు జీపీఎస్‌ద్వారా సమాచారం చేరవేసి డ్రైవర్లను హెచ్చరించే అవకాశాలున్నాయి.
వాహనాలు చోరీకి గురి కాకుండా...
వాహనాలు చోరీకి గురయినపుడు జీపీఎస్ సిస్టం ద్వారా వాహనాల ఆచూకీని వెంటనే పసిగట్టవచ్చు. గతేడాది అక్టోబరు నెలలో జిల్లాలోని నక్కపల్లి సమీపంలో ఆయిల్‌ట్యాంకరు చోరీకి గురయినపుడు జీపీఎస్ సిస్టం ద్వారా వాహన ఆచూకీని పోలీసులు కనిపెట్టారు.
జీపీఎస్ ఏర్పాటు తప్పనిసరి చేయాలి
వాహనాల్లో జీపీఎస్ సిస్టం ఏర్పాటు చేయాలన్న నిబంధనను మోటారు వాహనాల చట్టంలో చేర్చాలి. జీపీఎస్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈ వ్యవస్థను రెండేళ్ల క్రితం వరకు కొంతమంది ట్రాన్స్‌పోర్ట్ యజమానులు ఏర్పాటు చేసేవారు. ప్రస్తుతం ఈ పద్ధతిని పెద్దగా పట్టించుకోవడంలేదు. వాహనాల్లో జీపీఎస్ విధానం అమలులో పలు రాష్ట్రాలు బాగా ముందున్నాయి. జీపీఎస్ సిస్టం ఏర్పాటు ద్వారా 50 శాతం ప్రమాదాలను నివారించవచ్చు.
- సలీం, ఆర్‌టీవో, అనకాపల్లి