వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టడంతో ఓ ఎం.ఫార్మసీ విద్యార్థి మృతి చెందగా మరో నలుగురు విద్యార్థులు గాయాలపాలైన సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
హైదరాబాద్, న్యూస్‌లైన్: వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టడంతో ఓ ఎం.ఫార్మసీ విద్యార్థి మృతి చెందగా మరో నలుగురు విద్యార్థులు గాయాలపాలైన సంఘటన శుక్రవారం హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... చిత్తూరు జిల్లాకు చెందిన అర్తల రామ్మూర్తి (28) నగరంలోని కేర్ ఆస్పత్రిలో పనిచేస్తూ, బాటసింగారంలోని ఎస్‌ఎల్‌సీ కళాశాలలో ఎం.ఫార్మసీ చదువుతున్నాడు. శుక్రవారం మొదటి సంవత్సరం పరీక్షకు హాజరై తోటి విద్యార్థులు కోదండ రాముడు, తిమోదిన్‌లతో కలిసి పల్సర్ బైక్(ఏపీ09సీఎల్ 8070)పై నగరం వైపు వస్తున్నాడు.
ముషీరాబాద్‌లో నివాసి బాబు కుమారుడు ఇంటర్ విద్యార్థి నరేష్, రాంనగర్‌లోని ప్రై వేటు పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సుప్రియలు బైక్(ఏపీ03ఏజెడ్ 4916)పై వస్తూ అబ్ధుల్లాపూర్ గండిమైసమ్మ వద్ద మలుపు తిరుగుతున్నారు. నగరం నుంచి వేగంగా వస్తున్న ఇన్నోవా కారు (ఏపీ37బీపీ 0001) అదుపుతప్పి డివైడర్‌కు అవతలి వైపు దూసుకెళ్లి రెండు బైకులను ఢీ కొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న రామ్మూర్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో బైక్‌పై ఉన్న నరేష్, సుప్రియలు తీవ్రంగా గాయపడ్డారు.
రామ్మూర్తి బైక్‌పై ఉన్న తిమోదిన్, కోదండ రాముడుకు గాయాలయ్యాయి. దీంతో వారిని చికిత్స నిమిత్తం హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో నరేష్ పరిస్థితి విషమంగా ఉండడంతో మరో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు ఆదిత్య ఫిషరీస్ ప్రై వేట్ లిమిటెడ్ కంపెనీ ఎండీకి చెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.