వైరా(ఖమ్మం), న్యూస్‌లైన్ : స్నేహితుని సోదరుడి పెళ్లికి సరదాగా గడుపుదామని వెళ్లిన మిత్రబృందాన్ని విధి వక్రీకరించింది. మరో గంటలో పెళ్లి ఇంటికి చేరుకుంటామనేలోపే మృత్యువు కబళించింది. ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజీ పినపాక వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఇందులో జిల్లాకు చెందిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన యువకులు ఉన్నారు. మృతిచెందిన వారిలో బెల్లంపల్లి ఏరియా బజార్‌కు చెందిన బాల ప్రదీప్(31), కిరణ్(30), కడప జిల్లాకు చెందిన శ్రీధర్‌రెడ్డి(30) ఉన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన కోణతం వరుణ్ కృష్ణ సోదరుడు వంశీ వివాహం ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన శ్రావణితో శనివారం వేకువజామున ఉంది. పెళ్లి కుమారుడు వంశీకి ఖమ్మంలోని అమ్మమ్మ ఇంట్లో శుక్రవారం మధ్యాహ్నం ఒడుగు చేశారు. ఈ కార్యక్రమానికి వరుణ్‌కృష్ణ, ఆయన స్నేహితులు హాజరయ్యారు. ఇది ముగిసిన తర్వాత ఖమ్మం నుంచి పెళ్లికొడుకు కారు బయలుదేరగా, వెనుక కారులో ఆరుగురు స్నేహితులు సత్తుపల్లి బయలుదేరారు.
అతివేగంగా వస్తున్న వీరి కారు వైరా మండలం స్టేజీ పినపాక వద్ద రోడ్డు ఏడమ వైపు నుంచి ఒక్కసారిగా కుడివైపుకు వచ్చి రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జు అయింది. ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, కిరణ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. గాయపడ్డ వారిలో సికింద్రాబాద్‌కు చెందిన కోణతం వరుణ్‌కృష్ణ, వరంగల్ జిల్లాకు చెందిన హరి, డ్రైవర్ కిరణేశ్వర్ ఉన్నారు. బీరం శ్రీధర్‌రెడ్డి చెన్నైలో, కిరణ్ ఆదిలాబాద్‌లో పనిచేస్తుండగా, బాల ప్రదీప్ బెల్లంపల్లిలో వ్యాపారం చేస్తున్నారు.
ప్రదీప్ 2009 హైదరబాద్‌లోని జేబీఐటీలో పూర్తి చేశాడు. సత్యనారాయణ, విజయల చిన్న కుమారుడు. కిరణ్ 2009లో జేబీఆర్‌ఈసీ హైదరాబాద్‌లోని కాలేజీలో ఈఈఈ పూర్తి చేశాడు. కళావతి, సమ్మయ్య తల్లిదండ్రులకు చిన్న కుమారుడు. గాయడిన వరుణ్‌కృష్ణ అమెరికాలో, హరి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న పెళ్లికొడుకు బంధువులు హుటాహుటిన అక్కడకు వచ్చారు. ప్రమాదం జరగడంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఖమ్మంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మృత్యువులోనూ వీడని స్నేహం
Published Sat, Aug 24 2013 7:00 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement